కాన్పు కోసం వచ్చి గర్భిణి మృతి

12 Nov, 2018 08:03 IST|Sakshi
రిమ్స్‌ వద్ద మృతురాలి బంధువుల ఆందోళన

రిమ్స్, ఎంసీహెచ్‌ ఎదుట ఆందోళనకు దిగిన బంధువులు

ఒంగోలు సెంట్రల్‌: ఒంగోలు మాతా శిశు వైద్యశాలకు కాన్పు కోసం వచ్చిన గర్భిణి మృతి చెందడంతో ఆమె బంధువులు ఆదివారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు.. కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన పారాబత్తిన లక్ష్మి (21) అనే యువతి గర్భం ధరించినప్పటి నుంచి ఒంగోలు మాతా శిశు వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఈ నెల 9న వైద్యులు కాన్పు తేదీ ఇవ్వడంతో అదే రోజు ఉదయం వైద్యశాలలో చేరింది. మరుసటి రోజు వైద్యులు కాన్పు చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం బాలింతకు ఆరోగ్యం బాగాలేదని తిరిగి లేబర్‌ గదికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పరిస్థితి విషమించిందని, లక్ష్మిని రిమ్స్‌ ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది.

మృతురాలి బంధువుల కథనం ఇలా..
లక్ష్మికి వైద్యులు కాన్పు చేయలేదని, అక్కడ విధుల్లో ఉన్న నర్సులు చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మొదటి కాన్పు కావడంతో ఆమె తీవ్రంగా నీరసించిపోయింది. కాన్పు అనంతరం మాయ బయటకు రాలేదని, వైద్య సిబ్బంది గట్టిగా బయటకు లాగారని చెబుతున్నారు. గర్భసంచి కుడా బయటకు వచ్చిందని, ఈ నేపథ్యంలోనే తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్రమత్తమైన నర్సులు వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు గర్భ సంచిని తిరిగి లోపలికి నెట్టి చికిత్స చేశారు. తీవ్ర రక్తస్రావమైంది. ఆ తర్వాత చికిత్సకు యువతి స్పందించకపోవడంతో మెరుగైన చికిత్స కోసం శనివారం ఉదయం 11 గంటల సమయంలో రిమ్స్‌కు తరలించారు.

అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం లక్ష్మి మృతి చెందింది. బాధితురాలి తల్లిదండ్రులు రిమ్స్‌లో ఆందోళన చేశారు. ఎంసీహెచ్‌ వైద్యులు సరిగ్గా కాన్పు చేయకపొవడంతోనే మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు.

మృతదేహంతో ఎంసీహెచ్‌కు
బాధితురాలి బంధువులు రిమ్స్‌ నుంచి మృతదేహంతో ఎంసీహెచ్‌కు చేరుకుని అక్కడ క్యాజువాలిటీ ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఒన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌ ఎంసీహెచ్‌కు చేరుకుని బాధితులతో మాట్లాడారు. బాధితులు తమకు న్యాయం చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని కూర్చున్నారు. పొలీసులు వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.

వైద్యులు, నర్సులపై పొలీసులకు ఫిర్యాదు
కాన్పు కోసం వచ్చిన లక్ష్మికి సరైన వైద్యం అందించలేదని మృతురాలి బంధువులు, భర్త ఒన్‌టౌన్‌ పొలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సాధారణ కాన్పు చేశాం
లక్ష్మికి సాధారణ కాన్పు చేశాం. అయితే కాన్పు అయిన అనంతరం గర్భసంచి ముడుచుకోలేదు. మాయ బయటకు రాలేదు. దానికి సంబంధించిన చికిత్స అందించాం. అనంతరం రక్తస్రావం అవుతుండటంతో మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తరలించాం. అక్కడ వార్డులో చేర్పించాం. అనంతరం పరిస్థితి విషమించి ఐసీయూలో మృతి చెందింది.– డాక్టర్‌ ఉషారాణి, సూపరింటెండెంట్, ఎంసీహెచ్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా