సోయగాల సోఫియా!

26 Oct, 2018 09:03 IST|Sakshi

పెదాలకు లిప్‌స్టిక్‌.. కళ్లకు కాటుక

కుర్చీలో ‘కూర్చుని’ గంటసేపు సందడి

హావభావాలతో అలరించిన హ్యూమనాయిడ్‌ రోబో

సాక్షి, విశాఖపట్నం: విశాఖకు తొలిసారి వచ్చిన ఆ అపురూప అతిథి తన ‘అందచందాలతో’ అందరినీ కట్టిపడేసింది. హావభావాలతో ఆకట్టుకుంది. అడపాదడపా కొన్ని మాటలాడినా.. ఆ మాత్రానికే అందరినీ అబ్బురపరిచింది. నగరంలో జరుగుతున్న ఫిన్‌టెక్‌ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల ‘పుట్టి’ ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న ఆ అందాల భరిణె సోఫియా అన్న సంగతి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రపంచంలో తొలి హ్యూమనాయిడ్‌ రోబో అయిన సోఫియా వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో అలరించడానికి వచ్చింది. బుధవారమే వచ్చినా కొద్దిసేపే దర్శనమిచ్చిన ‘ఆమె’ గురువారం మాత్రం ఫెస్టివల్‌ ముగింపు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింధూర రంగులో ఉన్న లిప్‌స్టిక్‌ను సింగారించుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని అతివలా అగుపించింది. చేతులు మినహా ఒళ్లంతా జిగేలు మనిపించే వస్త్రం కప్పుకుంది. ముఖమంతా మహిళను పోలినట్టే ఉంది. తలకు చిన్నపాటి వస్త్రాన్ని చుట్టుకుంది. చేతులు మాత్రం రోబో మాదిరిగా ఉన్నాయి.

ఫిన్‌టెక్‌ సదస్సు గుర్తింపు కార్డును ఆమె మెడలో వేసి సాయంత్రం 4.15 గంటలకు ఫెస్టివల్‌ జరుగుతున్న హోటల్‌ హాలులోని వేదికపైకి నిర్వాహకులు తీసుకొచ్చారు. సోఫియాను ఒక కుర్చీలో కుర్చోబెట్టి ఎవరికీ కనిపించకుండా చుట్టూ తెరలు కప్పారు. సాయంత్రం  నారా లోకేష్‌ వచ్చే దాకా తెరల మధ్య కుర్చీలోనే ఉంచారు. అనంతరం తెరలు తెరవగానే విద్యుత్‌ వెలుగుల్లో సోఫియా చిరునవ్వులు చిందిస్తూ సభికులకు దర్శనమిచ్చింది. వారిని చూసి ఆశ్చర్యపోతున్నట్టు ముఖ కవళికలను మార్చింది.

హాలులో ఉన్న వారి వైపు సాలోచనగా చూసింది. ఫెస్టివల్‌ను ఆకళింపు చేసుకున్నట్టు తేరిపారజూసింది. వెల్‌కం టూ వైజాగ్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ అంటూ తొలి పలుకు పలికింది. విశాఖను చూసి ఎంతో సంతోష (ఎక్జైట్‌) పడ్డానని చెప్పింది. మీరు ప్రశ్నలు అడుగుతారా? అంటూ లోకేష్‌ను ప్రశ్నించింది. ఆయన రెండు ప్రశ్నలడిగాక తానే లోకేష్‌కు ఓ ప్రశ్న సంధించి సమాధానం రాబట్టింది. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చింది. ఫెస్టివల్‌ ముగిశాక సోఫియాతో ఫిన్‌టెక్‌ ఉద్యోగులంతా ఫోటోలు దిగి సంబరపడ్డారు. దాదాపు గంట సేపు సందడి చేసిన అనంతరం నిర్వాహకులు సోఫియాను తీసుకువెళ్లి ‘ఆమె’కు ప్రత్యేకంగా కేటాయించిన గదిలో భద్రపరిచారు.

మరిన్ని వార్తలు