చర్చించాకే విద్యుత్‌ చట్టంలో మార్పులు

4 Jul, 2020 05:35 IST|Sakshi

సోలార్‌ ప్లాంట్లకు 30 శాతం సబ్సిడీ

అన్ని రాష్ట్రాల విద్యుత్‌ మంత్రులతో కేంద్ర మంత్రి ఆర్కేసింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రాలతో మరోదఫా సంప్రదించిన తర్వాతే విద్యుత్‌ చట్టంలో మార్పులు తెస్తామని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. రాష్ట్రాల నుంచి అందిన అభ్యంతరాలపై లోతుగా చర్చిస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్‌ శాఖ మంత్రులతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, నెడ్‌క్యాప్‌ ఎండీ రమణారెడ్డి ఇందులో పాల్గొన్నారు.

అభిప్రాయాలు స్వీకరించాం
విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో ప్రైవేట్‌ పోటీ, నియంత్రణ మండలి చైర్మన్, సభ్యుల నియామకాన్ని కేంద్ర పరిధిలోకి తేవడం, విద్యుత్‌ సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకే అందించే పలు సంస్కరణలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ చట్ట సవరణను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనివల్ల రాష్ట్ర ప్రాధాన్యతలకు ఇబ్బందులు తలెత్తుతాయని ఏపీతో పాటు పలు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రులతో సుదీర్ఘంగా వీడియో కాన్పరెన్స్‌ ద్వారా చర్చించారు. ఇప్పటికే ఫీడ్‌ బ్యాక్‌ అందిందని, అందరి ఆమోదం తీసుకున్నాకే ముందుకెళ్తామని చెప్పారు.

ఫీడర్లవారీగా సోలార్‌ ప్లాంట్లు
 ఫీడర్ల వారీగా సోలార్‌ ప్లాంట్లు నెలకొల్పే రాష్ట్రాలకు వ్యయంలో 30 శాతం సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఏపీలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలను నెడ్‌క్యాప్‌ ఎండీ రమణారెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. 

డిస్కమ్‌లను బలోపేతం చేయాలి
కోవిడ్‌–19 నేపథ్యంలో నష్టపోయిన రాష్ట్రాలకు ఆత్మ నిర్భర్‌ భారత్‌ కింద సాయం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ చెప్పారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల ప్రాధాన్యతపై చర్చించారు. డిమాండ్‌కు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  

ఏడాదిలోనే బకాయిలన్నీ చెల్లించాం: మంత్రి బాలినేని
డిస్కమ్‌లను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ముందుకెళ్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజలపై భారం పడకుండా, విద్యుత్‌ సంస్థలను అప్పుల నుంచి బయట పడేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. పాత బకాయిలన్నీ ఏడాది వ్యవధిలోనే చెల్లించామని తెలిపారు. 

మరిన్ని వార్తలు