మార్గం..సుగమం

4 Nov, 2019 13:07 IST|Sakshi
వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు

జిల్లాలో రహదారులకు మహర్దశ

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

బాగు చేయించాలని ప్రభుత్వ నిర్ణయం

నిధుల మంజూరుకు గ్రీన్‌ సిగ్నల్‌

జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కోతకు గురై దెబ్బతిన్న రహదారులను బాగు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.రోడ్ల  వివరాలను ఆయాశాఖల అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. శాశ్వత మరమ్మతులకు అయ్యే ఖర్చు వివరాలను సైతం ప్రతిపాదించారు. నిధుల మంజూరుకు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులను జారీ చేయనుంది. దీంతో జిల్లాలో దెబ్బతిన్న రహదారులు బాగుపడనున్నాయి.

సాక్షి ప్రతినిధి కడప : వర్షాలకు జిల్లాలోని పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ పరిధిలోని 279 కిలోమీటర్ల మేర రహదారులు కోతకు గురయ్యాయి. పనికి రాకుండా పోయాయి. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో 40 కిలోమీటర్లు, రోడ్లు భవనాల శాఖ పరిధిలో 239 కిలోమీటర్లు చొప్పున రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం ప్రాంతాల్లో అధికంగా పాడయ్యాయి.వీటిని బాగు చేసేందుకు ఫ్రభుత్వం రోడ్లు భవనాలశాఖ పరిధిలో రూ. 191.57 కోట్లతో, పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో రూ. 2.95 కోట్లతో శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పంచాయతీరాజ్‌ పరిధిలో కడప డివిజన్‌లో ఐదు, రాజంపేట డివిజన్‌లో 23, జమ్మలమడుగు డివిజన్‌లో 13 రోడ్లు చొప్పున మొత్తం 41 రహదారులు వర్షాలకు దెబ్బతిన్నాయి.కడప డివిజన్‌లో 3.80 కిలోమీటర్లు, రాజంపేట డివిజన్‌లో 34.40 కిలోమీటర్లు, జమ్మలమడుగు డివిజన్‌లో 1.65 కిలోమీటర్లు దెబ్బతినగా వీటిని తాత్కాలికంగా బాగు చేసేందుకు కడప డివిజన్‌ పరిధిలో రూ. 52 లక్షలు, రాజంపేట డివిజన్‌ పరిధిలో రూ. 1.60 కోట్లు, జమ్మలమడుగు డివిజన్‌లో రూ. 43.10 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు.

వీటిని శాశ్వత నిర్మాణం కోసం కడప డివిజన్‌లో రూ. 2.25 కోట్లు, రాజంపేట డివిజన్‌లో రూ. 30 లక్షలు, జమ్మలమడుగు డివిజన్‌లోరూ. 40 లక్షలు చొప్పున మొత్తం రూ. 2.95 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటు పంచాయతీరాజ్‌ పరిధిలో పలు తారు రోడ్లు సైతం వర్షానికి దెబ్బతిన్నాయి. ప్రధానంగా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో చాపాడు, వెదురూరు నుంచి పెద్ద గురవలూరు వయా రామసముద్రం కొట్టాలు రహదారి 2.80 కిలోమీటర్లు కాగా, 40 మీటర్ల మేర దెబ్బతింది. ఇదే మండలంలో కుచ్చుపాప టు వెదురూరు రోడ్డు 2.70 కిలోమీటర్లు కాగా, 30 మీటర్లు పాడైంది.. ఇదే మండలంలోని కుచ్చుపాప–వెదురూరు నుంచి నరహరిపురం వరకు 2.50 కిలోమీటర్లు కాగా, 1.20 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతింది. మొత్తం 1.90 కిలోమీటర్లు మేర దెబ్బతినగా, మరమ్మతులకు రూ. 15 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

రోడ్లు భవనాల శాఖ పరిధిలో పై నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర రహదారులు 60.5 కిలోమీటర్ల మేర దెబ్బతినగా, మేజర్, డిస్ట్రిక్ట్‌ రహదారులు వివిధ విభాగాల పరిధిలో 179 కిలోమీటర్లు కలిపి మొత్తం 239 కిలోమీటర్లు పాడయ్యాయి. వీటిని తాత్కాలికంగా బాగు చేసేందుకు రూ. 38 కోట్లు అవసరమని అధికారులు అంచనాకు రాగా, శాశ్వత మరమ్మతులకు రూ. 153.57 కోట్లు అవసరమని అంచనా వేశారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలశాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేసేందుకు రూ. 40.50 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేసేందుకు రూ. 194.52 కోట్లు అవసరమని తేల్చారు. ఎక్కువగా భారీ వర్షాలు కురిసిన జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, పులివెందుల తదితర ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణా, పెన్నా, కుందూ పరివాహక ప్రాంతాల్లోనే అధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లను వెంటనే నిర్మించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది.

మరిన్ని వార్తలు