‘రోబోటిక్స్’లో ‘గుడ్లవల్లేరు’ ప్రతిభ

28 Oct, 2013 00:58 IST|Sakshi

గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : రోబోటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ విద్యార్థులు మొదటి మూడు స్థానాలనూ కైవసం చేసుకుని ప్రతిభ చాటారు. గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్, ప్రతిష్టాత్మక ఐఐటీ ముంబయి వారు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పొట్లూరి రవీంద్రబాబు మాట్లాడుతూ రోబోటిక్స్ పోటీలతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం చేకూరుతుందన్నారు.

ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లోని విద్యార్థులకు రోబోల తయారీ, పని విధానాలపై అవగాహన పెంచి, వారిలో పరిశోధనాశక్తికి పదును పెట్టే సంకల్పంతో ముంబయి ఐఐటీ, ఆర్క్ టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంయుక్త నిర్వహణలో ఈ పోటీలు కొనసాగాయని తెలిపారు. అత్యాధునిక రోబోలను ఆవిష్కరించి, మానవ జీవన ప్రమాణాలు మరింత పెరిగేలా విద్యార్థులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వీ రామాంజనేయులు మాట్లాడుతూ పోటీల ముగింపు దశలో రోబోటిక్ రూపకల్పన సామర్థ్యంలో 125 మంది అభ్యర్థులకు జట్లవారీగా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

ముంబయి ఆర్క్ టెక్నో సొల్యూషన్స్ పరిశోధనా నిపుణుడు మహితో అమిత్ మాట్లాడుతూ విద్యార్ధులు శ్రద్ధ, పట్టుదల, ఉత్సాహాన్ని ప్రదర్శించి పోటీలను విజయవంతం చేశారన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేయూతనిచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ రామాంజనేయులుకు ఆయన అభినందన పత్రాన్ని అందజేశారు.
 
విజేతలకు బహుమతి ప్రదానం...

 రోబోటిక్స్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డాక్టర్ రవీంద్రబాబు బహుమతి ప్రదానాలు చేశారు. చివరిరోజు పోటీల్లో జోనల్ స్థాయిలో ప్రతిభ చాటిన విజేతలు 2014 మార్చిలో ముంబయి ఐఐటీలో జరిగే జాతీయ స్థాయి రోబోటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానాన్ని ఎన్.అనూష, జి.కీర్తి, ఎస్‌ఎస్.మహాలక్ష్మి, ఎఎంఎన్.సాయిలక్ష్మి, కెబి.శ్రీలక్ష్మి, ద్వితీయ స్థానాన్ని అదే కాలేజీకి చెందిన అబ్దుల్ హదీ, కె.కుసుమప్రియ, టి.స్వాతి, కేబీ కిశోర్, ఎం.శ్రీఅంక, తృతీయ బహుమతిని పీపీఆర్.సాయి ఫణికుమార్, కె.జ్యోత్స్నలత, టి.సాయి, సీహెచ్ నవ్యశ్రీ, కె.కుసుమకుమారి చేజిక్కించుకున్నారు.
 

మరిన్ని వార్తలు