మాయదారి ప్రతిపాదనలు 

30 Dec, 2018 12:48 IST|Sakshi
పట్టిసీమ వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డు మలుపు , పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన బస్సులు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే తొలి ప్రాధాన్యత అంటూ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ప్రగల్భాలు పలుకుతోంది. కానీ కనీసం ప్రాజెక్టుకు వెళ్లే ఏటిగట్టు రహదారిని ఇప్పటివరకు నిర్మించలేకపోయింది. సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఈ రహదారి నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న భారీ వాహనాల తాకిడికి గోతులమయంగా మారింది. రహదారి విస్తరణకు అధికారులు మూడుసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పైసా విదల్చలేదు.

పోలవరం రూరల్‌ : పోలవరం ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వం నాలుగున్నరేళ్లు గడిచినా కనీసం రహదారిని కూడా నిర్మించలేకపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పోలవరం చేరాలంటే సింగిల్‌ రోడ్డుగా ఉన్న ఏటిగట్టు మార్గమే దిక్కు. అది కూడా 60 మలుపులతో ప్రమాదకరంగా ఉంది. అయినప్పటికీ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు వినియోగించే భారీ యంత్రాలన్నీ ఈ ఇరుకు రోడ్డు మార్గంలో చేరాల్సిందే.

పోలవరం నుంచి కొవ్వూరు వరకు వెళ్లే రోడ్డు మార్గం ఐదున్నర మీటర్ల వెడల్పు ఉంది. దీనిలో కొంత మేర మూడున్నర మీటర్లకు కుచించుకుపోయింది. ప్రక్కిలంక నుంచి పోలవరం వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఒక వాహనం వెళ్తుంటే మరో వాహనం పక్కకు తప్పుకోవడానికి పాట్లు పడాల్సిన పరిస్థితి. దీంతో తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు మొత్తం గోతులమయంగా మారింది. కనీసం తాత్కాలిక మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. మూడేళ్ల కిందట సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు వచ్చిన సమయంలో ఏటిగట్టు రోడ్డు దుస్థితిని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

మూడుసార్లు ప్రతిపాదనలు
పోలవరం నుంచి కొవ్వూరు వరకు 30 కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్డును వెడల్పు చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు మూడుసార్లు సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏ ఒక్క ప్రతిపాదన ఇప్పటివరకు మంజూరు కాలేదు. రెండేళ్ల క్రితం ఏటిగట్టుపై ఆర్‌అండ్‌బీ రోడ్డు ఫోర్‌లైన్‌ నిర్మాణానికి రూ.300 కోట్లతో ప్రతిపాదన పంపారు. ఏమైందో ఏమో కానీ ఏడాదిన్నర క్రితం ఫోర్‌లైన్‌ స్థానే డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లతో మరో ప్రతిపాదనను తయారు చేసి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. ఏడాది క్రితం మరోసారి సర్వే చేశారు. ఈసారి జాతీయ రహదారిలో భాగంగా జీలుగుమిల్లి నుంచి పోలవరం మీదుగా కొవ్వూరు వరకు 85 కిలోమీటర్ల పొడవునా, పదిమీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు రూ.493 కోట్లతో మరో ప్రతి పాదన పంపారు. ఆ ప్రతిపాదనా అటకెక్కింది.

భారీ వాహనాల రాకపోకలు
ప్రా
జెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం సందర్శన పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తోంది. దీంతో నిత్యం రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి 100 బస్సులతో పాటు ఇతర వాహనాలు రాకపోకలు సాగి స్తున్నాయి. ఇవి కాక నిర్మాణ సామగ్రి కోసం భారీవాహనాలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, నిత్యం తిరిగే వాహనదారులతో రాకపోకలు పెరిగాయి. రోడ్డు మూడున్నర మీటర్ల వెడల్పు మాత్రమే ఉండడంతో తరచూ ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలను తప్పించబోయి పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఏటిగట్టు రోడ్డుపై ప్రయాణం అంటేనే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఏదో ఒక ప్రతిపాదనకు అంగీకరించి రహదారిని త్వరగా విస్తరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.  

అవస్థలు పడుతున్నాం
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లేందుకు ఉన్నది ఒక్కటే రోడ్డు మార్గం. ఈ రోడ్డు మార్గాన్ని విస్తరించకపోవడం వల్ల నిత్యం అనేక అవస్థలు పడుతున్నాం. దీనికి తోడు భారీ వాహనాల రాకపోకలతో మరింత ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా రోడ్డు వెడల్పు లేకపోవడంతో ఒకేసారి రెండు వాహనాలు తప్పుకునే పరిస్థితి లేదు. రోడ్డును వెడల్పు చేయాల్సి ఉంది. – బుగ్గా మురళీకృష్ణ, పోలవరం
నిధులు మంజూరు చేయాలి 

నిత్యం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి 100 బస్సులతో పాటు భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లాలంటే ఉన్నది ఒక్కటే రోడ్డు మార్గం కావడంతో అన్ని వాహనాలు ఈ రోడ్డు మార్గంలో వెళ్లాల్సిందే. గంటా శ్రీనివాసరావు, తాడిపూడి

మరిన్ని వార్తలు