ఆటోను ఢీకొని అడ్డంగా దొరికిపోయారు

26 Feb, 2015 01:34 IST|Sakshi

 కావలి : మండలంలోని గౌర వరం సమీపంలో భారీస్థాయిలో గంజాయి లభించడంతో ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కావలిరూరల్ పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన ఆటో పట్టణానికి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని తిరిగి వెళుతుంది. మండలంలోని గౌరవరం జాతీయ రహదారి టోల్ ప్లాజాకు సమీపంలో ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న ఓ కారు వెనుక నుంచి ఆటోను  ఢీకొంది. దీంతో ఆటో జాతీయ రహదారిపై బోల్తా పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. కారులో ఉన్న గంజాయి మూటలు బయటపడ్డాయి.
 
 దీంతో బిత్తరపోయిన కారులో ప్రయాణిస్తున్న వారు కారును, గంజాయి మూటలను వదిలి అక్కడ నుంచి పరారయ్యారు. క్షతగాత్రులను 108 వాహన సిబ్బంది చికిత్స కోసం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ సమయంలో ప్రమాదానికి గురైన కారులో ఉన్న గంజాయి మూటలను 108 సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కావలి రూరల్ సీఐ మధుబాబు వెంటనే సంఘటన స్థలాన్ని చేరుకుని గంజాయిని పరిశీలించారు. ఆర్‌ఐ మాధవరెడ్డిని పిలిపించి గంజాయిని తూకం వేయించారు. ఆ కారులో ప్రయాణిస్తున్న వారికి సంబంధించి వస్తువులు, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.  
 
 అదుపులో అనుమానితులు
 ఈ గంజాయి తరలించారని భావిస్తున్న నలుగురు అనుమానితులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సంఘటన అనంతరం హైవేపై పోలీసులు తనిఖీలు చేశారు. తమిళనాడుకు చెందిన నలుగురు అనుమానితులు ఒక కారులో ఉండటం గుర్తించారు. వారు ఆ గంజాయి తరలింపు వాహనానికి పెలైట్ వాహనంలో వెళుతున్నారనే అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు తాము పడవల ఇంజన్లను మరమ్మతులు చేసేవారిమని పోలీసులకు చెబుతున్నట్లు తెలుస్తుంది.
 
 ఒడిశా నుంచి మదురైకు..
 ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పండిచిన గంజాయిని అక్రమంగా మదురైకు రవాణా చేస్తున్నారనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎక్సైజ్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వాహనంపై విఘ్నేష్ అనే పేరు ఉంది. నంబర్ ప్లేట్‌ను బట్టి తమిళనాడుకు చెందిన వాహనంగా అనుమానిస్తున్నారు. ఎల్లో బోర్డు ఉండటంతో బాడుగకు తీసుకువచ్చిన వాహనమా లేక అక్రమరవాణాకు అలా బోర్డును తయారు చేసుకున్నా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
 టోల్‌ప్లాజా సీసీ
 పుటేజీ పరిశీలన
 ఈరోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో ఏ వాహనాలు వెళుతున్నాయి, టోల్‌ప్లాజాను ఎవరైనా దాటారా, అనుమానితుల వివరాల కోసం గౌరవరం టోల్ ప్లాజా సీసీ పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
 

మరిన్ని వార్తలు