వంటనూనె మంట

16 Jun, 2018 12:47 IST|Sakshi

ప్రజల నెత్తిన మరో భారం

రిఫైండ్‌ ఆయిల్‌పై లీటరుకు రూ.10 నుంచి రూ. 12 పెంపు

వీరఘట్టం శ్రీకాకుళం : మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి అవస్థలు పడుతున్న ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లుగా వంటనూనెల ధరలు పెరగడంతో గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఇవి అమాంతంగా ఒకేసారి పెరగడంతో ప్రజలు నూనె జోలికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ధరలు శనివారం నుంచి అమల్లోకి రానుండటంతో ఇక వంటకాలు ఎలా చేసుకోవాలి దేవుడా.. అంటూ మహిళలు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా ప్రజలపై రూ.82.50 లక్షల భారం

జిల్లాలో 2.50 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతీ కుటుంబం సరాసరిన 3 లీటర్ల వంటనూనె వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. లీటరుకు సరాసరిన రూ.11 ప్రస్తుత ధరల ప్రకారం పెరిగింది. దీంతో ప్రతీ కుటుంబంపై నెలకు రూ.33 అదనపు భారం పడుతోంది. ఈ లెక్కన జిల్లా ప్రజల నెలకు వంటనూనెల రూపంలో రూ.82.50 లక్షల భారం పడనుంది.

మార్కెట్‌కి వెళ్లాలంటే భయపడుతున్న వైనం

సాధారణంగా వంటనూనెల కోసం పామాయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్, సోయాబీన్‌ ఆయిల్, రైస్‌బ్రాన్‌ ఆయిల్, కార్న్‌ ఆయిల్, గ్రౌండ్‌నట్‌ ఆయిల్, జంజీర్‌ ఆయిల్, ఆవనూనె, కొబ్బరినూనెలు విరివిరిగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే కొబ్బరినూనె అర లీటరు రూ.166 నుంచి రూ.199కి పెరిగింది.

ప్రస్తుతం రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‌కు మాత్రమే ప్రభుత్వం ధర పెంచింది. దీంతో వంట నూనెలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటే వినియోగదారులు భయపడుతున్నారు. ఇక పండగలకు, వివాహాది శుభకార్యాలకు పిండి వంటలు వండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

హోటళ్లపై నూనె ధరల ప్రభావం

ఇంటిలోనే కాకుండా హోటళ్లకు వెళ్తే అక్కడా నూనె ధరల ప్రభావంతో భోజనం, టిఫిన్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. వీటితోపాటు మిఠాయిలు, తినుబండారాలు, ఇలా ఒకటేమిటి నూనెలో వేగించే ప్రతీ వస్తువు ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

వేపుడు వంటలంటే భయపడాల్సిందే

నూనెల ధరలు పెరగడంతో వంటగదిలో ఉడకబెట్టిన కూరలు తప్ప వేపుళ్లంటే భయపడాల్సిం దే. పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం కూరలు వండాలన్న ఆర్థిక  ఇబ్బందులు తప్పవు. – కే శ్రీదేవి, గృహిణి, వీరఘట్టం 

పిండి వంటలు వండుకోలేం

పండగలకు, ఉత్సవాలకు పిండివంటలు వండుకోలేం. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రభుత్వం నూనె ధరలు పెంచితే సామాన్యులు ఎలా బతికేది?

– దుప్పాడ ఇందు, గృహిణి, వీరఘట్టం 

మరిన్ని వార్తలు