టీడీపీలో విభజన చిచ్చు

6 Nov, 2013 17:08 IST|Sakshi
టీడీపీలో విభజన చిచ్చు

హైదరాబాద్: తెలుగు దేశం పార్టీలో విభజన చిచ్చు రాజుకుంది. కొంతకాలంగా సీమాంధ్ర, తెలంగాణ నాయకులు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తెలంగాణ టీడీపీ ఫోరం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ మధ్య నడుస్తున్న వివాదం పార్టీలో చిచ్చు పెట్టింది. రాష్ట్ర విభజనపై పయ్యావుల సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో టీడీపీలో ముసలం మొదలయింది. తెలంగాణ నాయకులు పయ్యావుల చర్యను తీవ్రంగా వ్యతిరేకించగా, సీమాంధ్ర నేతలు ఆయనను వెనకేసుకొచ్చారు. అప్పటినుంచి ఇరుప్రాంతాల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు  పేలుస్తున్నారు.

తాజాగా పయ్యావుల కేశవ్పై ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశం పెట్టి ఏకిపారేశారు. పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాదరావు పార్టీలో చీడ పురుగులంటూ దుయ్యబట్టారు. చీడపురుగులను ఏరివేస్తేనే పార్టీ బాగుపడుతుందని సలహాయిచ్చారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తప్పుడు మాటలు తప్పుడు కూస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.

పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని ధిక్కరించే దమ్ము పయ్యావులకు ఉందా అని ప్రశ్నించారు. పయ్యావుల కోన్ కిస్కా అంటూ ధ్వజమెత్తారు. ప్రధానికి రాసిన లేఖలో సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు కోరారని తెలిపారు. తెలంగాణ ప్రక్రియను నిలిపివేయాలని కోరలేదని స్పష్టం చేశారు. ఏమరేమన్నా టీడీపీ తెలంగాణ కట్టుబడి ఉంటుందని ఎర్రబెల్లి విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు