‘అధికార వికేంద్రీకరణే శరణ్యం’

10 Jun, 2018 13:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జస్టిస్‌ ఈశ్వరయ్య, జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, జస్టిస్ ఎ.గోపాలరావు, జస్టిస్‌ బి.శేషశయన రెడ్డి, జస్టిస్ జి.క్రిష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యఅతిధులుగా మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, మాజీ అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి విచ్చేశారు. రాయలసీమకు హైకోర్టు కావాలని కోరడం న్యాయమైన కోరిక అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. 11 రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టులు మరో చోట ఉన్నాయని గుర్తు చేశారు.

అలా ఒప్పుకోవద్దు: ఐవైఆర్‌
రాయలసీమలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. రాజధానిలో హైకోర్టు, రాయలసీమలో బెంచ్ అంటే ఒప్పుకోవద్దని సూచించారు. రాయలసీమ, కళింగాంధ్ర అభివృధ్దికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఏకపక్ష నిర్ణయాలు: కల్లం
ఏపీ రాజధాని విషయంలో పాలకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అజయ్‌ కల్లం ఆరోపించారు. అధికార పార్టీ నేతలు కొన్న భూముల ధరల పెంపు కోసమే అంతా ఒకేచోట అంటున్నారని తెలిపారు. ప్రధాన నిర్ణయాలు ప్రజాభిప్రాయంతో తీసుకోవడమే పరిపక్వ ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. సిడ్నీలో చిన్న ఎయిర్‌పోర్ట్‌ కోసం అందరినీ ఒప్పించడానికి 20 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యమన్నారు.

>
మరిన్ని వార్తలు