పాయసంలో మత్తు మందు కలిపి నిలువు దోపిడీ

2 Jan, 2014 23:34 IST|Sakshi

 సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ఇంటి యజమానికి మత్తు మందు కలిపిన పాయసం ఇచ్చి నిలువు దోపిడీ చేసిన సంఘటన గురువారం ఉదయం సిద్దిపేటలో వెలుగు చూసింది.  ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ కథనం మేరకు.. పట్టణంలోని ఎన్సాన్‌పల్లి రోడ్డులో గల నల్లపోచమ్మ నగర్‌లో ఎర్వ రేణుక (58) నివాసముంటోంది. ఆమె కుమారుడు స్వామి కుమార్ కంగ్టి మండలం తడ్కల్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. రెం డు నెలల క్రితం గుంటూరు ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ (35), లక్ష్మి (52)లు తాము భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నామని ఇల్లు  అద్దెకు కావాలని రేణుకను కోరారు. రూ. 800లతో అద్దెకు మాట్లాడుకుని అందులో నివాసముం టున్నారు.  
 
 అయితే వీరు తరచూ రే ణుక ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లేవారు. అం దులో భాగంగానే బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఇంటిలో పాయసం చేశామని, తీసుకోవాలని ఆ మహిలలు రేణుకను కోరారు. దీనిని స్వీకరించిన ఆమె మత్తుతో పడిపోయింది. వెంటనే ఆ ఇద్దరు మహిళలు రేణుక మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలు, చేతులకు ఉన్న ఐదు తులాల బంగారు గాజులను, చెవికి ఒక వైపు ఉన్న ఒక తులం కమ్మ, కాళ్లకు ఉన్న 16 తులాల వెండి పట్టీలను అపహరించి ఇల్లు ఖాళీ చేసి పరారయ్యారు. రేణుక ఇంటిలోనే మరో గదిలో అద్దెకు ఉన్నవారు గురువారం ఉదయం తలుపు తట్టగా ఆమె లేచి బయటకి వచ్చే సరికి నిలువు దోపిడీ విషయం అర్థమైంది. విషయం తెలిసిన కుమారుడు స్వామి ఇంటికి చేరుకుని తల్లిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. స్వామి  ఫిర్యాదు మేరకు తాము సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ కేవలం  సెల్‌ఫోన్ రీచార్జ్ కార్డు మాత్రమే లభించినట్లు ఎస్‌ఐ వివరించారు.
 

మరిన్ని వార్తలు