వారి తప్పులు..

22 Apr, 2015 04:49 IST|Sakshi
  • తప్పులు కప్పిపుచ్చుకునేందుకే దరఖాస్తులు మాయం
  •  రిమ్స్ సిబ్బంది నిర్వాకంతో దరఖాస్తుదారుల అవస్థలు
  •  సవరణ కోసం వచ్చిన దరఖాస్తులూ
  •  కాలం చెల్లిందంటూ తిరస్కరణ
  •  ఒకే రకమైన వైద్యసేవలకు
  •  రకరకాల మొత్తాల మంజూరు
  •  మంజూరీలో జాప్యంతో మరో నష్టం
  •  
     శ్రీకాకుళం:చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే రిమ్స్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ విభాగంలోని కొందరు సిబ్బంది దరఖాస్తులను మాయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే సవరణల పేరుతో తిప్పి పంపిన దరఖాస్తులు తిరిగి అందితే కాలతీతమైందంటూ తిరస్కరిస్తున్నారు. వీరి చర్యలతో ఎందరో ఉద్యోగులు బాధితులుగా మారి రీయింబర్స్‌మెంట్‌కు నోచుకోవడం లేదు. వంగర మండలంలో పనిచేస్తున్న కోటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు 2012లో వజ్రపుకొత్తూరులో పనిచేస్తున్నప్పుడు 36 వేల రూపాయల రీయింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలల తరువాత కొన్ని చోట్ల సంతకాలు లేవంటూ రిమ్స్ అధికారులు ఈ దరఖాస్తును తిప్పి పంపారు. సదరు ఉపాధ్యాయుడు వాటిని సరిచేసి 2013లో మళ్లీ దరఖాస్తు పంపారు.
     
     మూడు నెలలపాటు అధికారులు దాన్ని తొక్కిపెట్టి ఆ తర్వాత తిరస్కరించారు. దీనికి వీరు చెప్పిన కారణం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల్లోగా దరఖాస్తు చేయకపోవడమేనట! నిబంధనల ప్రకారం ఇది వాస్తవమే అయినా తొలిసారి దరఖాస్తు చేసుకున్న తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత సవరణల కోసం ఎన్నిసార్లు వెనక్కి పంపించినా దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. రిమ్స్ అధికారులు గతంలో దరఖాస్తును స్వీకరించి సవరణ కోసం వెనక్కి పంపిన విషయాన్ని గుర్తించక తిరస్కరించారు. ఇదే విషయాన్ని సంబంధిత శాఖాధికారులు, దరఖాస్తుదారులు లేఖ ద్వారా తెలపడంతో నాలిక కరుచుకున్న రిమ్స్ అధికారులు ఏకంగా ఆ దరఖాస్తునే కనబడకుండా చేశారు.
     
     ఇదేమిటని అడిగితే దరఖాస్తుల కట్టలు ముందు పడేసి వెతుక్కోమంటున్నారని సంబంధిత ఉపాధ్యాయుడు వాపోయాడు. ఈ దరఖాస్తు రిమ్స్ అధికారులకు అందలేదనడానికి కూడా వీల్లేదు. సవరణ కోసం వెనక్కి పంపినప్పుడు ఆ విభాగం వారు ఓ సీరియల్ నెంబరు కూడా కేటాయించారు. ఈ విషయం చెబుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. ఇదిలా ఉంటే ఒకే రకమైన చికిత్సలకు వేర్వేరు మంజూరీలు సాధారణమయ్యాయి. టెక్కలి పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయినికి ప్రసూతి కోసం * 12,566 మంజూరు చేయగా, జలుమూరు మండలంలో పనిచేస్తున్న మరో ఉపాద్యాయినికి 13,600 రూపాయలు మంజూరు చేశారు.
     
     అలాగే హిస్టరేక్టమీ అనే శస్త్రచికిత్సకు * 18,500 వరకు మంజూరు చేసే అవకాశం ఉండగా బూర్జ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయినికి * 26వేలు, తోటవాడకు చెందిన ఓ ఉపాధ్యాయినికి 13వేలు, ఎచ్చెర్ల మండలానికి చెందిన ఉపాధ్యాయినికి 17,500 రూపాయలు, హిరమండలం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయినికి ఏకంగా రూ.21వేలు మంజూరు చేశారు. దరఖాస్తు చేసుకున్న మొత్తంలో పది శాతానికి మించి కోత ఉండకూడదని నిబంధన ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే ఎక్కువ మొత్తాలను నమోదు చేస్తే ప్రభుత్వ రేటు ప్రకారం కోత విధించాల్సి ఉంటుంది. మందులు, వైద్యుని ఫీజులతో పాటు మత్తుమందుకు సంబంధించి రేట్లలో కోత విధించకూడదు.
     
     అయితే బూర్జలో పనిచేస్తున్న కుమారి అనే ఉపాధ్యాయిని గర్భసంచిలో ఉన్న శిష్టులను తొలగించుకునేందుకు శస్త్రచికిత్సలు జరిపించుకున్నారు. ఇందుకుగానూ 49,155 రూపాయలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకోగా, రిమ్స్ అధికారులు రూ.19,120 మాత్రమే మంజూరు చేశారు. ఇంతపెద్ద మొత్తం కోత విధించకూడదని నిబంధన ఉంది. ఇలా కోత విధిస్తే ముందుగా దరఖాస్తుదారునికి తెలపాల్సి ఉన్నా ఈమె విషయంలో అలా జరగలేదు. ఓసారి ఎంతో కొంత మొత్తం మంజూరు చేసేస్తే సంబంధిత ఉపాధ్యాయినికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు 2012లో రూ. 10 వేలకు, 2013లో రెండు దఫాలు * 20వేలకు మంజూరు కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఈ దరఖాస్తులు కనిపించకుండా పోయాయి. ఇదేమని అడిగితే పలికే నాధుడే అక్కడ లేకుండా పోయాడు.
     
     మంజూరులోనూ జాప్యం
     ఇదిలా ఉంటే బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండడం వలన కొంత మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుందేమోనని దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు.
     రాష్ట్ర విభజన తరువాత ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. 2014 జూన్ 2వ తేదీకి ముందు అందినదరఖాస్తులను ఈ ఏడాది మార్చి 30లోగా మంజూరు చేస్తే సమస్య ఉండేది కాదు. అలా జరగకపోవడం వల్ల మంజూరైన మొత్తాన్ని 42, 58 శాతాలకు విడగొట్టాల్సి ఉంటుంది. 42 శాతం తెలంగాణ  రాష్ట్ర వాటాగా, 58 శాతం ఆంధ్ర రాష్ట్ర వాటాగా మంజూరు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటా ఇచ్చేందుకు నిరాకరిస్తే ఉద్యోగులు ఆ మొత్తాన్ని నష్టపోయినట్లే. అయితే ఇటువంటి అవకాశాలు చాలా తక్కువని ఖజానాశాఖాధికారులు చెబుతున్నా దరఖాస్తుదారులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పాత దరఖాస్తులను ఖజానా శాఖాధికారులు అనుమతించక పోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం గడువు పెంచక పోవడం వల్ల ఇలా జరిగిందని త్వరలోనే ఉత్తర్వులు రావచ్చని ఖాజనాశాఖాధికారులు అంటున్నారు. తాము చేసిన పొరపాట్లు బయట పడతాయని భావించే ఇటీవల జిల్లా కలెక్టర్ కొంత మంది కలెక్టరేట్ సిబ్బందికి చెందిన దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలని పంపించగా కల్లబొల్లి మాటలు చెప్పి వాటిని వెనక్కి పంపించారన్న వాదన రిమ్స్ సిబ్బంది నుంచే విన్పిస్తోంది.

మరిన్ని వార్తలు