రిమ్స్‌లో గుండె అత్యవసర విభాగం

4 Aug, 2013 04:31 IST|Sakshi
ఒంగోలు రిమ్స్‌కు గుండెకు సంబంధించిన అత్యవసర విభాగం మంజూరైంది. కోటి రూపాయలతో ఈ విభాగాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు నిధులు విడుదలయ్యాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మేనేజ్‌మెంట్ కింద రిమ్స్‌కు గుండెకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మంజూరైందని, దీనికి అవసరమైన సామగ్రిని పరిశీలించి నివేదిక అందజేయాలని డెరైక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అరుణకుమారి జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని ఆదేశించారు. ఆ మేరకు ఇన్‌చార్జ్ డీఎంఅండ్‌హెచ్‌ఓ రామతులశమ్మ శనివారం రిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను పరిశీలించారు. న్యూట్రిషన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, నవజాత శిశు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రామతులశమ్మ మాట్లాడుతూ గుండెకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటుకు వెంటిలేటర్స్, డిఫైబ్రిలేటర్స్, పల్స్ ఆక్సీమీటర్స్, కార్డియాక్ మానిటర్స్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ట్రెడ్‌మిల్, సెంట్రల్ ఆక్సిజన్, సెంట్రల్ సక్షన్ వంటి సౌకర్యాలు విధిగా ఉండాలన్నారు. వాటి ఏర్పాటుకుగానూ కోటి రూపాయల నిధులు విడుదలయ్యాయన్నారు. 
 
 అదే విధంగా జిల్లాలోని కనిగిరి, దర్శి, పొదిలి, కందుకూరు, చీరాల, కంభం, మార్కాపురం తదితర ప్రాంతాల్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ రిఫరల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రిఫరల్ సెంటర్ల నుంచి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్‌లతో బాధపడే వారిని రిమ్స్‌లో ఏర్పాటు చేయనున్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు పంపిస్తామన్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఒక వైద్యనిపుణుడు, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు, ఇతర సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని చెప్పారు. న్యూట్రిషన్ అండ్ రిహాబిలిటేషన్ కేంద్రం గురించి అంగన్‌వాడీలకు, పిల్లల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు  సమాచారాన్ని అందించి పోషకాహార లోపం ఉన్న వారికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం నవజాత శిశు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఇన్‌క్యుబేటర్లను వాడుతున్నారా..లేదా...అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సెన్సెస్‌పై ఆరా తీశారు. వీటన్నింటిపై ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌లో అన్ని జిల్లాల వైద్యాధికారులతో సమావేశం జరగనుందని రామతులశమ్మ తెలిపారు. ఆ సమావేశంలో తుది విధానాలను ఖరారు చేసి ఒంగోలు రిమ్స్‌లో గుండెకు సంబంధించిన ఐసీయూను ఏర్పాటు చేస్తారని చెప్పారు. 
 
మరిన్ని వార్తలు