దారి దోపిడీ

26 Feb, 2018 13:27 IST|Sakshi
ఐదు నెలల క్రితం వేసిన సిమెంటు రోడ్డు

సిమెంట్‌ రోడ్ల నిర్మాణంలో అవినీతి

ఏడాది కాకుండానే శిథిలం 

నిర్మాణ సమయంలో కొరవడిన పర్యవేక్షణ

పర్సేంటేజీల వల్లే దుస్థితి!

బినామీ కాంట్రాక్టర్లతో పనులు


పైచిత్రంలోని రోడ్డు ద్వారకాతిరుమల మండలంలోని రామసింగవరంలో వేసిన సిమెంటు రోడ్డు. గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి పాకిరం వెంకటరత్నం ఇంటి వరకు దాదాపు 50 మీటర్ల దూరం సీసీ రోడ్డును ఐదు నెలల కిత్రం నిర్మించారు. ఇలా గ్రామంలో రూ.50లక్షల వ్యయంతో పలు చోట్ల రోడ్లు వేశారు. 20ఏళ్లకుపైగా ఉండాల్సిన రోడ్లు నాణ్యత లేక కుంగిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో కాంట్రాక్టు తీసుకుని వీటిని వేశారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే  వేసిన ఐదు నెలలకే ఛిద్రమయ్యాయి. 

దేవరపల్లి/ద్వారకాతిరుమల/గోపాలపురం: జాతీయ ఉపాధి హామీ పథకం, పంచా యతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ నిధులతో గ్రామాల్లో నిర్మించిన రోడ్లకు అవినీతి తూట్లు పడుతున్నాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు బినామీ కాంట్రాక్టర్లుగా చెలామణి అవుతూ రోడ్ల నిర్మాణంలో దోపిడీకి పాల్పడుతున్నారు. 
నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. 

ఐదునెలలు తిరగకుండానే..
గోపాలపురం నియోజకవర్గంలో అత్యధికంగా సిమెంట్‌ రోడ్ల నిర్మాణం జరిగింది. నిబంధనల ప్రకారం సిమెంట్‌ రోడ్డు సుమారు 20 ఏళ్ల నుంచి 25ఏళ్లు ఉండాలి. అయితే ప్రస్తుతం వేస్తున్న రోడ్లు ఐదునెలలు కాకుండానే పగుళ్లు తీసి శి«థిలమవుతున్నాయి. గోపాలపురం పంచాయతీరాజ్‌ సబ్‌డివిజనల్‌ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల, ద్వారకాతిరులమ మండలాల్లో 2017–18 సంవత్సరానికి సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి రూ.250 కోట్ల ఉపాధి హామీ, పంచాయతీ నిధులు మంజూరు చేశారు. వీటితో 87,151 మీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు సుమారురూ.150 కోట్లతో 29,099 మీటర్ల పొడవున రోడ్లు నిర్మించారు. అయితే వేసిన రోడ్లు పలు గ్రామాల్లో బీటలు తీశాయి. దీంతో సిమెంట్‌ రోడ్ల కంటే మట్టిదారులు నయమని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. 

ఇవిగో నిదర్శనాలు 
   -  దేవరపల్లిలో ఆరు సిమెంట్‌ రోడ్ల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. బాలదుర్గమ్మ ఆలయ ప్రాంతంలో గత ఏడాది సిమెంట్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి కాలువ ఇసుక వాడుతున్నారని,  స్థానికులు పనులను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టరు మిగిలిన రోడ్లను ఆపేశారు.   
   -  దేవరపల్లి మండలం చిన్నాయగూడెం, సంగాయగూడెంలో గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన సిమెంట్‌ రోడ్ల నిర్మాణ పనులు  చేయకుండానే గత ఏడాది మార్చిలో అధికారపార్టీ నేతల అండతో బిల్లులు చేయించుకుని జేబులు నింపుకున్నారు.  సుమారు రూ. 10 లక్షలు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు ఆగమేఘాలపై రోడ్లు నిర్మాణం పూర్తి చేశారు. 
  -   ద్వారకాతిరుమల మండలం రామసింగవరంలో 5 నెలల క్రితం నిర్మించిన అంబేడ్కర్‌ సెంటర్‌ రోడ్డు అప్పుడే ధ్వంసమైంది. ఎంపీపీ పాఠశాల వెనుక రోడ్డూ దెబ్బతింది. ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లు కావడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. 
  -   మద్దులగూడెంలో ఇటీవల సర్పంచ్‌ కట్టూరి స్వర్ణలత భర్త చంటిబాబు 7వ వార్డులో సీసీ రోడ్డు నిర్మిస్తుండగా,  ఒక వార్డు సభ్యురాలు భర్త  దానంపూడి భుజంగరావు నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని గొడవకు దిగారు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరూ అధికార పార్టీ వారే కావడం విశేషం. 
  -   దేవినేనివారిగూడెంలో రోడ్లు నిర్మించిన కొద్దిరోజులకే బీటలు వారాయి. 
  -   గోపాలపురం మండలం గోపవరంలో టీడీపీ నాయకుడు చేపట్టిన రోడ్లు నిర్మించిన రెండు నెలలకే గోతులు పడ్డాయి.  
  -   వాదాలకుంట, జగన్నాథపురం, భీమోలు, చిట్యాల, గోపాలపురంలలో టీడీపీకి చెందిన జన్మభూమి కమిటీ సభ్యులు మాత్రమే సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.  

అవకతవకలపై విచారణ చేపట్టాలి
గ్రామంలో వేసిన సిమెంట్‌ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోడ్డు వేసిన రెండు నెలలకే పాడయ్యాయి.  కాంట్రాక్టర్లను అడిగితే కమీషన్‌లే ఇవ్వాలా రోడ్డు నాణ్యతే పాటించాలా అని అంటున్నారు. సిమెంట్‌ రోడ్ల కన్నా గ్రావెల్‌రోడ్లు నయంగా ఉన్నాయి. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.  అధికారపార్టీ నాయకులే కాంట్రాక్టర్లవుతున్నారు.
– కాకులపాటి వెంకట్రావు, భీమోలు 

రోడ్లను పరిశీలించి చర్యలు తీసుకుంటా
ఇటీవలే డివిజినల్‌ ఇంజినీరింగ్‌ అధికారిగా బదిలీపై వచ్చా. నాణ్యత లేకపోవడం వల్ల శిథిలమైన రోడ్లను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుంటా. రోడ్డు వేసిన కాంట్రక్టర్‌తో మళ్లీ మరమ్మతులు చేయిస్తా. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడతాం.
  – కె. భద్రానాయక్, డీఈఈ, పంచాయతీరాజ్‌

మరిన్ని వార్తలు