ఎన్నాళ్లీ కష్టాలు! 

19 Jul, 2018 07:42 IST|Sakshi
ఎస్‌బీఐ కాలనీలో ట్రాఫిక్‌సమస్యతో నిలిచిపోయిన వాహనాలు (ఇన్‌సెట్లో) ఇళ్ల ముందు తీసిన గుంతలు

సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనుల కోసమంటూ అధికారులు, అధికార పార్టీ నాయకులు ఎక్కడబడితే అక్కడ గుంతలు తవ్వి, పనులు చేపట్టకుండా వదిలేయడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కాలనీలో తవ్విన గుంతలతో తరచూ ట్రాఫిక్‌ జామ్‌ అవుతుండటంతో కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు.
 
ఆరునెలల క్రితం గుంతలు తీసి.. 
ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే మీ కాలనీలో రహదారులు నిర్మిస్తామని చెప్పిన నాయకులు..ఎస్‌బీఐ కాలనీలో రహదారులు వేయడానికి ఆరు నెలల క్రితం గుంతలు తీయించారు. కానీ ఇంత వరకు రోడ్లు వేయలేదు.  దీనికి తోడు రహదారి పక్కన డ్రెయినేజీ కోసం గుంతలు తీసి మట్టిని రోడ్డుపైనే వేయడంతో వాహన దారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఈ కాలనీలో పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఈ ఐదు పాఠశాలలు, మూడు కాలేజీల విద్యార్థులు కళాశాలలకు రాకపోకలు సాగిస్తుంటారు.

దీంతో  చిన్న ఆటో ఎదురుగా వచ్చినా ట్రాఫిక్‌ అంతా జాం అవుతుంది. దీంతో విద్యార్థులు పాఠశాలకు, కాలేజీలకు ఆలస్యంగా వెళ్లాల్సివస్తోంది. పాఠశాల బస్సు ఈ రహదారిపై వచ్చిందంటే 15 నిమిషాలు ట్రాఫిక్‌ నిలిచిపోవాల్సిందే. రోడ్డు అంతా మట్టిమయం కావడం, పక్కన గుంతలు ఉండటంతో కనీసం సైకిళ్లు కూడా వెళ్లలేని పరిస్థితి. అంతేకాకుండా వర్షా కాలం కావడంతో రోడ్డుపై వేసిన మట్టి మీద నడుస్తూ వృద్ధులు, చిన్నారులు జారిపడుతున్నారు.  ఆరు నెలలుగా  పనులు కొనసాగుతున్నా ఒక్కపని కూడా సక్రమంగా చేయడంలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు