ఒక వ్యక్తి.. మూడు పదవులు

1 Jun, 2019 12:11 IST|Sakshi
ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు

టీడీపీ ప్రభుత్వ నిర్వాకం

ఆర్జీయూకేటీలో పాలన అస్తవ్యస్తం

ఉద్యోగాలన్నీ టీడీపీ వాళ్లకే...

నూజివీడు: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒకే వ్యక్తి మూడు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికీ ఆ మూడింటినీ నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయా (ఆర్జీయూకేటీ)నికి వైస్‌ చాన్స్‌లర్‌గా పని చేస్తున్న ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు. ఆయన ఆర్జీయూకేటీ వీసీగా పనిచేస్తుండగానే గత అక్టోబర్‌ నెలలో ఆర్జీయూకేటీ చాన్సలర్‌గా ఉన్న ఆచార్య డి.రాజ్‌రెడ్డి పదవీకాలం ముగియడంతో రామచంద్రరాజుకే ఇన్‌చార్జ్‌ చాన్స్‌లర్‌ (ఎఫ్‌ఏసీ)గా బాధ్యతలను అప్పగించింది టీడీపీ ప్రభుత్వం. తరువాత కృష్ణా వర్సిటీ వీసీ పదవి ఖాళీ కావడంతో ఆయననే ఆ యూనివర్సిటీకి కూడా ఇన్‌చార్జ్‌ వీసీగా గత ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్జీయూకేటీ చాన్స్‌లర్‌గా రాజ్‌ రెడ్డి పదవీకాలం గతేడాది అక్టోబర్‌ 20తో ముగియగా, ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తారని అందరూ భావించగా, అనూహ్యంగా ఇన్‌చార్జ్‌ చాన్స్‌లర్‌గా రామచంద్రరాజు నియమితులయ్యారు.
 
అస్తవ్యస్తంగా మారిన ఆర్జీయూకేటీ
మూడు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రస్తుత వీసీ హయాంలో ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ఐటీల అభివృద్ధి ఏమాత్రం జరగకపోగా పాలన అస్తవ్యస్తంగా తయారైంది. నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలలో టీడీపీ నాయకులతో పాటు ఆగిరిపల్లి మండలంలోని ఒక ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ చెప్పిన వారికల్లా అవసరం లేకపోయినా ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు ఇచ్చేశారు. ఒక్క శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలోనే ఆఫీసులలో పనిచేసే నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ దాదాపు 170 మంది ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీసీ కార్యాలయంలో సైతం టీడీపీ నాయకులు చెప్పిన వారినల్లా నియమించుకున్నారు. ఈ నియామకాలు నిబంధనల మేరకు జరగలేదు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ అప్రూవల్‌ కూడా లేదు. గత మూడేళ్లుగా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మెస్‌ల నిర్వహణకు టెండర్లను ఖరారు చేయకుండా నామినేషన్‌ పద్ధతిపైనే కొనసాగిస్తున్నారు. ఏటా టెండర్లు పిలవడం, సీఎంవో నుంచి ఫోన్‌ వచ్చిందంటూ నిలిపివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇన్‌చార్జ్‌ చాన్స్‌లర్, వైస్‌చాన్స్‌లర్‌ ఒక్కరే కావడంతో నియంతృత్వ పోకడలు కూడా ఎక్కువయ్యాయనే ప్రచారం కూడా జరుగుతోంది.

మరిన్ని వార్తలు