అంగన్‌వాడీ చిన్నారులకు తప్పిన ప్రమాదం

26 Apr, 2019 11:23 IST|Sakshi
కూడేరులో అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల పక్కన పడిన పైకప్పు పెచ్చులు, దెబ్బతిన్న భవనం పైకప్పు

శిథిలావస్థలో అంగన్‌వాడీ భవనం

పైకప్పు పెచ్చులూడి పడిన వైనం

చిన్నారులకు పొంచి ఉన్న ప్రమాదం

నూతన భవనం నిర్మించాలని వేడుకోలు

అనంతపురం, కూడేరు: కూడేరులో 3వ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం చిన్నారులకు ప్రమాదం తప్పింది. అంగన్‌వాడీ కేంద్రం భవనం పైకప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలోనే గురువారం చిన్నారులు కూర్చొని ఉండగా పైకప్పు నుంచి సిమెంట్‌ పెచ్చులూడి కింద పడ్డాయి. పొరపాటున పిల్లల తలమీద పడి ఉంటే చిన్నారులు ప్రమాదానికి గురయ్యే వారు.  ఇంతకు మునుపు కూడా పిల్లలు లేని సమయంలో పెచ్చులూడి  కింద పడ్డాయి. కేంద్రంలో 20 మంది చిన్నారులు, అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా ఉంటారు. పెచ్చులూడుతున్న గదిలో కూర్చోవాలంటేనే   పిల్లలు, గర్భవతులు, బాలింతలు,  సిబ్బంది భయపడుతున్నారు.  పెచ్చులూడి ఎప్పుడు మీద పడతాయోనని  భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైన సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్మించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు