ఆదిలోనే హంసపాదు..

2 Oct, 2018 13:36 IST|Sakshi
గరిశపూడి సమీపంలో పగుళ్లిచ్చిన జాతీయ రహదారి

పనులు పూర్తికాక ముందే     రహదారికి పగుళ్లు

రహదారి నాణ్యతపై     అనుమానాలు

పలు చోట్ల కుంగిపోతున్న     216 హైవే

రోడ్డు భవిష్యత్‌ ప్రశ్నార్థకం

పేరుకే జాతీయ రహదారి.. పంచాయతీలో వేసే అంతర్గత రహదారుల కంటే అధ్వానంగా నిర్మిస్తున్నారు. చాలా చోట్ల రహదారి కుంగిపోతుండగా అప్పుడే దానికి మరమ్మతులు చేస్తున్నారు. జాతీయ రహదారి నాణ్యతపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణాజిల్లా, కృత్తివెన్ను: పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు విస్తరించిన 216 జాతీయ రహదారి కృత్తివెన్ను మండలంలో పల్లెపాలెం వద్ద నుంచి మునిపెడ వరకు సుమారు 20 కిలోమీటర్లు మేర ఉంది. పల్లెపాలెం నుంచి గరిశపూడి వరకు జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పాటు ఈ ప్రాంతంలో ఇప్పటికే మొదటి లేయర్‌ పూర్తిచేసుకున్న చోట సిమెంటు రోడ్డు అడ్డంగా రెండుగా చీలిపోవడంతో ఇదేనా జాతీయ రహదారి అంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

అడుగడుగునా పగుళ్లే..
పల్లెపాలెం వద్ద నుంచి గరిశపూడి వరకు చాలా మేర సింగిల్‌ లైన్‌ రహదారి మొదటి దశ పూర్తయింది. ఇక్కడ గరిశపూడి, సీతనపల్లి మెగా స్కీం, బోలుగొంది అడ్డరోడ్డు తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారి పగుళ్లిచ్చింది. వేసిన సిమెంటు రోడ్డు అడ్డంగా రెండుగా చీలిపోయే రీతిలో పగుళ్లివ్వడంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి నిర్మాణంపై స్థానికుల్లో పలు అనుమానాలకు దారితీస్తుంది. సిమెంటు రోడ్డు నిర్మాణం తరువాత వాటర్‌ క్యూరింగ్‌ విషయంలోనూ సరైన శ్రద్ధ  చూపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తూతూమంత్రంగా ఎర్త్‌ వర్క్‌
జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ఎర్త్‌ వర్కును పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు మొత్తానికి ఎర్త్‌ వర్కే కీలకం. కానీ ఇక్కడ మాత్రం ఎర్త్‌ వర్క్‌ పనుల సమయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రహదారి నిర్మాణం పూర్తికాకుండానే కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోతుంది. సీతనపల్లి మెగాస్కీం సమీపంలో ఇదే తరహాలో రోడ్డు దెబ్బతినడం దాన్ని సరిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదిలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో రహదారి భద్రత ఎలా ఉం టుందన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతుంది. రహదారి నిర్మాణ సమయంలో సరైన ప్రాథమిక చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోలుగొంది అడ్డరోడ్డు, గరిశపూడి, మాట్లాం తూము, అంబేడ్కర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి చినుకు పడితే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రదేశాల్లో  ప్రమాదాలు సైతం నిత్యకృత్యమయ్యాయి. వీటిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పగుళ్లపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా రోడ్డును పూర్తిస్థాయిలో నాణ్యతగా తమకు అప్పగించాల్సిన బాధ్యత నిర్మాణ కంపెనీదంటూ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు