రక్తచరిత్ర

21 May, 2017 01:46 IST|Sakshi
రక్తచరిత్ర

♦  కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య హత్యారాజకీయాలు
అద్దంకిలో దశాబ్ద కాలం తరువాత పురివిప్పిన పాతకక్షలు
ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా విబేధాలు
గొట్టిపాటి అధికార పార్టీలో చేరగానే పెచ్చరిల్లిన పాత కక్షలు
వేమవరం ఘటనలో ఉలిక్కిపడిన అద్దంకి
ప్రతీకార దాడులకు దారితీసే అవకాశం


అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సీనియర్‌ నేత ఎమ్మెల్సీ కరణం బలరాంలను ఒకటి చేసి లబ్ది పొందాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం వికటించింది. దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో హత్యారాజకీయాలకు తెరలేపింది. తాజాగా రెండు ప్రాణాలను బలితీసుకుంది. చంద్రాబాబు వైఖరివల్లే  ప్రశాంతంగా ఉన్న  అద్దంకిలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయని, టీడీపీ కార్యకర్తలను హత్య చేసేందుకే ఎమ్మెల్యే గొట్టిపాటికి లైసెన్స్‌ ఇచ్చినట్లుగా ఉందని సాక్షాత్తు ఆ పార్టీ ఎమ్మెల్సీ కరణం బలరాం తీవ్ర ఆరోపణలు చేశారు. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ హత్యలు మరిన్ని ప్రతీకార దాడులకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా వేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అద్దంకి నియోజకవర్గంలో హత్యారాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. దశాబ్దకాలం క్రితం  కరణం బలరాం, గొట్టిపాటి కుటుంబాల మధ్య వర్గ విబేధాల నేపథ్యంలో పలు హత్యలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత చిన్నచిన్న ఘర్షణలు మినహా హత్యలు జరిగిన సందర్భాలు లేవు. ప్రస్తుత  ఎమ్మెల్యే  గొట్టిపాటి ఏడాది క్రితం అధికార పార్టీలో చేరడంతో మళ్లీ ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు తెరలేచింది. శుక్రవారం రాత్రి బల్లికురవ మండలం వేమవరంలో  గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయులపై  కత్తులు, గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు.

 ఈ దాడిలో  కరణం వర్గీయులు గోరంట్ల అంజయ్య, ఎగినాటి రామకోటేశ్వరరావు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పథకం ప్రకారమే ఈ హత్యాకాండ జరిగినట్లు స్పష్టమౌతోంది. పాత కక్షల నేపధ్యంలోనే ఈ దారుణ హత్యాకాండ చోటు చేసుకుంది. కరణం బలరాంకు అత్యంత సన్నిహితుడైన గోరంట్ల అంజయ్యను హతమార్చడమే లక్ష్యంగా దాడి జరిగినట్లు తెలుస్తోంది. 1989లో ఇదే గ్రామంలో సాంబయ్య అనే వ్యక్తిని గొట్టిపాటి వర్గీయులు హత్య చేసినట్లు సమాచారం. ఆ నాటి దాడిలో అంజయ్య కత్తిపొట్లకు గురయ్యాడు.

20 రోజుల పాటు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అప్పట్లో తప్పించుకున్న అంజయ్యను హతమార్చాలన్న లక్ష్యంతోనే మరోమారు దాడికి కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. కరణం వర్గీయులు పెళ్ళికి వెళ్ళి వస్తారన్న విషయం తెలుసుకొని గ్రామ పొలిమేరలోని స్పీడ్‌బ్రేకర్‌ వద్ద హతమార్చేందుకు రెక్కి సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఓ యువకుడు కరణం వర్గీయులను పెళ్లి వరకు వెంబడించి వారు తిరుగు ప్రయాణమయ్యే సమయాన్ని ఎప్పటికప్పుడు గొట్టిపాటి వర్గీయులకు చేరవేసినట్లు తెలుస్తోంది.

గొట్టిపాటి అధికార పార్టీలో చేరడంతో ...
ఏడాది క్రితం ఎమ్మెల్యే గొట్టిపాటి అధికార టీడీపీలో చేరడంతో అద్దంకిలో మల్లీ హత్యారాజకీయాలు  మొదలయ్యాయి.  కరణం వ్యతిరేకించినా పట్టించుకోక ముఖ్యమంత్రి చంద్రబాబు గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అధికారం కోసం ఇరువర్గాలు పోటీ పడడంతో విబేధాలు చిలికి చిలికి గాలి వానలా మారాయి. తామూ అధికార పార్టీలో ఉన్నామన్న భరోసాతో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గంతో ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. నివురు గప్పిన నిప్పులా ఉన్న దశాబ్దాల వైరం  ఒక్కసారిగా బయటకు వచ్చింది.

ఇందులో బాగంగానే శుక్రవారం రాత్రి బల్లికురవ మండలం  వేమవరంలో గొట్టిపాటి వర్గీయులు కరణం వర్గీయులపై దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఆ దాడిలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దళితుల భూములను కబ్జాచేసి గ్రానైట్‌ క్వారీ ఆక్రమించాడని దీనిని అడ్డుకోవడంతోనే గొట్టిపాటి తనవర్గీయులతో దాడి చేయించి తన వర్గీయుల హత్యకు కారణమయ్యాడని కరణం బలరాం విమర్శించారు. చంద్రబాబు టీడీపీ కార్యకర్తలను హత్య చేసేందుకు గొట్టిపాటికి లైసన్స్‌ ఇచ్చినట్లే ఉందని కరణం తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి పైనే విమర్శనాస్త్రాలు సంధించారు. గొట్టిపాటి డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాడని అదిచేసుకోని వెళ్లాలే తప్ప టీడీపీ కార్యకర్తలను హత్య చేయడమేమిటని కరణం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి గ్రామంలో జరిగిన గొడవల నేపథ్యంలో జరిగిన హత్యలేతప్ప వాటితో తనకు సంబంధం లేదని గొట్టిపాటి పేర్కొంటున్నారు. ఏదేమైనా కరణం వర్గీయులను గొట్టిపాటి వర్గీయులు హత్య చేశారన్నది యదార్ధం. దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో జరిగిన ఈఘటన మళ్లీ హత్యారాజకీయాలకు బీజం వేశాయి.ఇవి ఇంతటితో ఆగక ప్రతీకార హత్యలకు దారితీసే అవకాశం ఉందన్నది పరిశీలకుల అంచనా. శుక్రవారం నుంచే నియోజకవర్గం మొత్తంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గం అంతటా పెద్ద ఎత్తున పోలీసు పికెట్స్‌ ఏర్పాటు చేశారు.  

రెండు కుటుంబాల మధ్య వర్గ విబేదాలు..
గొట్టిపాటి పెదనాన్న, మాజీమంత్రి హనుమంతరావు కాలం నుంచే కరణం కుటుంబంతో విబేధాలు మొదలయ్యాయు. తొలుత ఇరు కుటుంబాల మధ్య సఖ్యత ఉన్నా ఆ తరువాత విబేధాలు పొడచూపాయి. 1985 ప్రాంతంలో కరణం మార్టూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా విభేదించిన హనుమంతరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా కరణం పై పోటీచేశారు. అక్కడి నుంచి విబేధాలు  మొదలయ్యాయి. ఇవి పతాకస్థాయికి చేరడంతో 1993 ప్రాంతంలో  హనుమంతరావు కుమారుడు కిషోర్‌ మరికొందరు హత్యకు గురయ్యారు. ఇందుకు కరణమే కారణమని గొట్టిపాటి కుటుంబం  చెబుతోంది.

 ఇరు వర్గాల మధ్య గొడవలు పెరిగాయి. ఆ తరువాత 1994లో ఇరువురూ మరోమారు పోటీ చేశారు. కరణంపై గెలిచిన హనుమంతరావు మంత్రి అయ్యారు. 1999లో కరణం ఒంగోలు పార్లమెంట్‌ కు పోటీచేసి విజయం సాధించారు. 2004 లో అద్దంకి నుంచి కరణం ఎమ్మెల్యేగా గెలవగా 2009 లో కరణం బలరాం, గొట్టిపాటిలు, 2014లో గొట్టిపాటి, కరణం వెంకటేశ్‌లు పోటీపడ్డారు.  దీంతో మరోమారు గొట్టిపాటి, కరణం కుటుంబాలు ప్రత్యక్ష పోరుకు దిగాయి.

ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. రాజకీయ విబేధాలు కటుంబ కక్షలకు దారితీశాయి. అయితే ఇరు వర్గాలమధ్య ఎంత వైరమున్నా దశాబ్దకాలంగా స్వల్ప ఘర్షణలు తప్ప అద్దంకి రాజకీయాల్లో హత్యలు లేవు. కరణం టీడీపీలో కొనసాగగా గొట్టిపాటి కాంగ్రెస్‌ తరువాత  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తీవ్ర పరిణామాలు తప్పవు..
అక్రమ సంపాదన కోసం టీడీపీలో చేరిన వాడివి ఆ పని మాత్రమే చూసుకోవాలి. ఎంత తింటావో అంత తిను. దానికి పార్టీయే లైసెన్స్‌ ఇచ్చినప్పుడు ఎవరూ కాదనరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు ఇబ్బంది పెట్టావ్‌. ఇప్పుడు ఏకంగా కార్యకర్తలనే చంపిస్తున్నావు. తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం చేసుకుని రవి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే పార్టీ మనుగడ అసాధ్యం. హత్యోదంతంపై ఉదాశీనంగా వ్యవహరిస్తే కార్యకర్తలను పార్టీ అ«ధిష్టానమే చంపుతున్నట్లుగా భావించాల్సి వస్తుంది.
– ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి

 ఏనాడూ హత్యలను ప్రోత్సహించలేదు
నా రాజకీయ జీవితంలో హత్యలను ఏనాడూ ప్రాత్సహించలేదు. గ్రామాల్లో ఏవో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయని తెలుసు గానీ.. ఇలా హత్యలకు దారితీసేంత కక్షలున్నాయని మాత్రం తెలియదు. నిజాలు తెలుసుకోకుండా తనపై బలరాం నిందలు మోపడం సరికాదు. సీఎంను కలిసి నిజాలు వెల్లడిస్తా.  
– ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

మరిన్ని వార్తలు