పెన్నా విలాపం

21 Jul, 2014 02:19 IST|Sakshi
పెన్నా విలాపం

రెండు దశాబ్దాల క్రితం ఇసుక తిన్నెల సొగసులతో పామిడి వద్ద పెన్నా నది కళకళలాడేది. వర్షా కాలం నీటితో నిండుగా ప్రవహిస్తూ సుందర దృశ్యాలతో కనువిందు చేసేది. ఆట విడుపుగా జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల ప్రజలు పెన్నా నదీ తీరానికి వెళ్లి.. నదిలో జలకాలాడుతూ మధురానుభూతిని పొందేవారు. నీరు లేని సమయంలో ఇసుక తిన్నెల దొంతరలు కనిపించేవి. ఇపుడా పరిస్థితి లేదు. ‘పెన్నా’ విలపిస్తోంది. ఇసుకాసురుల తవ్వకాలతో నది ‘గుంతల’ గాయాలతో విలవిలలాడుతోంది.
 
 పామిడి : పామిడి పెన్నా నది నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ‘తెల్ల’ బంగారాన్ని రవాణా చేస్తూ కాసులు పండించుకుంటున్నారు. నదీ తీరాన ఉన్న సమాధులను సైతం పెకలించి.. శ్మశానాలను దురాక్రమణ గావిస్తూ ఇసుకను కొల్లగొడుతున్నారు. ‘స్టాక్ పాయింట్లు’ ఏర్పాటు చేసుకుని, అనంతపురంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకే కాకుండా సమీప కర్నూలు, వైఎస్సార్, కర్ణాటకలోని బళ్లారి తదితర జిల్లాలతో పాటు బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాలకు కూడా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. రోజుకు 500 పైబడి ట్రాక్టర్ల లోడుతో ఇసుక తోడేస్తున్నారు.
 
 అయినా అధికారులకు మాత్రం పట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో నది పరిసరాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. సుమారు వంద అడుగులు పైబడి లోతున కూడా నీరు లభ్యం కాని దుస్థితి. మరోవైపు నదీ ప్రాంతాన్ని, శ్మశానాలనూ సైతం కొందరు దురాక్రమణ చేస్తుండడంతో తోటలు, వరిమళ్లు, ఇటుక బట్టీలు, అక్రమ కట్టడాలు పెరిగి పోతున్నాయి. దీంతో పెన్నా విస్తీర్ణం కుంచించుకు పోతోంది.
 
 దీనికి తోడు కంప చెట్లు, చెత్తదిబ్బల మయంగా మారిన పెన్నా నదిలో పలు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. చెత్తదిబ్బల వల్ల పబ్లిక్ ట్యాపుల్లో కలుషిత నీరు వస్తోంది. తద్వారా తీవ్ర కీళ్ల నొప్పులు వస్తున్నాయని పామిడి ప్రజలు వాపోతున్నారు. పెన్నా నది దుస్థితిపై రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
 ఇసుక అక్రమ రవాణాతో పెన్నానది పొడవునా గుంతలు పడ్డాయి. నదిలో నీరు చేరగానే గుంతలు నిండి సుడిగుండాలుగా మారుతున్నాయి. వాటిని గుర్తించలేక అందులో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పెన్నాను పరిరక్షించాల్సిన అవసరం ఉంది.
 -  నాగరాజు
 
 ‘నిధి’గా మారిన నది
 పెన్నా నదిలోని ఇసుక అక్రమార్కులకు నిధిగా మారింది. వందలాది ట్రాక్టర్లలో ఇసుకను తరలించేస్తున్నారు. ఇక కబ్జాదారులు సైతం ఇష్టారాజ్యంగా స్థలాన్ని ఆక్రమించుకుని క్రయవిక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
 - ఆనంద్
 
 శ్మశానాలకు దారులే లేవు  
 ఇసుక అక్రమ రవాణాదారులు శ్మశానానికి వెళ్లే దారులను సైతం వదలడం లేదు. దీంతో పెన్నాలో అంత్యక్రియలు నిర్వహించడానికి దారి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పూడ్చిన చోటే మళ్లీమళ్లీ మృతదేహాలను పూడ్చాల్సిన దుస్థితి. అధికారులు చర్యలు తీసుకుని నదిని కాపాడి, ప్రజలకు ఇబ్బందులు తొలగించాలి.                   
 - జయరాజు
 

మరిన్ని వార్తలు