‘ఆపరేషన్‌’ రోబో..!

10 Jun, 2018 02:22 IST|Sakshi

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 7 రోబోలు

హైదరాబాద్‌లో 6, విశాఖలో 1

యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో ఎక్కువ వినియోగం

రోబోటిక్‌ సర్జరీ శిక్షణ కోసం విదేశాలకు యువ వైద్యులు

రోబోటిక్‌ సర్జరీ వల్ల ఉపయోగాలివే..
♦  తక్కువ కోత పెట్టి, అతి స్వల్ప రక్తస్రావంతో, తక్కువ సమయంలోనే శస్త్రచికిత్స పూర్తి చేయడం
ఆపరేషన్‌ తర్వాతత్వరగా రోగి కోలుకోవడం
సాధారణ శస్త్రచికిత్సతో పోలిస్తే ఇన్షెక్షన్‌ రేటు,నొప్పి తక్కువ
ఇన్‌పేషెంటుగా ఎక్కువ రోజులు ఆస్పత్రిలోఉండాల్సిన అవసరం లేదు
♦  దీనివల్ల ఇన్‌పేషెంటు ఖర్చులు భారీగా తగ్గే అవకాశం

సాక్షి, అమరావతి: కొంతకాలం క్రితం వరకు కూడా ఎవరైనా రోగికి ఆపరేషన్‌ చేయాలంటే.. అవసరమైన చోట శరీరాన్ని కోసి, కత్తితో గాట్లు పెట్టి చేసేవారు. ప్రస్తుతం చేతికి ఒక చుక్కరక్తం కూడా అంటకుండానే శస్త్రచికిత్స పూర్తి చేసి, రోగికి జబ్బు నయం చేస్తున్నారు నేటి వైద్యులు.

ఈ క్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. తాజాగా రోబోటిక్‌ శస్త్రచికిత్సల వైపు వీరి దృష్టి మళ్లింది. వీటిపై అవగాహన పొందేందుకు ఏటా మనదేశం నుంచి 3 వేల మందిపైనే పాశ్చాత్య దేశాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోబోటిక్‌ సర్జరీలకు రోగులు అంగీకరిస్తున్న నేపథ్యంలో యువ వైద్యులు ఆ శస్త్రచికిత్సల వైపు అడుగులేస్తున్నారు.

రోబోటిక్‌ సర్జరీ ఇలా..
రోబోటిక్‌ సర్జరీ అత్యంత సులువుగా ఉంటుందనివైద్యులు చెబుతున్నారు. వైద్యుడు రెండు చేతులతో చేస్తే రోబో నాలుగు చేతులతో పనిచేస్తుంది. డాక్టర్లు కత్తులు, కత్తెర్లు చేతబట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రోబో చూసుకుంటుంది. అయితే ఓ కంప్యూటర్‌ వద్ద వైద్యుడు కూర్చుని రోబోకు కమాండ్స్‌ ఇస్తూ పర్యవేక్షిస్తుంటారు. కంప్యూటర్‌లో డాక్టర్‌ ఇచ్చే సూచనలకనుగుణంగా రోబో పనిచేస్తుంది.

నాలుగు చేతులున్న కంప్యూటర్‌ 360 డిగ్రీల కోణంలో రోగి శరీరం చుట్టూ ఎలాగైనా తిరిగి సర్జరీ చేయగలదు. రోబో చేతులకు అమర్చిన 3డి కెమెరాలు డాక్టర్‌కు కంప్యూటర్‌లో అత్యంత స్పష్టతతో చిత్రాలను చూపిస్తూ ఉంటాయి. మొత్తం కమాండ్స్‌ మీదే వ్యవస్థ పనిచేస్తుంది. డాక్టర్‌ నిర్ణయించిన సమయంలోగా రోబో సర్జరీ పూర్తిచేస్తుంది. ప్రత్యేక సర్జరీ ప్రోగ్రాంతో రూపొందించిన రోబో ఇప్పుడు రూ.12 కోట్లకు లభ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోబోలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోబోటిక్‌ సర్జరీలు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక రోబో ఉండగా, హైదరాబాద్‌లో యశోద, కిమ్స్, అపోలో, ఇండో–అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ ఆస్పత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ రోబోలు కేవలం ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రమే పరిమితమయ్యాయి. వ్యయం చేయలేకపోవడం, శిక్షణ పొందిన వైద్యులు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యవస్థ ప్రారంభం కాలేదు.

రోబోలను తయారుచేస్తున్న కంపెనీలే ఇక్కడి డాక్టర్లకు విదేశాల్లో శిక్షణ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 40 నుంచి 50 మంది వైద్యులు విదేశాల్లో రోబోటిక్‌ సర్జరీలో శిక్షణ పొందుతున్నట్టు అంచనా. ఎక్కువగా యూరాలజీ, క్యాన్సర్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ఈ రోబోటిక్‌ సర్జరీలు చేస్తున్నారు. త్వరలోనే మిగతా శస్త్రచికిత్సలకూ ఈ విధానాన్నే అమల్లోకి తెచ్చే పనిలో వైద్యులు ఉన్నారు.

ల్యాప్రోస్కోపీ తర్వాత ఇదే ఉత్తమ పద్ధతి
ఇన్నాళ్లూ ల్యాప్రోస్కోపీ పద్ధతే అత్యాధునికం. పెద్ద పెద్ద కోతల నుంచి ల్యాప్రోస్కోపీ ద్వారా రోగులకు ఉపశమనం కలిగింది. ఇప్పుడు ఆ స్థానాన్ని రోబోలు ఆక్రమించాయి. ఇందులో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులు మాత్రమే రోబోలకు సూచనలు చేయగలరు. యువ వైద్యులు ఎక్కువగా దీనిపై దృష్టి సారిస్తున్నారు. సర్జన్లు కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఉపయోగం ఉంటుంది. – డా.హరిచరణ్, జనరల్‌ సర్జన్, కర్నూలు ప్రభుత్వాస్పత్రి

మరిన్ని వార్తలు