అవినీతికి అడ్డా!

1 Dec, 2014 03:39 IST|Sakshi

* ఆర్టీఏ కార్యాలయంలో యథేచ్ఛగా దందా  
* వయసు ధ్రువీకరణ పత్రం పేరుతో అడ్డగోలు వసూలు
* ఒక్కో పత్రానికి రూ.250 దండుకుంటున్న వైనం

అనంతపురం క్రైం : అనంతపురంలోని రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీఏ) ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. వయసు ధ్రువీకరణ పేరుతో దందా సాగుతోంది. ఒక్కో పత్రానికి రూ.250 వసూలు చేస్తున్నారు. రోజుకు రమారమి రూ.8-10 వేలు అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది. ఇటీవల ఉప రవాణా కమిషనరుగా బాధ్యతలు తీసుకున్న సుందర్ వద్ది ప్రారంభంలోనే ఈ విధానానికి చెక్‌పెట్టినా.. సరికొత్త పంథాలో వసూళ్ల పర్వం సాగిపోతోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించాలంటే సంబంధిత వ్యక్తి జాతీయతను ధ్రువీకరించే పత్రాలు జమ చేయాలి. అంటే.. జనన ధ్రువీకరణ పత్రం, చదువుకుని ఉంటే టీసీ, ఓటరు ఐడీ కార్డు జత చేస్తే సరిపోతుంది. ఇవేవీ లేకపోతే నోటరీ సర్టిఫికెట్ ఇవ్వాలి. వయసు ధ్రువీకరణ పత్రం జత చేయాలనే నిబంధన లేదు. కానీ అనంతపురం డీటీసీ, తాడిపత్రి ఆర్టీఓ (రోడ్డు రవాణా అధికారి) కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లకు సంబంధించి వయసు ధ్రువీకరణ పత్రాలు జత చేయాలనే నిబంధన విధించారు. హిందూపురం ఆర్టీఓ కార్యాలయంలో ఈ నిబంధన లేదు. ఒకే జిల్లాలో రెండు విధాలుగా నిబంధన అమలు చేస్తుండడం గమనార్హం. లెసైన్స్ కోసమైతే వయసు ధ్రువీకరణ పత్రం జత చేయాలనే నిబంధన ఉంది.
 
ఒక్కో పత్రానికి రూ. 250..
వయసు ధ్రువీకరణ పత్రానికి రూ. 250 చొప్పున  వసూలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రభుత్వ ఖజానాలో జమ కావడం లేదు. కొందరు సిబ్బంది జేబుల్లోకి వెళుతోంది. అనంతపురం డీటీసీ కార్యాలయంలో రోజూ సగటున 60-70 వాహనాలు (నాన్ ట్రాన్స్‌పోర్టు) రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వీటిలో సుమారు 40  వాహనాలకు సంబంధించి యజమానుల వయసు ధ్రువీకరణ పత్రాలను అడుగుతున్నారు. ఒక్కో వాహనానికి రూ. 250 చొప్పున మొత్తమ్మీద రోజూ రూ.10 వేలు సిబ్బంది జేబుల్లోకి వెళుతోంది. మరోవైపు రూ.2 వేల దాకా ఏజెంట్లకు చేరుతోంది. ఒక్కో సర్టిఫికెట్‌కు ఏజెంట్లు రూ.50 తీసుకుంటున్నారు.  
 
దందా ఇలా...
అన్ని సర్టిఫికెట్లు జత చేసి సంబంధిత క్లర్కు వద్దకు వెళ్తే ఫీజు మొత్తం తీసుకుని అన్నింటినీ పరిశీలించి మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ)కు సిఫారసు చేస్తారు. ఆయన వాహనాన్ని పరిశీలించిన తర్వాత ఏఓకు సిఫారసు చేస్తారు. ఏఓ ఆమోదం లభించగానే వాహనానికి నంబరు కేటాయిస్తారు. అయితే.. క్లర్కు వద్దకు ఫైలు వెళ్లగానే వారు పరిశీలించకుండానే అసిస్టెంటు (ప్రైవేటు వ్యక్తి)కు ఇస్తున్నారు. అసిస్టెంటు సర్టిఫికెట్లను పరిశీలించి ఫైలుపై ఒక గుర్తు పెడతాడు. వయసు ధ్రువీకరణ పత్రం కావాలని సూచిస్తాడు. వాహన యజమాని ఏజెంటును సంప్రదిస్తే రూ. 300 వసూలు చేసి ధ్రువీకరణ పత్రం ఇస్తాడు.

ఆ పత్రాన్ని అసిస్టెంటు ఫైలులో జతచేసి.. క్లర్‌‌కకు పంపుతాడు. అక్కడి నుంచి ఎంవీఐ.. అటు నుంచి ఏఓకు చేరుతుంది. ప్రైవేటు వ్యక్తి పెట్టిన గుర్తు ఆధారంగా ఏ ఏజెంటు నుంచి ఫైలు వచ్చిందీ తెలుస్తుంది. సాయంత్రం కార్యాలయ పనివేళలు ముగిసిన తర్వాత సదరు ప్రైవేటు వ్యక్తి ఆయా ఏజెంట్ల వద్దకు వెళ్లి ఎన్నెన్ని ఫైళ్లు వచ్చిందీ లెక్కించి.. ఒక్కో ఫైలుకు (వయసు ధ్రువీకరణ పత్రం ఇచ్చినవాటికి) రూ. 250 చొప్పున వసూలు చేస్తాడు. ఆ మొత్తాన్ని సంబంధిత సిబ్బందికి అందజేస్తాడని తెలుస్తోంది.
 
ఒక్క రూపాయి వసూలు చేయకూడదు
వయసు ధ్రువీకరణ పత్రాల పేరిట వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఎవరితోనూ ఒక్క రూపాయి కూడా  తీసుకోకూడదు. వసూలు చేసినట్లు తెలిస్తే  కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనదారులు నేరుగా వచ్చి నాకు ఫిర్యాదు చేయొచ్చు.                - సుందర్ వద్ది, డీటీసీ

మరిన్ని వార్తలు