బియ్యం మాఫియా!

22 Nov, 2014 02:09 IST|Sakshi

జిల్లాలో బియ్యం మాఫియా విజృంభిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందించే చౌక బియ్యాన్ని దొడ్డిదారిన ఇక్కడకు దిగుమతి చేసుకుని పాలిష్ పట్టి అమ్ముతూ, కర్ణాటకకు ఎగుమతి చేస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. చెక్‌పోస్టులు, పోలీసులతో పాటు పలు ప్రభుత్వ శాఖలకు చెందిన కొందరు అధికారులకు మామూళ్లు సమర్పించి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చిత్తూరు ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీనేత బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
సాక్షి, చిత్తూరు: తమిళనాడులో పేదలకు ఒక్కో కుటుంబానికి 10 కిలోల మామూలు బియ్యం, 10 కిలోలు ఉప్పుడు బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇక్కడి అక్రమార్కులు ఆ బియ్యాన్ని ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి లారీల ద్వారా చిత్తూరుకు తరలిస్తున్నారు. దీంతోపాటు తమిళనాడులోని కాట్పాడి ప్రాంతం నుంచి బొమ్మసముద్రం మీదుగా ట్రైన్‌లోనూ చిత్తూరుకు చేరుస్తున్నారు. ఇక్కడికి చేరిన బియ్యాన్ని పాలిష్ పట్టి జిల్లాలో కొంత మేరకు విక్రయిస్తారు.

మిగిలిన బియ్యాన్ని ప్రత్యేక లారీల ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు తరలిస్తారు. అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రమంతటా ఈ బియ్యాన్ని అమ్ముతున్నారు. తమిళనాడులో ఈ బియ్యం కిలో రూ.3 నుంచి రూ.4 కు మాత్రమే కొనుగోలు చేసి పాలిష్ పట్టి కిలో రూ.30 నుంచి రూ.40కి అమ్ముతున్నారు. రోజూ ఇలాంటి బియ్యం జిల్లా నుంచి కర్ణాటకకు 3 నుంచి 5 లారీల్లో తరలుతున్నట్టు సమాచారం.

అధికారుల సహకారం..
బియ్యం అక్రమ రవాణాకు అటు తమిళనాడు అధికారులతో పాటు ఇటు చిత్తూరు జిల్లాకు చెందిన చెక్‌పోస్ట్, సివిల్‌పోలీసు, అటవీశాఖ, రెవెన్యూ, విజిలెన్స్, కమర్షియల్‌ట్యాక్స్ విభాగాలకు చెందిన కొందరు అధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ అక్రమ బియ్యం వ్యాపారం చిత్తూరు కేంద్రంగానే సాగుతున్నట్టు సమాచారం. చిత్తూరు ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీనేత మరికొందరితో కలిసి బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 12 సంవత్సరాలుగా ఆ నేత ఇదే వృత్తి సాగిస్తున్నాడు. పై స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతోనే కింది స్థాయి అధికారులు, సిబ్బంది వీరికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
 
170 బస్తాల బియ్యం స్వాధీనం
ఇటీవల కర్ణాటకకు తరలిస్తున్న 170 బస్తాల తమిళనాడు బియ్యాన్ని చిత్తూరు పోలీసులు పెనుమూరు క్రాస్‌వద్ద స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న ఎస్సార్‌పురం మండలం నెలవాయి గ్రామానికి చెందిన భాస్కర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తాలూకా ఎస్సై ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు