ఇసుక, మద్యం అక్రమార్కులపై రౌడీషీట్‌

31 May, 2020 04:39 IST|Sakshi

పాత నేరస్తులు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ 

ఆస్తుల జప్తునకు చర్యలు  

సాంకేతిక పరిజ్ఞానంతో దాడులు

ఇన్ఫార్మర్ల వ్యవస్థ పటిష్టం– చెక్‌పోస్టుల ద్వారా నిఘా

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాల కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టినట్టు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ వెల్లడించారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించే దిశగా డీజీపీ సవాంగ్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఈబీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

► ఇసుక, మద్యం అక్రమ రవాణాలో పట్టుబడే వారిపై కఠిన చర్యలు చేపడతాం. ప్రత్యేక నిఘా వ్యవస్థతో మెరుపుదాడులు నిర్వహిస్తాం.
► అక్రమాలకు పాల్పడే పాత నేరస్థులపై పీడీ యాక్టు ప్రయోగిస్తాం. ఎస్‌ఈబీ హెచ్చరికలను పెడచెవిన పెట్టి నిబంధనలు ఉల్లంఘించే అక్రమార్కులపై రౌడీషీట్స్‌ తెరిచే యోచనలో ఉన్నాం.
► పట్టుబడిన అక్రమార్కుల ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటాం. వారిని వెంటనే రిమాండ్‌కు పంపించేలా న్యాయ వ్యవస్థనూ సంప్రదిస్తున్నాం. మద్యం, ఇసుక అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేస్తాం.
► రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉండే ఇసుక, సిలికాన్, గ్రావెల్‌ నిల్వలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. 
► ఇసుక అక్రమంగా తరలింపు, మద్యం అక్రమ రవాణా, మద్యం అక్రమ తయారీపై నిఘా పెంచాం. రాత్రివేళల్లోను గస్తీని ముమ్మరం చేశాం. మొబైల్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. 
► ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రత్యేకంగా ఉపయోగించుకుంటున్నాం.
► అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను ఇప్పటికే గుర్తించాం. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తాం. 
► ప్రత్యేకంగా ఇన్ఫార్మర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఎస్‌ఈబీ అధికారులు ఎంత పటిష్టంగా పనిచేస్తున్నప్పటికీ ప్రజల సహకారం కూడా కీలకమే. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరిస్తే ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో ఎస్‌ఈబీ సాధిస్తుంది. 
► గడిచిన 15 రోజుల్లో ఇసుక అక్రమాలకు పాల్పడిన 955 మందిపై 485 కేసులు నమోదు చేసాం. 730 వాహనాలు సీజ్‌ చేశాం. 29,629.075 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నాం.

మరిన్ని వార్తలు