విద్యుత్‌ పంపిణీ సంస్థల పటిష్టానికి రోడ్‌మ్యాప్‌

6 Jul, 2020 05:09 IST|Sakshi

కార్యాచరణ ఖరారు చేసిన విద్యుత్‌ శాఖ

సాక్షి, అమరావతి: విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆర్థిక, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్‌ తయారు చేసినట్టు ఇంధనశాఖ ప్రకటించింది. నిధులు సమకూర్చుకోవడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే దీని ముఖ్యోద్దేశమని తెలిపింది. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి నేతృత్వంలో రూపొందించిన రోడ్‌మ్యాప్‌ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. 

నష్టాలకు బ్రేక్‌
► సాంకేతిక నష్టాలను కనిష్టంగా 12 శాతానికి తగ్గించాలని ఇంధనశాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019–20లో ఇవి 13. 36 శాతానికి తగ్గించటం ద్వారా చెప్పుకోదగ్గ పురోగతి సాధించినట్లు తెలిపారు. నిజానికి 2018–19లో 16.36 శాతంమేర సాంకేతిక నష్టాలు ఉన్నట్టు వివరించారు. 
► 2024–25 నాటికి ఏపీఈఆర్‌సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసర నివేదికకు, వాస్తవ ఖర్చుకు తేడా లేకుండా చూడాలని నిర్ణయించారు. ఈ గ్యాప్‌ 2019 లో యూనిట్‌ కు రూ.2.26 ఉండగా, 2020లో రూ.1.45కి తగ్గించారు. దీనివల్ల రూ 4,783 కోట్లు ఆదా చేయగలిగారు.

ఫీడర్ల విభజన
► గృహ, వ్యవసాయ ఫీడర్ల విభజన ద్వారా విద్యుత్‌ సరఫరాలో మరింత నాణ్యత పెంచనున్నారు. వ్యవసాయ విద్యుత్‌ లోడ్‌ ను గ్రీన్‌ ఎనర్జీ కిందకు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సోలార్‌  విద్యుత్‌తో వ్యవసాయ ఫీడర్లను అనుసంధానం చేయాలని విద్యుత్‌ శాఖ భావిస్తోంది.
► మౌలిక సదుపాయాల పెంపులో భాగంగా డిస్కమ్‌లు ఇప్పటికే 77 నూతన సబ్‌ స్టేషన్లు, 19,502. 57 కిలోమీటర్ల పొడవైన 33 కే వీ, 11 కే వీ ఎల్టీ లైన్లను పూర్తి చేశాయి. దీనికోసం రూ.524.11 కోట్లు ఖర్చు చేశాయి. 
► విద్యుత్‌ ప్రసార పంపిణీ వ్యవస్థను ఆధునీకరించే లక్ష్యంలో భాగంగా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ సేవల నిర్వహణకు  ప్రత్యేకంగా ఐటీ క్యాడర్‌ ను ఏర్పాటు చేయనున్నారు. సూపర్వైజరి కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్, డిస్ట్రిబ్యూటెడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను అన్ని స్థాయిల్లోనూ తీసుకురాబోతున్నారు. 

మరిన్ని వార్తలు