అన్న క్యాంటీన్లలో అన్నం కొరత

14 Jul, 2018 06:54 IST|Sakshi
భోజనం ఏమైందని నిలదీస్తున్న ప్రజలు

గొప్పల కోసం ఎందుకని ప్రశ్నిస్తున్న జనం 

కొద్ది మందికే టిఫిన్, భోజనం

ఏలూరు (మెట్రో) : పేదవాడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే నాయకులు నిర్వహణలో విఫలమవుతున్నారు. కొద్ది మందికే టిఫిన్, భోజనం పెట్టి మమ అనిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు అన్నక్యాంటీన్లు మూడురోజుల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తే జిల్లాలోని తాడేపల్లిగూడెం, భీమవరం పట్టణాలు, ఏలూరు నగరంలో జిల్లా నాయకులు అట్టహాసంగా ప్రారంభించారు. అయితే అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అందించాల్సి ఉంది. ఈ మూడు ఒక్కోటి రూ.5 చొప్పున అందించాల్సి ఉంది.

ఊకదంపుడు ఉపన్యాసాలు
క్యాంటీన్లు ప్రారంభించే సమయంలో ఊకదంపుడు ప్రసంగాలు చేసిన నాయకులు ఒక మనిషి రోజుకు ఉదయం అల్ఫాహారంతో పాటుగా రెండు పూటలా భోజనం చేయాలంటే రూ.73 ఖర్చు అవుతుందని, అన్న క్యాంటిన్‌లో కేవలం రూ.15 చెల్లించి ఉద యం, మధ్యాహ్నం, రాత్రికి పేదోడు కడుపు నింపుకోవచ్చునని ప్రకటించారు. ఒక్కో మనిషికి రాష్ట్ర ప్రభుత్వం రూ.58 సబ్సిడీ భరించి పేదోడికి మూడు పూటలా కడుపునింపుతుందని చెప్పుకొచ్చారు.

వాస్తవ దూరం  
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు క్యాంటీన్లలో మధ్యాహ్నం 12.30 గంటలకే భోజనం అయిపోయిందనే సమాధానం వస్తుంది. రూ.5కే భోజనం ఆశించి కిలో మీటర్ల దూరం నుంచి కాలినడకన వెళ్లే పేదోడికి భోజనం లేదనే సమాధానం వినిపిస్తుంది. శుక్రవారం జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇదే సమాధానం ఎదురైంది. దీంతో భోజనం తిందామని వచ్చిన పేదలు ఆగ్రహంతో వెనుతిరిగారు. ప్రచారానికే క్యాంటీన్లు ఏర్పాటు చేశారని పేదవాడు పెదవి విరుస్తున్నాడు. భీమవరం, తాడేపల్లిగూడెంలోనూ ఇదే పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు.

అన్న క్యాంటీన్లు ప్రచార ఆర్భాటమే
భీమవరం: జిల్లాలో అన్న క్యాంటీన్ల పేరుతో మధ్యతరగతి, పేదలను మోసం చేస్తున్నారని కేవీపీఎస్‌ డెల్టా జిల్లా కార్యదర్శి కారుమంచి క్రాంతిబాబు మండిపడ్డారు. గురువారం భీమవరంలోని అన్న క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. రెండు రోజుల క్రితం ప్రారంభించిన క్యాంటీన్ల వద్ద సరైన సదుపాయాలు లేవని, గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందని దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. కొద్దిమందికే అల్పాహారం, భోజనం అందించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. క్యాంటీన్ల వద్ద సదుపాయాలు కల్పించి నిత్యం ఒక్కో క్యాంటీన్‌ వద్ద వెయ్యి మందికి భోజనం, టిఫిన్‌ అందించాలని క్రాంతిబాబు డిమాండ్‌ చేశారు. 

ప్రచారం కోసమేనా
ప్రచారం కోసం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. పేదోడి కడుపు నింపుతానని చెప్పారు. ఇదేనా నింపడం అంటే. కనీసం మధ్యాహ్నం 12.30 గంటలకే భోజనం అయిపోయిందని చెబుతున్నారు. కుటుంబం లేని వాడి పరిస్థితి ఏమిటి.– వెంకటేశ్వరరావు, స్థానికుడు, ఏలూరు

నాకు ఎవరూ లేరు
నేను కుటుంబం లేని పేదవాడిని. ఐదు రూపాయలకే భోజనం అంటే వచ్చాను. ఇక్కడ భోజనం లేదని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఆశతో వచ్చాను. భోజనం లేదని చెబితే నా పరిస్థితి ఏమిటి.
అశోక్, స్థానికుడు, ఏలూరు

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా