అత్త ఇంటికి అల్లుడి కన్నం..

29 Mar, 2015 11:01 IST|Sakshi

దర్శి : జల్సాలు చేయటం రుచి మరిగిన ఓ అల్లుడు..అత్తవారింట్లోనే చేతివాటాన్ని ప్రదర్శించాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా దర్శి పంచాయతీ పరిధిలోని శివరాజ్‌నగర్‌కు చెందిన షేక్ సుభానీకి కురిచేడు గ్రామంలో టైలరింగ్ షాప్ ఉంది.  కొంత కాలం కిందట ఇతనికి దర్శికి చెందిన షేక్ నన్నేసాహెబ్ కుమార్తెతో వివాహం జరిగింది. అయితే సుభానీ గత కొన్ని రోజులుగా అత్తవారింట్లో మకాం వేశాడు. కాగా ఈనెల 24వ తేదీన నన్నేసాహెబ్ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ.3.25 లక్షల విలువైన 130 గ్రాముల బంగారం చోరీకి గురైందని నన్నేసాహెబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. దొంగతనం జరిగినప్పటి నుంచి అల్లుడు సుభానీ ప్రవర్తనలో మార్పు రావటం పసిగట్టి అతని కదలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం కురిచేడు రైల్వేస్టేషన్‌లో ఉన్న సుభానీని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రెండు జతల బంగారు కమ్మలను, అలాగే తన టైలరింగ్ షాపులో దాచిన 60 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు దర్శిలోని ఓ స్నేహితుడి ద్వారా 60 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు తెలిసింది. వచ్చిన డబ్బును జల్సాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో సుభానీ అంగీకరించాడు.
 

మరిన్ని వార్తలు