అడ్డదారిలో అందలం

5 Jul, 2014 04:07 IST|Sakshi
అడ్డదారిలో అందలం

శ్రీకాకుళం కలెక్టరేట్: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం దాదాపు ప్రశాంతంగా జరిగాయి. మెజారిటీ మండలాలు దక్కించుకునే స్థితిలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ మరిన్ని స్థానాలు దక్కించుకోవాలన్న యావతో అధికార జులుం ప్రదర్శించింది. అనైతిక చర్యలు, ప్రలోభాలు, బెదిరింపులతో కొన్ని మండలాలను అదనంగా చేజిక్కించుకోగలిగినా.. మరికొన్ని మండలాల్లో ఆ పార్టీ ఎత్తులు పారలేదు.  జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి.

ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల ప్రకారం 22 మండలాల్లో టీడీపీ, 16 మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఆధిక్యం సాధించాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే సహజంగా అధ్యక్ష పీఠాలను సైతం ఇదే సంఖ్యలో గెలుచుకోవాల్సి ఉంది. కానీ అధికార దర్పం, అనైతిక చర్యలతో మరో నాలుగు పీఠాలను అదనంగా చేజిక్కించుకుంది. మొత్తం మీద టీడీపీ 26, వైఎస్‌ఆర్‌సీపీ 12 మండలాల్లో విజయం సాధించాయి. తనకు తగిన బలం లేని, అభ్యర్ధులు లేని మండలాల్లో టీడీపీ రెండు రోజులు ముందుగానే వ్యూహం ప్రకారం బలహీనవర్గాలకు చెందిన ఎమ్పీటీసీలను, ఇండిపెం డింట్లను ప్రలోభాలకు గురి చేసి తమకు అనుకూలంగా మలచుకున్నారు.
   
రాజాం మండలంలో వైఎస్‌ఆర్‌సీపీకి 8, టీడీపీకి 6గురు సభ్యులు ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ ఉన్నా రు. ఈ లెక్కన ఎక్కువమంది ఎంపీటీసీలు ఉన్న వైఎస్‌ఆర్‌సీపీకి అధ్యక్ష పదవి దక్కాలి. కానీ టీడీపీ నేతలు ఇండిపెండెంట్‌ను బెదిరించి, ఒక వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకొన్నారు. వారి సహకారంతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
   
వంగర మండలంలో టీడీపీ గ్రూప్ రాజకీయాలు ఎంపీపీ ఎన్నికల్లో వెలుగుచూశాయి. కళావెంకటరావు, ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఈ మండలంలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ ఎంపీపీ అభ్యర్ధి విషయంలో ఈ రెండు వర్గాలు చివరకు పరస్పరం పోటీ పడ్డాయి.
   
పలాసలో వైఎస్‌ఆర్‌సీపీకి మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు కొద్దిరోజులుగా ఇండిపెండింట్‌ను ప్రలోభ పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వైఎస్‌ఆర్‌సీపీకే ఇండిపెండెంట్ మద్దతు ప్రకటించడంతో టీడీపీ ఎత్తులు చిత్తయ్యాయి.
 
 హిరమండలంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్పీటీసీలను టీడీపీ నేతలు బెదిరించారు.ఆమదాలవలసలో టీడీపీ ప్రలోభాలు ఫలించాయి. కొందరు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలు చివరి క్షణంలో టీడీపీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఎగరేసుకుపోయింది. కాగా పోలీసులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తింంచారు. సమావేశం ఆవరణలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఫోన్‌లో మాట్లాడుతుండగా ఫోన్లు లాక్కున్నారు. అదే పోలీసులు, అధికారులు సమావేశ మందిరంలో నిబంధనలకు విరద్ధంగా టీడీపీ నేతలు ఫోన్లలో మంతనాలు సాగించినా పట్టించుకోలేదు.
 
 సీతంపేటలో వైఎస్‌ఆర్‌సీపీకే ఆధిక్యం ఉండగా, ఆ మండలాధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారి ప్రలోభాలకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలు ఏమాత్రం లొంగలేదు.బూర్జ మండలాధ్యక్ష  పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ విఫలయత్నం చేసింది. నిండు గర్భిణితో బలవంతంగా ఓటు వేయించే ప్రయత్నం చేసి, భంగపడింది.  కాంగ్రెస్, టీడీపీలు ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడినా..చివరకు న్యాయమే గెలిచి..పీఠాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది.
   
జి.సిగడాంలో టీడీపీ ఎమ్పీటీసీలు అధికంగా ఉన్నప్పటికీ ఎంపీపీ పదవికి అవసరమైన ఎస్సీ అభ్యర్ధి లేకపోవడంతో వారు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్ధిని సూరీడమ్మను ప్రలోభపెట్టి ఆమె చేత ఇండిపెండెంట్‌గా పోటీ చేయించారు. ఆమెకు మద్దతుగా ఓటేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించి సూరీడమ్మ పోటీ చేసినందున ఆమె ఎన్నికను రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు