మూడోవంతు బస్సులు రాజమండ్రికే..

17 Jul, 2015 02:46 IST|Sakshi

సగం రూట్లలో ప్రైవేటు వాహనాలే దిక్కు
 
 ఒంగోలు : పుష్కరాల పుణ్యమాని మూడోవంతు బస్సులు రాజమండ్రికే పరిమితమయ్యాయి. దీంతో సగం రూట్లలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ప్రైవేటు వాహనాలే ప్రజలకు దిక్కయ్యాయి. జిల్లాలో మొత్తం 750 సర్వీసులున్నాయి. వాటిలో పాతిక బస్సులు ఎప్పుడూ సర్వీసింగ్‌లో ఉంటుంటాయి. అంటే తిరిగేది కేవలం 725 మాత్రమే. వాటిలో 120 సర్వీసులు సుదూర ప్రాంతాలైన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాయి. వాటిని మినహాయిస్తే మిగిలిన బస్సుల సంఖ్య 605. వీటిలో మరో 15 సర్వీసులు అద్దెకు ఇచ్చారు.

అంటే మిగిలిన సర్వీసుల సంఖ్య 590. వాటిలో 70 బస్సులను పుష్కరాల ప్రారంభంలోనే రాజమండ్రికి పంపారు. పుష్కరాలు జరిగినంత కాలం ఈ బస్సులన్నీ రాజమండ్రి డిపో పరిధిలోనే సేవలు అందిస్తాయి. రోజువారీ మరో 50 బస్సులు జిల్లానుంచి పుష్కరాలకు ప్రయాణీకులను తీసుకొని వెళ్తున్నాయి. అదే విధంగా మరో 50 బస్సులు రాజమండ్రి నుంచి ఒంగోలు వస్తున్నాయి. దీని ప్రకారం మొత్తం 170 బస్సులు రాజమండ్రికి పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఇక ప్రత్యేకంగా ఎవరైనా బస్సులు బుక్ చేసుకుంటే రాజమండ్రికి 34 గంటలు చొప్పున బస్సులను అద్దెకు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే గురువారం మరో 50 పల్లెవెలుగు సర్వీసులను రాజమండ్రికి పంపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అదనంగా మరో 50 సర్వీసులు రాజమండ్రికి బయల్దేరాయి. దీంతో 230 బస్సులు పుష్కరాలకే కేటాయించినట్లయింది. ఇక మిగిలింది కేవలం 360. అంటే మొత్తం మూడు వంతుల్లో రెండు వంతులు మాత్రమే జిల్లాలో తిరుగుతున్నాయి.  ఒక వంతు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీకి ఆదాయం తక్కువగా ఉన్న రూట్లలో బస్సులను తగ్గించేశారు. దీంతో ఆయా మార్గాలలో ప్రజలకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారిపోయాయి. శుక్ర, శనివారాలలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 50 సర్వీసులను జిల్లానుంచి పుష్కరాలకు తిప్పేందుకు అధికారులు యత్నిస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు