ఇంట్లో చోరీ జరిగిందంటూ ఎస్ఐ ఫిర్యాదు

22 Dec, 2015 17:32 IST|Sakshi

చిత్తూరు : పీలేరు ఎస్‌ఐ రాజశేఖర్‌ ఇంట్లో చోరీ జరిగింది. తన భార్య శోభారాణి, ఆమె బంధువులు మరో ఏడుగురు కలిసి చోరీకి పాల్పడినట్లు రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పీలేరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పీలేరు ఎస్‌ఐ, ఆయన భార్య మధ్య వివాదాలున్నాయి. కాగా తాను విధి నిర్వహణలో భాగంగా చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. తిరిగొచ్చేసరికి ఇంట్లోని రూ.46 వేల బంగారు ఆభరణాలు, కెమెరా, సర్టిఫికెట్లు చోరీకి గురైనట్లు ఎస్‌ఐ రాజశేఖర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన భార్య శోభారాణి, సమీప బంధువులు కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర, రాములమ్మ, నాగవేణి, పుష్ప, సులోచన, లక్ష్మి, హైదరాబాద్‌కు చెందిన సుజాతలపై ఆయన ఫిర్యాదు ఇచ్చారు.

తాను పనిచేస్తున్న పోలీసు స్టేషనలోనే ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. దీనిపై ఏఎస్‌ఐ సురేష్‌బాబు ఆదివారం కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రోజుల కిందట ఎస్‌ఐ రాజశేఖర్‌ భార్య శోభారాణి కర్నూలు జిల్లాలో ఎస్‌ఐ బంధువులు, స్నేహితులపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదయింది. అంతేకాకుండా శోభారాణి సోమవారం చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డిని కలిశారు. ఎస్‌ఐ రాజశేఖర్‌ తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా కిడ్నాప్‌ చేయడం, కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆమెకు ఏఎస్పీ కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఎస్‌ఐ రాజశేఖర్‌ను పిలిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు