సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది!

22 Jan, 2019 07:12 IST|Sakshi
ఆర్‌వోబీ నిర్మించనున్న తిలారు గేటు రోడ్డు ఇదే

రూ.345.23 కోట్ల కేంద్ర నిధులతో నరసన్నపేట–పర్లాఖిమిడి రోడ్డు అభివృద్ధి

ఒక రోడ్డు విస్తరణ, రెండు ఆర్‌వోబీల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

రాష్ట్ర సర్కార్‌ హడావుడిపై ప్రజల విస్మయం

శ్రీకాకుళం ,అరసవల్లి:    ‘అత్త సొమ్ము.. అల్లుడి సోకు..’ అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్‌ తీరు. జాతీయ ప్రాజెక్టుల్లో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తోంది.  ఆ నిధులతో చేస్తున్న పనులను తామే చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డాబులకు పోతున్నారు. అదంతా తమ ప్రభుత్వ ఘనతే అని టీడీపీ ప్రభుత్వ పెద్దలు జబ్బలు చరుస్తున్నారు. ఆఖరికి జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) విస్తరణ పనులు కూడా తమ వల్లనే జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు బాహాటంగా చెప్పుకున్న విషయం  విదితమే. దేశాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏదైనా ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే..అదంతా రాష్ట్ర సర్కార్‌ అభివృద్ధి ఖాతాలోకి వేసుకుంటూ...ప్రచార ఆర్భాటాలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. తాజాగా   రాష్ట్రంలో రూ.16,878 కోట్లతో 1384 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులను విస్తరించేందుకు గాను 32 పనులకు కేంద్ర ఉపరితల, జల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో సోమవారం జరిగిన కార్యక్రమం వేదిక నుంచి శంకుస్థాపన చేశారు. ఇందులో సేతు భారతం ప్రాజెక్టు కింద 11 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలను (ఆర్‌వోబీ) కూడా నిర్మించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో రూ.345.23 కోట్లుతో ఒక అంతరాష్ట్ర సరిహద్దు రోడ్డు విస్తరణతో పాటు రెండు ఆర్‌వోబీల నిర్మాణ పనులకు కూడా ఆకివీడులోనే కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేశారు. అయితే ఇదంతా తమ ప్రభావమే అని జిల్లాలో టీడీపీ నేతలు హడావుడి చేయడం చూస్తుంటే జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

రూ.345.23 కోట్లతో పనులు..
జిల్లాలో కీలకమైన రహదారి అభివృద్ధిలో భాగంగా మూడు ప్రాజెక్టులనురూ.345.23  కోట్లుతో  నిర్మించేందుకు కేంద్రం నిర్ణయించింది. వీటిలో నరసన్నపేట జమ్ము జంక్షన్‌  నుంచి పాతపట్నం వరకు రోడ్డు విస్తరణ పనులతో పాటు ఇదే మార్గంలో రెండు చోట్ల రైల్వే రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు (ఆర్‌వోబీ) కూడా నిర్మించేందుకు ప్రతిపాదించారు. మొత్తం 39 కిలోమీటర్ల మేర ఉన్న నరసన్నపేట–పాతపట్నం ప్రధాన రహదారి విస్తరణకు రూ. 228.32 కోట్లు, అలాగే చల్లపేట వద్ద (తిలారు గేటు) వద్ద 1.4 కి.మీ పొడవున ఆర్‌వోబీ నిర్మాణం కోసం రూ.58.31 కోట్లు, పాతపట్నం పట్టణ సరిహద్దు వద్ద 1.46 కి.మీ పొడవున ఆర్‌వోబీ నిర్మాణం కోసం రూ.58.6 కోట్లు మేర కేంద్ర ప్రభుత్వ నిధులను మంజూరు చేశారు. ఈమేరకు ఈ మూడు ప్రాజెక్టు పనులను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రహదారుల అభివృద్ధి, పోర్టులు, రైల్వే, నదుల అనుసంధానం తదితర పనులకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తోంది. ఇప్పటికే పైడిభీమవరం నుంచి నరసన్నపేట వరకు తొలి దశగా నాలుగు లైన్ల జాతీయ రహదారిని (ఎన్‌హెచ్‌–16) ఆరు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.1423 కోట్లుతో  యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. దీంతో జిల్లా వాసులకు ప్రధాన రహదారి కష్టాలు తీరనున్నాయి. తాజాగా నరసన్నపేట–పాతపట్నం రహదారి విస్తరణతో పాటు ఎప్పటినుంచో కలగా ఉన్న తిలారు గేటు ఆర్‌వోబీ, పాతపట్నం ఆర్‌వోబీల నిర్మాణాలతో ఒడిశా, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాలకు రవాణా వ్యవస్థ మరింత సులభతరం అవుతుంది. చెన్నై–కోల్‌కత్తా రైల్వే మార్గంలో తిలారు స్టేషన్‌ సమీపంలో ఉన్న గేటుతో పాటు నౌపడ–గుణుపూర్‌ రైల్వే మార్గంలో ఉన్న పాతపట్నం గేటు వద్ద కూడా నిత్యం అంతరాయం ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇలాంటి ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.

రాష్ట్ర సర్కార్‌ హడావుడిపై సర్వత్రా  విమర్శలు
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ప్రతి ప్రాజెక్టును తమ అభివృద్ధిలో భాగమే అని ప్రకటించుకుంటున్న చంద్రబాబు సర్కార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కీలకమైన పోలవరం నుంచి, గ్రామీణ స్థాయిలో రోడ్డు విస్తరణ, నిర్మాణ పనుల వరకు అన్నింట్లో రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తున్నట్లుగా టీడీపీ పెద్దలు హడావుడి చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, జలవనరులు, రోడ్లు, ఇతరత్రా కేంద్ర పథకాలతో చేపడుతున్న అభివృద్ధిని పూర్తిగా తామే చేయించుకుంటున్నట్లుగా టీడీపీ పెద్దలు ప్రకటనలు చేస్తుండడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో కూడా కేంద్రం వాటా ఏమీ లేదని.. అంతా రాష్ట్ర ప్రభుత్వ ఘనతే అని సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటిస్తుండడం విడ్డూరంగా ఉందని వారంటున్నారు.

2020 మార్చి నాటికి విస్తరణ పనులు పూర్తి:
శ్రీకాకుళం జిల్లాలో జమ్ము జంక్షన్‌ (నరసన్నపేట) నుంచి పాతపట్నం (పర్లాఖిమిడి సరిహద్దు) వరకు జాతీయ రహదారి–326ఏ, విస్తరణకు, అలాగే రెండు ఆర్‌వోబీలకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులను రూ.345.23 కోట్లు మంజూరు చేసింది. ఈమేరకు ఈ పనులన్నీ వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం విస్తరణ పనులు గ్రౌండింగ్‌ అయ్యాయి. ఆర్‌వోబీల నిర్మాణాలకు మాత్రం కొంత భూసేకరణ సమస్యలు తలెత్తుతున్నాయి. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించి, బ్రిడ్జిల నిర్మాణాలను వేగవంతం చేస్తాం.     – ఎల్‌వి.సుబ్రహమణ్యం, ఈఈ, జాతీయ రహదారి విభాగం (విశాఖ).

మరిన్ని వార్తలు