రక్తచరిత్ర

29 Dec, 2014 00:25 IST|Sakshi
రక్తచరిత్ర

హత్యలు.. ఆత్మహత్యలు.. అనుమానాస్పద మరణాలు.. రోడ్డు ప్రమాదాలు.. వరకట్న మరణాలు.. ఇలా వరుస నేరాలతో.. 2014 సంవత్సరం.. జిల్లాలో రక్తచరిత్ర రాసింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో.. 22 మందిని బలిగొన్న గెయిల్ పైపులైను పేలుడు ప్రమాదం జిల్లాను వణికించింది. చమురు అన్వేషణ సాగుతున్న కోనసీమ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అలాగే, యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లు 18 మంది నిర్భాగ్యుల ఉసురు తీశాయి. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 577 మంది దుర్మరణం పాలయ్యారు. వివిధ సంఘటనల్లో 115 మంది హత్యకు గురయ్యారు. లైంగిక దాడులు.. దొంగతనాలు.. ఇతర నేరాలు కూడా ఈ ఏడాది ఎక్కువగానే జరిగాయి.
 - కాకినాడ క్రైం/రాజమండ్రి క్రైం
 
 భయంగొలిపిన హత్యలు
 జనవరి 23న రాజమండ్రి చెరుకూరి సుబ్బారావు నగర్‌లో గోవిందు అనే వ్యక్తి తన భార్య పాప(30)పై అనుమానం పెంచుకున్నాడు. కత్తితో అతి కిరాతకంగా నరికి ఆమెను హతమార్చాడు.
 ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో జూన్ 25న తండ్రీకొడుకులను ప్రత్యర్థులు స్థల వివాదంలో హతమార్చారు.
 ఆగస్టు 7న కాకినాడ పాతబస్టాండు ప్రాంతానికి చెందిన శ్రీరామకృష్ణ అనే వ్యక్తి అనుమానంతో తన భార్య మరియమ్మను ముక్కలుముక్కలుగా నరికి డస్ట్‌బిన్‌లు, ఉప్పుటేరులో పడేయడం సంచలనం రేపింది.
 
 అనుమానాస్పద మృతులు...
 కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలేనికి చెందిన బొజ్జపు నర్సరత్నం అలియాస్ లక్ష్మి (24) తన ఇంటి బాత్‌రూమ్‌లో కాలిన గాయాలతో ఫిబ్రవరి 13న అనుమానాస్పదంగా మృతి చెందింది.
 మార్చి 28న రౌతులపూడి మండలం శృంగవరానికి చెందిన మేకల కాపరి ఈగల సత్యనారాయణ (50) కాలిన గాయాలతో అనుమానాస్పదంగా మృతి చెందాడు.
 కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట లైట్‌హౌస్ ప్రాంతానికి చెందిన దూడ పుష్ప (20) కాలిన గాయాలతో మార్చి 29న అనుమానాస్పదంగా మరణించింది.
 
 ఆత్మహత్యలు..
 భర్త శ్రీను వేధింపులు తట్టుకోలేక కడియం మండలం వేమగిరితోటకు చెందిన దంగేటి మంగ (32) జనవరి 10న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 రాజానగరం జీఎస్‌ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని మెర్ల శ్రీలక్ష్మి (26) యాజమాన్యం వేధింపులతో మనస్తాపం చెంది ఫిబ్రవరి 14న కాకినాడలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన వ్యాపారవేత్త కర్రి సుబ్బారెడ్డి (56) పిఠాపురం మండలం చిత్రాడ రైల్వే గేటు వద్ద మార్చి 24న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
 ఏసీబీ వలలో..
 రూ.20 వేలు లంచం తీసుకుంటూ బిక్కవోలు ఆర్‌ఐ ఏప్రిల్ 2న ఏసీబీ అధికారులకు చిక్కాడు.
 రూ.15 వేలు లంచం తీసుకుంటున్న అమలాపురం మున్సిపల్ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు ఆగస్టు 27న వలపన్ని పట్టుకున్నారు.
 సెప్టెంబర్ 10న రాజమండ్రి నగరపాలక సంస్థలో బిల్లుపై సంతకం చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు తీసుకుంటూ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ పట్టుబడ్డారు.
 
 రహదారుల రక్తదాహం
 ఆలమూరు మండలం మడికికి చెందిన తండ్రీ కొడుకులు నంద్యాల ధనకృష్ణ, దుర్గాప్రసాద్‌లు ఫిబ్రవరి 24న మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా చెముడులంక వద్ద కారు ఢీకొని మృతి చెందారు.
 కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం వద్ద ఏప్రిల్ 6న ఐషర్ వ్యాన్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు.
 సెప్టెంబర్ 12న పెద్దాపురం ఏడీబీ రోడ్డులో 108 అంబులెన్స్, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 108 పైలట్, టెక్నీషియన్ మరణించారు.
 
 పేట్రేగిన కామాంధులు
 ఫిబ్రవరి 8న అనపర్తిలో ఓ బాలికపై లక్ష్మీ నరసాపురానికి చెందిన కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 రామచంద్రపురం మండలం ఉండూరులో మార్చి 8న కన్నకూతురిపైనే ఓ తండ్రి లైంగికదాడికి యత్నించడం సంచలనం రేపింది.
 బిక్కవోలు మండలం కొంకుదురులో సెప్టెంబర్ 19న మూగ బాలికపై కామాంధుడి లైంగికదాడికి పాల్పడ్డాడు.
 
 వణికించిన ప్రమాదాలు
 మార్చి 11న ధవళేశ్వరంలో తాటాకిల్లు దగ్ధమై, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు.
 మామిడికుదురు మండలం నగరంలో జూన్ 27న గెయిల్ గ్యాస్ పైపులైను పేలిపోవడంతో 15 మంది సజీవ దహనమయ్యారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందారు.
 అక్టోబర్ 21న ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మంది మృతి చెందారు.
 
 నకిలీ కరెన్సీ
 రాయవరం మండలం వి.సావరం ఇటుక బట్టీలో పనిచేసే పరదక్షిణ వెంకన్న, వీధి లక్ష్మిలను పోలీసులు జనవరి 14న అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.71 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
 ఫిబ్రవరి 8న దొంగనోట్లతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని మండపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1785 రూ.500 నకిలీ నోట్లు, రూ.3,800 నగదు, 2 బైకులు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
 
 భారీగా రికవరీలు
 వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పల్లిదేరంగుల శ్రీనివాసులు అనే చైన్‌స్నాచర్‌ను పోలీసులు ఫిబ్రవరి 8న అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను కాకినాడ క్రైం పోలీసులు ఫిబ్రవరి 22న అరెస్టు చేసి, వారి నుంచి రూ.11 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
 ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళలను బంధించి దోపిడీ చేసే అంతర్ జిల్లా ముఠాకు చెందిన 12 మందిని రామచంద్రపురం పోలీసులు ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
 
 గంజాయి రవాణాకు చెక్
 విశాఖ ఏజెన్సీ నుంచి ఫిబ్రవరి 22న గంజాయి తరలిస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను తుని టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.57 లక్షల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
 జగ్గంపేట మండలం రామవరం హైవేలో మే 5న వ్యాన్‌లో తరలిస్తున్న రూ.10 లక్షల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 అక్టోబర్ 25న చింతూరు మండలం మోతుగూడెం వద్ద రూ.50 లక్షల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

>
మరిన్ని వార్తలు