కోర్కెలు తీర్చే రొట్టెల పండుగ వచ్చింది

7 Sep, 2019 09:59 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : రొట్టెల పండగకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. దర్గాలోని షహీద్‌లను (అమరుల సమాధులను) దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. బారాషహీలను స్మరిస్తూ తమ కోర్కెలను తీర్చుకోవాలని భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. కోరిన కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ తిరిగి రొట్టెను వదులుతారు. మళ్లీ మరో కోరిక రొట్టెను పట్టుకుని తీసుకెళుతుంటారు. మతసామరస్యాలకు ప్రతీకగా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ఏటా 10 లక్షల నుంచి 12 లక్షలు మంది భక్తులు హాజరవుతుంటారు.

షహీద్‌లు కొలువున్న చోటే బారాషహీద్‌ దర్గా 
టర్కీ నుంచి మహ్మద్‌ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్‌ సుల్తాన్‌లకు మధ్య పవిత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్‌ బేగ్‌తో పాటు 11 మంది వీర మరణం పొందారు. వారి తలలు గండవరంలో తెగి పడగా వీరుల మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయి. వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12 సంఖ్యను ఉర్దూలో బారా, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలువబడతారు. అందుకే ఈ దర్గాకు బారాషహీద్‌ అనే పేరొచ్చింది.

తలలు తెగిపడిన చోట
గండవరంలో జరిగిన పవిత్ర యుద్ధంలో మత ప్రచారకుల 12 మంది తలలు తెగి పడ్డాయి. వాటిలో 7 మాత్రమే లభ్యమయ్యాయి. అవన్నీ సమాధులుగా మారిన చోటే నేడు సాతోషహీద్‌(సాత్‌ అంటే ఏడు, షహీద్‌ అంటే అమరులు) దర్గాగా పిలువబడుతుంది.

షహదత్‌తో ప్రారంభం 
మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజున రొట్టెల పండగ ప్రారంభమవుతుంది. తొలి రోజు షహద్‌త్‌తో ప్రారంభవుతుంది. తర్వాత రోజు గంధమహోత్సం చేస్తారు. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌ల సమాధులకు లేపనం చేసి, భక్తులకు పంచుతారు. మరుసటి రోజు తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. తహలీల్‌ ఫాతెహాతో పండగ ముగుస్తుంది.

4,500 మంది పారిశుధ్య కార్మికులతో 
బారాషహీద్‌ దర్గా ఆవరణ, స్వర్ణాలచెరువు, పార్కింగ్‌ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేసేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 4,500 మంది కార్మికులను కాంట్రాక్ట్‌ పద్ధతిన తీసుకోనున్నారు. కార్మికులను మూడు షిఫ్ట్‌లుగా విభజించి పనులు చేయిస్తారు. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు, 2 నుంచి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు షిఫ్ట్‌లుగా విభజించారు. చెత్తను ప్రతి నిమిషం తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, శానిటరీ సూపర్‌వైజర్‌లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు, మేస్త్రీలకు ప్రాంతాలు వారీగా విధులు కేటాయించారు. 

8 వేల చదరపు అడుగుల్లో వసతి సదుపాయం
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సేద దీరేందుకు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 8 వేలు చదరపు అడుగులతో జింక్‌ షీటింగ్, షామియానాలు ఏర్పాట్లు చేశారు. ఐదు రోజుల పండగ సమయంలో వర్షం వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. మంత్రి అనిల్, నెల్లూరురూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కల్యాణమండపాల నిర్వాహకులతో మాట్లాడి వర్షం వచ్చిన సమయంలో కల్యాణ మండపాల్లో సేదదీరేందుకు ఏర్పాట్లు చేశారు.  స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి నిరంతరాయంగా భోజనాలు, తాగునీరు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. 

ప్రతిష్టాత్మకంగా నిర్వహణకు ఏర్పాట్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి తర్వాత మొదటి సంవత్సరం నిర్వహిస్తున్న రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పాలకులు, అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించి, సంతోషంగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో అవసరం లేకపోయినా ఆర్భాటంగా ఖర్చులు చేసి కార్పొరేషన్‌ నిధులను దుర్వినియోగం చేశారు. భక్తుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోలేదు.


దుకాణాలు ఏర్పాటుకు కొలతలు వేస్తున్న దృశ్యం 

అన్ని శాఖల సమన్వయంతో.. 
రొట్టెల పండగకు అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేం దుకు మంత్రి అనిల్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు కలెక్టర్, ఎస్పీలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్‌ శాఖ, కార్పొరేషన్, విద్యు త్, ఆర్టీసీ, అగ్ని మాపక ఇతర శాఖల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 

7 జోన్లుగా దర్గా ఆవరణలో విభాగాలు కేటాయింపు 
బారాషహీద్‌ దర్గా ఆవరణ మొత్తాన్ని 7 జోన్లుగా విభజించారు. మొదటి జోన్‌లో దుకాణాలు, పోలీసు కంట్రోల్‌ రూమ్, రెండో జోన్‌లో వాటర్‌ స్టాల్స్, దుకాణాలు, మరుగుదొడ్లు, శానిటరీ కార్యాలయం ఉంటాయి. మూడో జోన్‌లో షెల్టర్‌లు, దుకాణాలు, ఆసిఫ్‌ హుస్సేన్‌ బాబా దర్గా, నాల్గో జోన్‌లో ముసిఫిర్‌ ఖానా, సయద్‌ అహ్మద్‌ బాబాదర్గా, రిసెప్షన్‌ సెంటర్, ఐదో జోన్‌లో పిల్లల ఆట స్థలం, వాటర్‌ స్టాల్స్, దుకాణాలు, ఆరో జోన్‌లో బారాషహీద్‌ దర్గా, దర్గా కార్యాలయం ఉంటుంది. ఏడో జోన్‌లో పొదలకూరు రోడ్డును ఉంచారు.


షవర్‌ బాత్‌ల వద్ద పనులు చేస్తున్న కూలీలు  

50 కెమారాలతో నిఘా 
బారాషహీద్‌ దర్గా ఆవరణ మొత్తం 50 కెమారాల నిఘాలో ఉండనుంది. 40 ఫిక్స్‌డ్‌ కెమారాలు, 8 రొటేడెడ్‌ కెమారాలు, రెండు డ్రోన్‌లతో నిరంతరం ని«ఘాలో ఉండనుంది. దర్గా ఆవరణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పోలీసు శాఖ 5 మానిటరింగ్‌ టీవీల్లో వీక్షించనున్నారు. స్వర్ణాలచెరువు వద్ద రెడ్‌ మార్కును ఎవరైనా భక్తులు దాటితే అప్రమత్తం చేసేందుకు ఓ కెమారాను ఏర్పాటు చేశారు. భక్తులు రెడ్‌ మార్కు దాటగానే పోలీసుశాఖను అలర్ట్‌ చేస్తుంది. హైటెక్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌ ఆధ్వర్యంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ద్వారా బారాషహీద్‌ దర్గాలోకి ఎంత మంది భక్తులు వస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు కౌంటింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.


దర్గా ఆవరణను ఏడు జోన్‌లుగా ఏర్పాటుచేసిన చిత్రం   

మరిన్ని వార్తలు