శంకర్‌దాదా ఆర్‌ఎంపీ

15 Jun, 2017 09:16 IST|Sakshi
శంకర్‌దాదా ఆర్‌ఎంపీ

► పీహెచ్‌సీల్లో అందుబాటులో  ఉండని వైద్యులు
► ఆర్‌ఎంపీల వద్దకు పరుగులు పెడుతున్న పల్లె జనం
► వచ్చీరాని వైద్యంతో మందులిస్తున్న ఆర్‌ఎంపీలు
► ఫిరంగిపురంలో చూపు కోల్పోయిన వివాహిత
► జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇదే దుస్థితి


పొద్దుగాల నుంచి చంటోడు ఒకటే ఏడుస్తున్నడు..వళ్లు పట్టుకుంటే కాలిపోతాంది. చేతిలోనా పైసల్లేవు. గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళదాం పదయ్యా..ఊరుకోవే..అక్కడికెళితే ఎవరుంటరే..బిడ్డను పట్టించుకునే నాథుడుంటడా..యాడో ఒక చోట అప్పు పట్టకొస్తా..ఊళ్లో ఉన్న డాక్టర్‌ బాబు దగ్గరకెళదాం..అంటూ పిల్లాడిని చంకనెత్తుకుని పరుగులు పెట్టారు దంపతులు. ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రతి గ్రామంలో నిరుపేదల దుస్థితి. వైద్య ఆరోగ్యశాఖ మొద్దునిద్రలో జోగుతుంటే..ఆర్‌ఎంపీలే ఎంబీబీఎస్‌లైపోతున్నారు. తలనొప్పిగా ఉందంటే మోకాలుకు మందులిచ్చి డాక్టర్‌ బాబులుగా బిల్డప్‌ ఇచ్చేస్తున్నారు. మొత్తంగా ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు.

సాక్షి, గుంటూరు: జిల్లాలో పల్లె జనానికి ఏ జబ్బు వచ్చినా ఆర్‌ఎంపీలే దిక్కు. దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడమే. అందుబాటులో ఉండని ప్రభుత్వ వైద్యులకంటే ఇంటి వద్దకు వచ్చి వైద్య సేవలందించే ఆర్‌ఎంపీలే నయమనే స్థితికి పల్లె జనం వచ్చేశారు. రాజధాని నిర్మాణం జరుగుతున్న గుంటూరు జిల్లాలోని వందలాది గ్రామాలు ఇప్పటికీ ఆర్‌ఎంపీల వైద్యంపైనే ఆధార పడుతున్నాయంటే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ఆర్‌ఎంపీలు తమకు తెలిసిన స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ.. వీరిలో కొందరు మాత్రం అనుభవం లేకపోయినా ఆర్‌ఎంపీలుగా చెలామణి అవుతున్నారు. ఎంబీబీఎస్‌ వైద్యుల మాదిరిగా ఇష్టానుసారం మందులు రాస్తున్నారు.  

నిబంధనలకు చెల్లు చీటీ
 ఆర్‌ఎంపీలు నిబంధనలకు అనుగుణంగా పని చేయాల్సి ఉన్నప్పటికీ వీరిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. డెలివరీలు, చిన్న చిన్న ఆపరేషన్‌లు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. ఆర్‌ఎంపీలు వైద్యసేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా గ్రామాల్లో క్లినిక్‌ల పేరుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆర్‌ఎంపీల వల్ల ఇబ్బందులు పడి అనేక మంది ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు.  

ఆర్‌ఎంపీ వైద్యంతో చూపు కోల్పోయిన మహిళ
ఈ నెల 13వ తేదీ జిల్లాలోని ఫిరంగిపురానికి చెందిన పరగటి కుమారి అనే వివాహిత జ్వరంతో బాధపడుతూ స్థానిక ఆర్‌ఎంపీ అమర్లపూడి ఇమ్మానియేల్‌ను ఆశ్రయించింది. ఆమెను పరీక్షించిన ఆర్‌ఎంపీ కొన్ని మందులు రాసి ఇచ్చాడు. అవి వాడిన వెంటనే మహిళ ముఖం కాలినట్లుగా నల్లగా మారి, కంటిచూపు సైతం కోల్పోయింది. అయితే దీనిపై ఆర్‌ఎంపీని ప్రశ్నించగా.. తాను జ్వరం తగ్గేందుకు మందులు ఇచ్చానని, వాటితో కళ్లకు ఎటువంటి ప్రమాదం ఉండదని సమాధానం ఇచ్చాడు. బాధితురాలు మాత్రం తాను వైద్యం వికటించడం వల్లే కంటిచూపు కోల్పాయానంటూ ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇలాంటి ఘటనలు మారుమూల పల్లెల్లో ఎక్కువగా జరుగుతున్నా బాధితులు బయటపడడం లేదు. ఆర్‌ఎంపీలు ఇచ్చిన మందులతో సైడ్‌ ఎఫెక్ట్‌ వచ్చినా రోగులు గుర్తించలేక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు.

ఈ పాపం వైద్యులదే..
గుంటూరు జిల్లాలో మొత్తం 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకుగాను సుమారు 20 వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న 80 శాతం మంది సిబ్బంది జిల్లా కేంద్రమైన గుంటూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలకు ఆసుపత్రిలో ఉండాల్సిన వైద్యులు 12 గంటలకు చేరుకుంటున్నారు. తిరిగి మధ్యాహ్నం భోజన సమయానికి వెళ్లిపోతుండటంతో రోగులకు వైద్య చికిత్సలు అందడం లేదు. పనిచేసే చోటే నివాసం ఉండాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ వైద్యులు దాన్ని లెక్క చేయడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పల్లెల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా