నిలువెత్తు నిర్లక్ష్యం...

29 May, 2014 23:42 IST|Sakshi

ఒక తప్పు ఒకసారి చేస్తే పొరపాటు.. మరోసారి జరిగితే గ్రహపాటు అనుకోవచ్చు. ఒకే తప్పు పదేపదే జరుగుతూ ఉంటే అది కచ్చితంగా నిర్లక్ష్యమే... జిల్లాలో ఒకే ప్రాంతంలో  రైళ్లలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయంటే అది నిస్సందేహంగా రైల్వే అధికారుల బాధ్యతా రాహిత్యమే. పిడుగురాళ్ల-నడికుడి మధ్య రైళ్లలో పోలీసులు ఉండరనే విషయం గ్రహించి... సరిగ్గా ఆ ప్రదేశంలోనే రైళ్లలో దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా మహిళా బోగీలపైనే టార్గెట్ పెడుతున్నారు. గతంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏర్పాటుచేసిన మొబైల్ పోలీస్‌స్టేషన్ వ్యవస్థ నిర్వీర్యం కావడమే ఇందుకు దోహదమవుతోంది. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్వని అధికారులు దున్నపోతు మీద వర్షం పడిన చందాన వ్యవహరిస్తుండడం దోపిడీ దొంగలకు వరప్రసాదంగా మారుతోంది.
 
 సాక్షి, గుంటూరు: పదే పదే ఒకే ప్రాంతంలో రైళ్లలో దొంగతనాలు జరుగుతున్నా.. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారా? ఈ ప్రశ్నకు వరుసగా జరుగుతున్న దోపిడీలను బట్టి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. గత అనుభవాల నుంచి రైల్వే పోలీసులు ఏ మాత్రం గుణపాఠాలు నేర్వడం లేదు. సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా ఆ తర్వాత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
 
 గత మూడేళ్ల నుంచి రైళ్లలో దోపిడీలు ఎక్కువయ్యాయి. నడికుడి కేంద్రంగానే ఈ దోపిడీలు జరుగుతున్నాయి. పిడుగురాళ్ళ-నడికుడి రైలు మార్గంలో తప్పించుకునేందుకు అనువుగా ఉండడంతో మహిళా బోగీలనే టార్గెట్ చేసుకుని దోపిడీదొంగలు రెచ్చిపోతున్నారు. రైలు దోపిడీ దొంగల్ని ఎదుర్కొనేందుకు జీఆర్పీ పోలీసులకు ఆయుధాలిచ్చామని, కాల్చివేతకు ఆదేశాలిచ్చామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో దొంగతనాలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఒకేచోట వరుసగా దోపిడీలు చేస్తూ దోపిడీ దొంగలు రైల్వే పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దీంతో రైల్వే ప్రయాణికుల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది.
 
 తాజాగా గురువారం తెల్లవారుజామున చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళుతున్న చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడీకి పాల్పడ్డారు. నెలన్నర వ్యవధిలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో రెండోసారి దోపిడీ జరగడం రైల్వే పోలీసుల వైఫల్యాన్ని తేటతెల్లం చేస్తోంది. పిడుగురాళ్ల మండలంలోని తుమ్మలచెరువు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత మూడుకిలోమీటర్ల దూరంలో చైనులాగి రైలును ఆపిన సుమారు పదిమంది దుండగులు రిజర్వేషన్ బోగీల్లో ప్రవేశించి ప్రయాణికులకు కత్తులు చూపించి భయభ్రాంతులకు గురి చేశారు. ప్రతిఘటించిన ప్రయాణికుల్ని గాయపరిచి దోపిడీ సొమ్ముతో పరారయ్యారు. పోలీస్ అవుట్ పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దోపిడీ జరగడం గమనార్హం.
 
 స్టూవర్టుపురం దొంగలే వరుస దోపిడీలకు
 పాల్పడుతున్నారా?.. ఒంటికి నూనె రాసుకుని దోపిడీలకు పాల్పడడంలో ఆరితేరిన స్టూవర్టుపురం దొంగలు రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు గతం నుంచి అనుమానిస్తున్నారు. అయితే ఈ దిశగా విచారణ చేసిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దోపిడీల గుట్టు రట్టు చేయడం లేదు. రైల్వే పోలీసుల కదలికలు మొత్తం పసిగడుతున్న దోపిడీ దొంగలు పక్కా ప్రణాళికలు రూపొందించి మరీ దోచేస్తున్నారు. దోపిడీ జరి గిన సొమ్ముకు, పోలీసు అధికారులు వెల్లడిస్తున్న సమాచారానికి పొంతన లేకపోవడం పరిశీలనాంశం. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో తాజా దోపిడీలోనూ బాధితులు పోగొట్టుకున్న సొమ్ముకు, పోలీసులు చెబుతున్న సొమ్ముకు తేడా ఉండడం గమనార్హం.
 
 మొబైల్ పోలీస్ స్టేషన్ల ఊసేదీ?
 రైళ్లలో జరుగుతున్న దోపిడీలను నివారించేందుకు, కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు గతంలో కొన్నాళ్లు రైళ్లలోనే మొబైల్ స్టేషన్లు  ఏర్పాటు చేశారు. కానీ ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోవడం మానేశారు. బందోబస్తు విషయంలో జీఆర్పీ పోలీసులకు, ఆర్పీఎఫ్ పోలీసులకు నడుమ సమన్వయం లేకపోవడంతో దోపిడీ దొంగలకు దోపిడీ సులువుగా మారింది. వేసవి సమయంలో రైళ్లలో దొంగతనాలు జరుగుతాయన్న విషయం తెలిసినా, రైల్వే పోలీసులు నిర్లిప్తతగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు