భక్త సాగరమై..

22 Sep, 2018 12:25 IST|Sakshi
రొట్టెలు మార్చుకుంటున్న భక్తులు

విద్య.. ఉద్యోగం.. పెళ్లి.. సంతానం.. ఆరోగ్యం.. సౌభాగ్యం.. తదితర తమ కోరికలు తీరాలంటూ భక్తులు స్వర్ణాల చెరువు బాట పట్టారు. కుల, మతాలకు అతీతంగా, మత సామరస్యాలకు ప్రతీకగా నిలిచే వరాల పండగ శుక్రవారం ప్రారంభమైంది. రొట్టెల పండగ కోసం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల నుంచి లక్షలాది మంది భక్తులు నెల్లూరు నగరంలోని బారాషహీద్‌ దర్గాకు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు ఆచరించి రొట్టెలు వదిలారు. మతబోధకులైన యుద్ధవీరుల త్యాగనిరతిని స్మరిస్తూ సమాధులను దర్శించారు. తొలి రోజు సుమారు 2 లక్షల మంది తరలివచ్చారని అధికార వర్గాలు అంచనా. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన గంధమహోత్సవం శనివారం అర్ధరాత్రి  జరగనుంది.

నెల్లూరు సిటీ: మతసామరస్యాలకు అతీతంగా నిర్వహించే రొట్టెల పండగ శుక్రవారం ప్రారంభమైంది. శుక్రవారం భక్తులు స్వర్ణాల చెరువు ఘాట్‌కు పోటెత్తారు. నగరంలోని దర్గామిట్టలోని బారాషహీద్‌ దర్గాలో ప్రతి ఏటా రొట్టెల పండగ ఘనంగా నిర్వహిస్తున్నారు. బారాషహీదులను దర్శించుకుని రొట్టెను పట్టుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన భక్తులు మళ్లీ తిరిగి రొట్టెను వదలడం ఆనవాయితీ. మొదటి రోజు ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాల నుంచి అధికంగా భక్తులు తరలివచ్చారు.

10 రొట్టెల బోర్డులు ఏర్పాటు
బారాషహీద్‌ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు పట్టుకునే భక్తుల కోసం కార్పొరేషన్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువు వద్ద భక్తులు తమకు కావాల్సిన రొట్టెను సులువుగా గుర్తించి పట్టుకునేందుకు బోర్డులు ఏర్పాటు చేశారు. వ్యాపార, నూతనగృహం, ప్రమోషన్, సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానం, వివాహం, ఉద్యోగం, విద్య, ధన రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ బోర్డుల వద్దకు భక్తులు వచ్చి రొట్టెలు పట్టుకుంటున్నారు.

అన్ని శాఖలు సమన్వయంతో..
దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేషన్, రెవెన్యూ, పోలీసు, ఇతరశాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఘాట్‌ నిర్వహణ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఘాట్‌ వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసింది.    నగరంలో వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు 10 పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో మొత్తం 120 మొబైల్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. రాత్రుళ్లు విద్యుత్‌ వెలుగులు కోసం దర్గా ఆవరణలో ప్రత్యేకంగా స్తంభాలు ఏర్పాటు చేశారు.

బారాషహీద్‌ దర్గా రోడ్డుకు ఇరుçవైపులా బారికేడ్‌లు..
బారాషహీద్‌ దర్గాకు వచ్చే క్రమంలో బయట వాహనాలు రానివ్వకుండా రెండు వైపులా పోలీసు శాఖ బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే  బారాషహీద్‌ దర్గా ఆవరణకు పంపిస్తున్నారు. దర్గాలో పోలీసు శాఖ  బందోబస్తు ఏర్పాటు చేసింది. 40 సీసీ కెమరాలతో, డ్రోన్‌ కెమరాలతో బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో నిఘా ఏర్పాటు చేసింది. పోలీస్‌ శాఖ నుంచి 2 వేలు మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. దర్గా ప్రాంగణంలో 50 సీసీ కెమరాలతో ప్రతి క్షణం నిఘాను ఏర్పాటు చేశారు. పోలీస్‌ అవుట్‌పోస్టు ద్వారా తప్పిపోయిన చిన్నారులు, వృద్ధులను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.

విధుల్లో నలుగురు మున్సిపల్‌ కమిషనర్‌లు
రొట్టెల పండగకు జిల్లాలోని నలుగురు మున్సిపల్‌కమిషనర్‌లు విధుల్లో ఉన్నారు. ఆత్మకూరు కమిషనర్‌ శ్రీనివాసులు, నాయుడుపేట కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, కావలి కమిషనర్‌ వెంకటేశ్వర్లు, గూడూరు కమిషనర్‌ ఓబిలేష్‌కు దర్గాలోని కొన్ని ప్రాంతాలను కేటాయించారు.  

మూడు షిఫ్ట్‌లుగా విధులు
నగర పాలక సంస్థ నుంచి 350 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. దర్గాను ఏడు జోన్లుగా విభజించి టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ శాఖల ఉద్యోగులకు విధులు కేటాయించారు. కమిషనర్‌ అలీంబాషా, అడిషనల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్‌ ఎస్‌ఈ రవికృష్ణంరాజు దర్గాలో ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పారిశుద్ధ్యం ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు కాంట్రాక్ట్‌ పద్ధతిన 800 మంది కార్మికులను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించుకున్నారు. వీరందరికీ మూడు షిఫ్ట్‌లుగా విధులు కేటాయించారు.  ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 320 మంది, మధ్యాహ్నం 2  నుంచి రాత్రి 10 గంటల వరకు 320 మంది రాత్రి 10  నుంచి ఉదయం 6 గంటల వరకు షిఫ్ట్‌కు 300 మంది కార్మికులు పనిచేస్తారు.

నేడు గంధమహోత్సవం
రొట్టెల పండగలో రెండో ఘట్టం గంధమహోత్సవం శనివారం జరగనుంది. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 గంధపు బిందెలతో ఊరేగింపుగా సాగి ఈద్గాకు చేరుతుంది. అక్కడ ఫకీర్ల విన్యాసాల నడుమ గంధాన్ని దర్గాకు తీసుకువస్తారు. అక్కడ కడప పీఠాధిపతి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం గంధాన్ని సమాధులకు పూసి, భక్తులకు పంచుతారు.

మరిన్ని వార్తలు