గాంధీ జయంతి నుంచి.. గ్రామ సురాజ్యం

28 Jul, 2019 03:34 IST|Sakshi

గ్రామ సచివాలయాలు–వలంటీర్ల ద్వారా పరిపాలన కొత్తపుంతలు 

ప్రజల ఇంటి దగ్గరకే ప్రభుత్వ పాలన, సేవలతో విప్లవాత్మక మార్పులు

ఇక సిఫారసులు, పైరవీలకు తెర 

ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాల్సిన అగత్యం లేదు 

రేషన్‌కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు 

అర్హులందరికీ నేరుగా ఇంటికే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు  

50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీర్‌  

ఏది కావాలన్నా దరఖాస్తును గ్రామ సచివాలయానికి చేరవేస్తారు 

అర్హతలపై పరిశీలన అనంతరం ఆన్‌లైన్‌లో సెంట్రల్‌ సర్వర్‌కు దరఖాస్తు 

అర్హతలపై మరోసారి ఆన్‌లైన్‌లోనే సంబంధిత శాఖ తనిఖీలు 

72 గంటల్లోగా గ్రామ సచివాలయానికి వివరాలు 

అర్హులకు గ్రామ సచివాలయంలోనే వెంటనే రేషన్‌కార్డు ప్రింటింగ్‌ 

లబ్ధిదారులకు నేరుగా ఇంటివద్దే అందించనున్న వలంటీర్‌.. అర్హత లేదని తేలితే మూడో పార్టీ ద్వారా తనిఖీతో మరోసారి అవకాశం

సాక్షి, అమరావతి: జన్మభూమి కమిటీల మాదిరిగా లంచాల వసూళ్లు, పైరవీలు, ప్రజా ప్రతినిధుల సిఫారసులకు ఇక ఏమాత్రం తావు లేకుండా అక్టోబర్‌ 2వతేదీ నుంచి గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు కలలకన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట, ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం మేరకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుతో సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లనున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ప్రధానంగా పల్లె ప్రజానీకం జన్మభూమి కమిటీల కబంధ హస్తాల్లో  నలిగిపోయారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు ఏవి కావాలన్నా జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన దుస్థితి దాపురించింది. గ్రామ వలంటీర్ల నియామకంతో ఇలాంటి దారుణాలకు శాశ్వతంగా తెర పడనుంది.  

సంక్షేమ ఫలాలు నేరుగా ఇళ్ల వద్దకే.. 
గ్రామాల్లో ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు చేసి వాటికి అనుబంధంగా 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియామకం ద్వారా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అర్హుల ఇళ్లకు నేరుగా చేరనున్నాయి. ఇక రేషన్‌కార్డు కావాలన్నా, పింఛన్‌ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఇతర సర్టిఫికెట్లు అవసరమైనా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. ముఖ్యమంత్రి లేదా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో పనిలేదు. టీడీపీ పాలనలో ఏవి కావాలన్నా జన్మభూమి కమిటీల సిఫార్సుతోపాటు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆఖరికి ముఖ్యమంత్రి ఆమోదిస్తేనేగానీ మంజూరయ్యేవి కావు. రేషన్‌ కార్డులు, పింఛన్ల కోసం ఏకంగా సచివాలయానికి రావాల్సిన దుస్థితిని గత పాలకులు కల్పించారు. వ్యయ ప్రయాసలకోర్చి అంతదూరం వచ్చినా మంజూరవుతాయనే నమ్మకం లేదు.  
 
అంతా 72 గంటల్లోనే... 
ఇలాంటివాటికి పూర్తి భిన్నంగా పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలను అర్హులకే నేరుగా వారి ఇళ్ల వద్దే అందచేసే వినూత్న కార్యక్రమానికి అక్టోబర్‌ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడానికి రాజకీయాలు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు చూడబోమని... అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలను  అందిస్తామని, పైసా లంచం ఇవ్వకుండానే ప్రయోజనాలను నేరుగా ఇంటి వద్దకే పంపిస్తానని పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ప్రజా ప్రతినిధుల సిఫారసులు అవసరం లేని వ్యవస్థను గ్రామ సచివాలయాల ద్వారా ముఖ్యమంత్రి తెస్తున్నారు. అర్హులకు ప్రభుత్వ పథకాల మంజూరు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో 72 గంటల్లోనే పూర్తి కావాలని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా ఆన్‌లైన్‌ వ్యవస్థను అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. అధికార వికేంద్రీకరణతోపాటు పాలనలో జవాబుదారీతనం,  పారదర్శకతను కూడా తెస్తున్నారు. ఈ పథకాల మంజూరు అధికారాన్ని తహసీల్దారుకు అప్పగించనున్నారు. తహసీల్దారు 12 గంటల్లోగా మంజూరు లేదా తిరస్కరించడం చేయకుంటే ఆటోమెటిక్‌గా మంజూరు అయ్యేలా ఆన్‌లైన్‌ వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నారు. 

 దరఖాస్తు నుంచి కార్డు దాకా...  అంతా ఇంటి వద్దే
– ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తారు. 
– గ్రామ వలంటీర్లు ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులను ప్రాథమికంగా గుర్తిస్తారు. 
– రేషన్‌కార్డులు / పింఛన్లకు అర్హుల నుంచి వలంటీర్లు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సచివాలయంలో సమర్పిస్తారు. 
– గ్రామ సచివాయలంలోని పది మంది ఉద్యోగుల్లో సంబంధిత విభాగానికి చెందిన ఉద్యోగి దరఖాస్తుదారుడికి అర్హత ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. 
– అనంతరం గ్రామ సచివాలయంలో ఉద్యోగి తగిన సిఫార్సుతో సెంట్రల్‌ సర్వర్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పంపిస్తారు. 
– సెంట్రల్‌ సర్వర్‌లో సంబంధిత శాఖ అంటే రేషన్‌కార్డు అయితే పౌరసరఫరాల శాఖ, పింఛన్‌ అయితే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రజాసాధికార సర్వే, ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా దరఖాస్తుదారుడి అర్హత వివరాలను మరోసారి పరిశీలిస్తారు. 
– ఆ తరువాత అర్హతలపై తగిన సిఫార్సులతో దరఖాస్తును సంబంధిత తహసీల్దారుకు ఆన్‌లైన్‌లో పంపిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఆధారంగా అర్హులకు తహసీల్దారు 12 గంటల్లోగా రేషన్‌కార్డు లేదా పింఛన్‌ మంజూరు చేస్తారు. ఒకవేళ పని ఒత్తిడి లేదా అలసత్వం కారణంగా 12 గంటల్లోగా మంజూరు చేయకుంటే దరఖాస్తు ఆటోమెటిక్‌గా గ్రామ సచివాలయానికి ఆన్‌లైన్‌లో వెళుతుంది. అలా వెళ్లిన దరఖాస్తును మంజూరు చేసినట్లే భావిస్తారు. 
– ఆన్‌లైన్‌లో తిరిగి గ్రామ సచివాలయానికి అందిన వివరాల ఆధారంగా రేషన్‌కార్డును ప్రింట్‌ చేస్తారు. దీన్ని వలంటీర్ల చేతికి ఇస్తారు. 
– అనంతరం గ్రామ వలంటీర్‌ ఆ కార్డును దరఖాస్తుదారుడి  
ఇంటికి తీసుకెళ్లి అందజేస్తారు.  
– ఈ ప్రక్రియ అంతా 72 గంటల్లోనే పూర్తయ్యేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  
– ఒక్కోసారి 72 గంటల సమయం కూడా పట్టదని, ఇంకా తక్కువ వ్యవధిలోనే అర్హులకు ప్రయోజనాలు అందుతాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 
– ఒకవేళ ఎవరైనా దరఖాస్తుదారుడికి అర్హత లేదని తేలితే నిర్థారించుకునేందుకు మూడో పార్టీ ద్వారా మరోసారి పరిశీలిస్తారు. అప్పుడు కూడా అనర్హుడని తేలితే కారణాలను తెలియచేస్తూ గ్రామ వలంటీర్‌ ద్వారా సమాచారం అందచేస్తారు. 
– ప్రభుత్వం నవరత్నాల ద్వారా అందించే అన్ని రకాల ప్రయోజనాలను వలంటీర్లు అర్హుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయనున్నారు.  
– నాణ్యతతో కూడిన బియ్యంతోపాటు కందిపప్పు, పంచదార బ్యాగ్‌లను వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు పంపిణీ కార్యక్రమాన్ని తొలిదశలో శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని దశలవారీగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తారు.  
– వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెడుతున్నప్పటికీ రేషన్‌ డీలర్లను తొలగించరు. రేషన్‌ డీలర్లను స్టాకిస్టులుగా నియమిస్తారు.  

మరిన్ని వార్తలు