జంక్షన్‌.. హైటెన్షన్‌

28 Jan, 2019 07:33 IST|Sakshi
జాతీయరహదారిపై ప్రమాద సూచికలు లేని దువ్వ సెంటర్‌

ప్రమాదకరంగా హైవే కూడళ్లు నిత్యం మృత్యు ఘంటికలు

రక్తమోడుతున్న జాతీయ రహదారి

రక్షణ చర్యలు చేపట్టాలంటున్న ప్రజలు

పశ్చిమగోదావరి, తణుకు: జీవితంపై అవగాహన లేమి.. మితిమీ రిన వేగం.. రోడ్డు ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. వేగాన్ని నియంత్రించుకోలేక ఎదుటి వాహనాలను ఢీకొట్టడం లేదా అదుపు తప్పడం వంటి ఘటనలు ఇటీవల చాలా జరుగుతున్నాయి. మరోవైపు జాతీయ రహదారిపై ప్రధాన జంక్షన్లు ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. తణుకు పరిధిలోని పలు ప్రాంతాల్లో జంక్షన్ల వద్ద రహదారి నిత్యం రక్తసిక్తమవుతోంది. ముఖ్యంగా వెంకయ్యవయ్యేరు, దువ్వ గ్రామ కూడలి, తేతలి గ్రామ కూడలితోపాటు తేతలి వై.జంక్షన్ల వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా అధికారులు మాత్రం నివారణ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా పోలీసు, రవాణా శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ జంక్షన్ల వద్ద గతంలో ఏర్పాటు చేసిన వేగ నియంత్రణ బోర్డులు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి.

సంఘటనలు ఎన్నో...
ప్రస్తుతం శీతాకాలం కావడంతో రాత్రి సమయాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో డ్రైవింగ్‌ చేసేటప్పుడు రోడ్డు సరిగా కనిపించకపోవడంతోపాటు చల్లని గాలికి ఒక్కోసారి డ్రైవర్లు రెప్పవాల్చుతుంటారు. ఈ క్షణంలోనే అదుపు తప్పిన వాహనాలు ప్రమాదాల బారినపడుతున్నాయి. ఇటువంటి ఘటనల్లో కొన్ని..
గతంలో తేతలి గ్రామ కూడలి వద్ద అత్యంత వేగంగా వచ్చిన కారు రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు. మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో పాటు జంక్షన్‌ వద్ద వేగనియంత్రణ బోర్డులు లేకపోవడం మరో కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
గుంటూరు నుంచి తూర్పుగోదావరి జిల్లాకు బైక్‌పై బయలుదేరిన యువకుడు దువ్వ వచ్చేసరికి నిద్రమత్తు కారణంగా అదుపు తప్పి రోడ్డుపక్కనే చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
గతంలో తేతలి వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

నెరవేరని ప్రతిపాదనలు
తణుకు పట్టణంతోపాటు రూరల్‌ పరిధిలోని వెంకయ్య వయ్యేరు నుంచి పాత టోల్‌గేటు వరకు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులు భావించారు. ఆయా కూడళ్ల వద్ద వేగ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతోపాటు రోడ్డు మధ్యలో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని గతంలో అధికారులు భావించారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ పట్టాలు ఎక్కలేదు. ఆయా జంక్షన్ల వద్ద రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీనిని గుర్తించిన పోలీసు అధికారులు గతంలో ఆయా జంక్షన్ల వద్ద వేగ నియంత్రణ బోర్డులతోపాటు పెద్ద డబ్బాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆయా కూడళ్ల వద్ద ఎలాంటి వేగనియంత్రణ బోర్డులు లేకపోడంతో వాహనాల వేగాన్ని నియంత్రించలేని పరిస్థితి నెలకొంది.

చర్యలు తీసుకుంటాం
హైవే అథారిటీ అధి కారుల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం. ఆయా కూడళ్ల వద్ద వేగనియంత్రణ బోర్డులు పునరుద్దరిస్తాం. ప్రమాదాల నివారణకు ప్రజలతోపాటు వాహనదారులు సహకరించాలి.– ఎన్‌.శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్సై, తణుకు

మరిన్ని వార్తలు