రూ.కోటికి ఎసరు!

20 Sep, 2018 09:42 IST|Sakshi
ఫుట్‌పాత్‌ నిర్మాణంలో పగుళ్లు ఏర్పాటు, పగుళ్లుకు పూత పనులు చేసిన దృశ్యం

నెల్లూరు సిటీ:  నగరంలోని బారాషహీద్‌ దర్గాలో ఏటా ఐదు రోజుల పాటు రొట్టెల పండగ చేస్తున్నారు. ఈ ఏడాది 21 నుంచి 25వ తేదీ వరకు రొట్టెల పండగ జరగనుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు, సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు కోసం నగర పాలకసంస్థ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పాలకవర్గం ఈ ఏడాది రొట్టెల పండగకు నెల రోజుల ముందు వరకు ప్రతిపాదనలు పేరుతో కాలయాపన చేసింది. రొట్టెల పండగకు 20 రోజులకు ముందు హడావుడిగా పనులు ప్రారంభించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా> సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. దర్గా ఆవరణలో మొత్తం కిలో మీటరు మేర సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. 20 రోజుల కిందట దర్గాలోకి ప్రవేశించే ప్రాంతం నుంచి స్వర్ణాచెరువు వరకు 500 మీటర్లు సీసీ రోడ్డును నిర్మించారు. మరో 500 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించేందుకు 10 రోజుల క్రితం మేయర్‌ అజీజ్‌ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే అధికారులు మాత్రం కేవలం 10 రోజుల ముందు సీసీ రోడ్డు నిర్మిస్తే తాము బలికావాల్సి వస్తుందని కమిషనర్‌ అలీంబాషాకు విన్నవిచుకోవడంతో ఆ పనులను వాయిదా వేశారు. 

పండగ సమీపిస్తున్నా కొనసాగుతున్న పనులు.. 
ఈ నెల 21వ తేదీ నుంచి రొట్టెల పండగ అధికారికంగా ప్రారంభమవుతుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో బారాషహీద్‌ దర్గాకు వస్తున్నారు. పండగ సమీపిస్తున్నా కాంట్రాక్టర్లు పనులు చేస్తూనే ఉన్నారు. విద్యుత్‌ స్తంభాలు, ఫుట్‌పాత్‌ నిర్మాణం, చెట్లు ఏర్పాటు, ఘాట్‌ మరమ్మతులు ఇంకా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా దర్గా వద్ద రూ.13 లక్షలతో  నిర్మిస్తున్న ఫుట్‌పాత్‌ పనులను చేయడంపై విమర్శలు వస్తున్నాయి. భక్తులు రద్దీ ఎక్కువైతే ఫుట్‌పాత్‌ నిర్మాణం పాడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫుట్‌పాత్‌ నిర్మాణంలో పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఈ ఫుట్‌పాత్‌ ఎందుకు నిర్మించారో అని వచ్చిన భక్తులు ప్రశ్నిస్తున్నారు.

రూ.1.20 కోట్లు నామినేషన్‌ కింద కేటాయింపు 
రొట్టెల పండగ ఏర్పాట్లు కోసం ఈ ఏడాది మొత్తం రూ.2.50 కోట్ల పనులకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. రూ.1.30 కోట్లు కార్పొరేషన్‌ రిసెప్షన్, సీసీరోడ్లు, ఫుట్‌పాత్‌లు, విద్యుత్‌ దీపాలు, శానిటరీ కార్మికులు ఇలా వివిధ రకాల పనులను టెండర్‌ రూపంలో కేటాయించారు. అయితే మరో రూ.1.20 కోట్లతో నామినేషన్‌ కింద హడావుడిగా పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. అత్యవసరం పేరుతో ఇష్టారాజ్యంగా పనులను అధికార పార్టీ అనుచరులకు, అధికారులకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను గుట్టు చప్పుడు కాకుండా కేటాయించారు. దర్గా చుట్టూ స్టీల్‌ రైలింగ్, ఎలక్ట్రికల్‌ పనులకు రూ.31 లక్షలు, స్వర్ణాల చెరువులో మోటార్లు ఏర్పాటుకు, వాటర్‌ స్టాల్స్, చెట్లును ఏర్పాటు చేసేందుకు, టపాసులు, షామియానాలు, టెంట్లు, ఇతర మరమ్మతులకు రూ..52 లక్షలతో పనులు అప్పగించారు. ఈ పనులకు సంబంధించి పండగ అనంతరం స్టాండింగ్‌ కమిటీ సభ్యులతో ఆల్‌పాస్‌ చేయించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాలక వర్గంలోనికి కీలక వ్యక్తి చెందిన ఓ వ్యక్తికి రెండు శాతం వాటాలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ అంగీకరించినట్టు సమాచారం. స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు కూడా వాటాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సీసీ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిపివేయండి 
స్వర్ణాల చెరువు వద్దకు నిర్మించిన సీసీ రోడ్డుకు వాటర్‌ క్యూరింగ్‌కు ఏర్పాటు చేసిన పెచ్చులు ఇంకా తొలగించకపోవడంపై కమిషనర్‌ అలీంబాషా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ సుబ్బరాజుకు బిల్లులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పండగ సమీపిస్తున్నా పనులు పూర్తిస్థాయిలో చేయకపోవడంపై కాంట్రాక్టర్‌ తీరుపై మండిపడ్డారు. అనంతరం దర్గా పరిసరాల్లో పనులను అడిషనల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రవికృష్ణంరాజుతో కలిసి పరిశీలించారు.

>
మరిన్ని వార్తలు