ఆదాయార్జనే లక్ష్యంగా ఆపరేషన్లు

19 Aug, 2018 10:29 IST|Sakshi

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పెరుగుతున్న సిజేరియన్లు

ప్రసూతి వైద్యంలో 70 శాతానికి మించి శస్త్రచికిత్సలు

ప్రభుత్వాస్పత్రుల్లోనూ 50 శాతానికి చేరువ

అమ్మ అనే పదం అద్భుతం.. అమ్మ అనిపించుకోవడమే స్త్రీ జీవితానికి సార్థకం.. నవమోసాలు మోసి పురిటినొప్పులు భరించి శిశువును ఈ ప్రపంచానికి పరిచయం చేసే క్షణాలు ఆమెకు జన్మాంతం గుర్తుండే మధుర స్మృతులు.. ఇంతటి మహత్తర ఘట్టం కాసుల కోసం కర్కశానికి గురవుతోంది.. అమ్మా.. అనిపించుకోవడం కోసం కడుపు ‘కోత’లు మిగులుస్తోంది.. ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆదాయ ఆర్జనే లక్ష్యంగా ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేసేస్తున్నారు. 

తణుకు : పురిటినొప్పులతో ఆస్పత్రులకు వెళ్లే గర్భిణులకు కడుపు‘కోత’ తప్పడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పలురకాలుగా మభ్యపెట్టి.. వారిచేత ఒప్పించి.. తర్వాత వేలకు వేలు గుంజు తున్నారు. ఈ వ్యాపారం జిల్లాలో యథేచ్ఛగా సాగుతోంది. అత్యధిక ఆస్పత్రులు సిజేరియన్ల ఆదాయంతోనే వృద్ధి చెందుతున్నాయన్న ప్రచారం ఉంది. కాస్తంత ప్రయత్నిస్తే సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా బిల్లుల కోసం సిజేరియన్లు వైపు వైద్యులు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి వంద ప్రసవాల్లో సిజేరియన్లు (ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీయడం) 10 నుంచి 15 శాతం మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబు తోంది. అయితే జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం 70 శాతం దాటుతోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం సిజేరియన్లు 50 శాతానికి చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా చేయడం వల్ల తలెత్తుతున్న దుష్ఫలితాలను ఎవరూ గుర్తించడం లేదు. కేవలం కాసుల కోసమే సుఖప్రసవాలు జరిగే కేసుల్లోనూ వైద్యులు సిజేరియన్లు చేస్తున్నారు. ఇందుకు గాను అయినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వచ్చిందే తడవుగా..
ప్రైవేట్‌ ఆస్పత్రులకు గర్భిణి ప్రసవానికి వచ్చిందే తడవుగా కనీసం గంట కూడా నిరీక్షించకుండా సిజేరియన్‌ చేసేస్తున్నారు. కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగిందని అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాలని, లేదంటే తల్లీబిడ్డకు ప్రమాదమని చెప్పి గర్భిణుల బంధువులను భయపెట్టేస్తున్నారు. వైద్యులు చెప్పినట్టు చేయకపోతే తల్లీబిడ్డకు ఏమవుతుందోనని భయంతో వారు చెప్పినట్టు తలాడిస్తూ చేతి చము రు వదిలించుకుంటున్నారు తల్లిదండ్రులు. కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యులు ఒకడుగు ముందుకు వేసి ముహూర్తం పేరుతో గర్భిణులు కోరుకున్న తేదీకి సిజేరియన్‌ చేస్తున్నారు. ఇలా గర్భిణుల బం ధువుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సా ధారణ ప్రసవానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తుండగా సిజేరియన్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో సిజేరియన్లపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. సిజేరియన్లు తగ్గించాలని నర్సింగ్‌ హోమ్‌లు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కొన్ని ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 

దుష్ఫలితాలు.. కోకొల్లలు
సాధారణ ప్రసవమైనప్పుడు ఆ తల్లి మాతృత్వ అనుభూతి పొందగలుగుతుంది. ఆ అనుభూతి విలువ కట్టలేనంత గొప్పది. శస్త్రచికిత్స సమయంలో మత్తు ఇవ్వడం, ఇతరత్రా మందుల వల్ల కాన్పు అనంతరం దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఒకసారి సిజేరియన్‌ చేస్తే రెండో కాన్పు కూడా సిజేరియన్‌ తప్పనిసరిగా చేయాల్సిందే. సిజేరియన్‌ చేయడం వల్ల మహిళలు నడుం నొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉం టుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ప్రసవానికి రక్తస్రావం తక్కువగా ఉండగా సిజేరియన్‌కు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళలు రక్తహీనతకు లోనయ్యే ప్రమాదం ఉంది. సిజేరియన్‌ కారణంగా బిడ్డకు ఉబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 20 శాతం కేసుల్లో బిడ్డకు మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగాను, రోగ నిరోధిక శక్తి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
జిల్లాలో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనలు ప్రకారం కేవలం సాధారణ ప్రసవాలకే ప్రయత్నించాలి. అయితే జిల్లాలోని ఎ క్కువ శాతం వైద్యులు సిజేరియన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇలా చేస్తే సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. 
– వి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్‌ఓ, ఏలూరు 

మరిన్ని వార్తలు