హాస్టల్ వర్కర్ల రాస్తారోకో

12 Jul, 2015 01:29 IST|Sakshi
హాస్టల్ వర్కర్ల రాస్తారోకో

- ఐటీడీఏ వద్ద కొనసాగుతున్న దీక్షలు
- డీడీతో కొలిక్కిరాని చర్చలు
పాడేరు:
ఆందోళనలో భాగంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహాల డైలీవైజ్, క్యాజువల్ వర్కర్లు శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. బకాయి వేతనాలు చెల్లించాలని, తమను రెగ్యులర్ చేయాలని, డైలీవైజ్ వర్కర్లు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు శనివారం రెండోరోజు కొనసాగాయి. రాస్తారోకో చేసిన హాస్టల్ వర్కర్లు తమకు పీఎఫ్, గ్రాడ్యుటీ, ప్రమాదబీమా, యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పించాలని, కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, తొలగించిన క్యాజువల్ వర్కర్లను, హెల్త్ వలంటీర్ల్లనువిధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు.
 
దీక్షలకు పలు సంఘాల మద్దతు...

తమ డిమాండ్ల పరిష్కారం కోసం దీక్షలు చేపట్టిన హాస్టల్ వర్కర్లకు శనివారం పలు సంఘాలు మద్దతునిచ్చాయి. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.అప్పారావు, రూఢి అప్పారావు, కాంగ్రెస్ నాయకులు అశోక్, కెజియా, వుడా త్రినాథ్, గెమ్మెలి సర్పంచ్ అప్పలనాయుడు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు వి.భాగ్యలక్ష్మి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కె.అర్జున్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శంకురాజు ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించి హాస్టల్ వర్కర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.
 
డీడీతో చర్చలు విఫలం
హాస్టల్ వర్కర్ల సమస్యలపై గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎం.కమలతో శనివారం సీఐటీయూ నాయకులు ఉమా మహేశ్వరరావు, శ్రీను, హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలన్నచర్చలు జరిపారు. హాస్టల్ వర్కర్ల సమస్యలపై డీడీ కమల స్పందిస్తూ డైలీవైజ్, క్యాజువల్ వర్కర్లకు వేతన బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని, తొలగించిన క్యాజువల్ వర్కర్లందరిని ప్రభుత్వ అనుమతితో విధుల్లోకి తీసుకుంటామని, కలెక్టర్ గెజిట్ ప్రకారం పెరిగిన వేతనాలను ఎరియర్స్‌తో సహా చెల్లిస్తామని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు.

అలాగే పిఎఫ్, గ్రాడ్యుటీ, ఇన్సూరెన్స్ మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని, ప్రస్తుతం ఏజెన్సీలో పని చేస్తున్న 110 మంది డైలీవైజ్ వర్కర్లను రెగ్యులర్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదించామని, ప్రభుత్వ అనుమతి రాగానే వీటిని పరిష్కరిస్తామని ఆమె వివరించారు. నోటిమాట సరిపోదని, ఈ హామీలపై రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. దీంతో చర్చలు  కొలిక్కి రాలేదు.

మరిన్ని వార్తలు