రైట్‌లో ‘రఫ్’ హంగామా

26 Nov, 2014 00:24 IST|Sakshi
రైట్‌లో ‘రఫ్’ హంగామా

 భూపాలపట్నం (రాజానగరం) :‘రఫ్’ సినిమా హీరో, ప్రముఖ నటుడు సాయికుమార్ తనయుడు ఆది మంగళవారం రైట్ కళాశాలలో సందడి చేశారు. వర్థమాన దర్శకుడు సుబ్బారెడ్డి దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఈ సినిమా ప్రమోషన్ వర్‌‌కలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, డాన్స్‌లపై ఇంతవరకూ వివిధ కళాశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి ఇక్కడ ఫైనల్స్ నిర్వహించారు. అమలాపురం సమీపంలోని భట్నవిల్లి, దివాన్‌చెరువు సమీపంలోని పాలచర్లలో ఉన్న బీవీసీ కళాశాలల విద్యార్థులు, రైట్ కళాశాల విద్యార్థులు దీనికి హాజరయ్యారు. రేడియో మిర్చి నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు హీరో ఆది చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆది, ఆయన బృందం కొద్దిసేపు నృత్యాలు చేసి అలరించారు.
 
 పాత్ర ఏదైనా నటనే ముఖ్యం : ఆది
 పాత్ర ఏదైనా తనకు నటనే ముఖ్యమని హీరో ఆది అన్నారు. రైట్ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేకంగా ఫలానా పాత్ర చేయాలన్న అభిలాష తనకు లేదని, వచ్చిన పాత్రకు ఎంతవరకూ న్యాయం చేశానన్నదే ముఖ్యమని అన్నారు. ఇంతవరకూ ఐదు సినిమాలు చేశానని, ‘రఫ్’ ఆరోదని చెప్పారు. అన్ని సినిమాలూ నచ్చినవే అయినా, ‘లవ్ లీ’ అంటే మరింత ఇష్టమన్నారు. కథనుబట్టి టైటిల్ పెట్టారు కానీ, ‘రఫ్’ సినిమా అన్ని వర్గాలనూ అలరిస్తుందని చెప్పారు. గోదావరి అందాల గురించి విన్నానే తప్ప చూసే అవకాశం ఇంతవరకూ దక్కలేదన్నారు. అయితే రాజమండ్రి అమ్మాయినే వివాహం చేసుకోనున్నందున ఇకపై ఈ అందాలను తిలకించేందుకు ఎక్కువ సమయం ఉంటుందని చెప్పారు. సినీ హీరోలను చూసి, తాము కూడా సిక్స్‌ప్యాక్ షేప్ కోసం చాలామంది ప్రయత్నిస్తారని, అది మంచిది కాదని, ఆ సాహసం చేయవద్దని ఆది హితవు పలికారు.
 

మరిన్ని వార్తలు