30 గోడౌన్లలో బియ్యం ప్యాకింగ్‌ యంత్రాలు

18 Jan, 2020 03:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి నాణ్యమైన బియ్యాన్ని వలంటీర్ల ద్వారా రేషన్‌ కార్డుదారుల ఇళ్లకే పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొదటి విడతగా 30 గోడౌన్లలో బియ్యం ప్యాకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. తూకాల్లో మోసాలకు తావు లేకుండా 5, 10, 15, 20 కిలోల బ్యాగుల్లో బియ్యం ఇచ్చేందుకు వీలుగా అవసరమైన ప్యాకింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ప్యాకింగ్‌ ఏజెన్సీల కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన బియ్యాన్ని తినలేక ప్రజలు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేవారు. దీంతో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఏప్రిల్‌ నుంచి రాష్ట్రమంతటా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు పంపిణీ చేసిన బియ్యంలో నూకలు 25 శాతం ఉండేవి. ప్రస్తుతం దీన్ని 15 శాతానికి తగ్గించనున్నారు. అలాగే 3 శాతం ఉండే డ్యామేజీ, రంగు మారిన బియ్యాన్ని 0.75 శాతానికి పరిమితం చేయనున్నారు. గతంలో 5 శాతం ఉన్న షాకీగ్రేన్‌ ఒక్క శాతం మించకూడదని సీఎం అధికారులను ఆదేశించారు. ప్యాకింగ్‌ మిషన్ల ఏర్పాటు కోసం ఈ నెల 23న టెండర్లు ఖరారు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు