జల్లికట్టుకు ‘మెరీనా’... హోదాకు ‘ఆర్కే’

23 Jan, 2017 09:57 IST|Sakshi
జల్లికట్టుకు ‘మెరీనా’... హోదాకు ‘ఆర్కే’

విశాఖపట్నం: చెన్నై మెరీనా బీచ్ లో యువ‘తరంగం’ ఉవ్వెత్తున ఎగసిపడడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆగమేఘాల మీద జల్లికట్టు ఆర్డినెన్స్‌ కు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. తమ సంప్రదాయ క్రీడపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని సముద్రతీరంలో తమిళ యువత సాగించిన పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించింది. జల్లికట్టుపై కట్టుబాట్లను తెంచేందుకు పాలకులు అంగీకరించినా విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసే దాకా ఉద్యమం ఆపేదిలేదంటూ మెరీనా బీచ్ వదిలేందుకు యువత విముఖత వ్యక్తం చేసింది.

జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా పోరు ఊపందుకుంటోంది. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా పోరాటానికి ఏపీ ప్రజలు సిద్ధమవుతున్నారు. ‘మన రాష్ట్రం- మన హోదా’ అంటూ మహోద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కేంద్రం నుంచి ప్రత్యేకహోదా సాధించే లక్ష్యంతో ముందుకు ఉరుకుతున్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రిపబ్లిక్‌ డే జనవరి 26వ తేదీన విశాఖపట్నం బీచ్‌ ఒడ్డున వేలాదిమంది ప్రజలతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.

పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఏపీకి ప్రత్యేకహోదా హామీని నేర్చవేర్చాలన్న డిమాండ్ తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని కోరింది. తమిళులను ప్రేరణగా తీసుకుని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై సోషల్ మీడియాలోనూ స్వచ్ఛందంగా ప్రచారం ఊపందుకుంది. హోదా పోరుకు యువత కదిలివచ్చేందుకు సిద్ధమవుతోంది.