ఆరు మృతదేహాలు గుర్తింపు

23 Oct, 2019 11:17 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి:  రాయల్‌ వశిష్ట బోటు ప్రమాద బాధితుల కోసం హెల్ప్‌ డెస్క్‌ఏర్పాటు చేశారు. పోలీసులు...బాధిత కుటుంబాలతో ఏర్పాటు చేసిన వాట్సాప్‌ గ్రూప్‌లో బంధువులకు సమాచారం ఇచ్చారు. బాధితులకు సమాచారం అందించడంతో వారంతా తమవారిని గుర్తించేందుకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తల్లిదండ్రుల ఆవేదన నిలువరించడం ఎవరి తరం కావడం లేదు. అలాగే నల్గొండకు చెందిన రవీందర్రెడ్డి తల్లిదండ్రులు కూడా మృతదేహాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఆరు మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు.

కాగా 41వ రోజుల అనంతరం మునిగిపోయిన బోటును ఎట్టకేలకు గోదావరి నుంచి బయటకు తీశారు. బోటు వెలికితీసిన అనంతరం అందులో 8 మృతదేహాలు దొరికాయి. ఆ మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మార్చరీలో భద్రపరిచారు. మృతేహాలు బోటులోని ఓ గదిలో ఉండిపోవడంతో గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అయితే వరంగల్‌కు చెందిన కొమ్ముల రవి ఆధార్‌ కార్డు లభించడంతో మృతదేహాన్ని బంధువులు గుర్తించారు. వరంగల్ కు చెందిన బస్కే ధర్మరాజును గుర్తించారు. అలాగే రాయలు వశిష్ట బోటు డ్రైవర్లు పోతా బత్తుల సత్యనారాయణ, సంగాడి నూకరాజు, నల్గొండకు చెందిన సురభి రవీందర్, బోట్ హెల్పర్ పట్టిసీమకు చెందిన కర్రి మణికంఠ మృతదేహాలను కూడా కుటుంబీకులు గుర్తుపట్టారు. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాలను అప్పగిస్తారు.  

సెప్టెంబర్‌ 15న కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బోటులో 77మంది ఉన్నారు. వారిలో 26మంది పర్యాటకులు సురక్షితంగా బయటపడగా, 46మంది మృతి చెందారు. మరో అయిదుగురు గల్లంతు అయ్యారు. మరోవైపు ఇంకా లభించాల్సిన అయిదు మృతదేహాల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారు. 

ధర్మాడి సత్యం బృందం తిరుగు పయనం
ఆపరేషన్‌ రాయల్‌ వశిష్టను పూర్తి చేసుకుని ధర్మాడి సత్యం బృందం తిరుగుపయనం అయింది. ఈ సందర్భంగా ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ప్రతికూల పరిస్థితులు ఉన్నా...తీవ్రంగా శ్రమించి బోటును ఒడ్డుకు చేర్చామన్నారు. గతంలో చాలా బోట్లు వెలికి తీశామని, అయితే రాయల్‌ వశిష్ట బోటు వెలికితీయడం చాలా కష్టంతో కూడుకుందని అన్నారు. ప్రవాహంతో ఉన్న నదిలో నుండి బోటును ఒడ్డుకు తీయడం మాటలు కాదని, రెండు గంటల్లో  మునిగిపోయిన బోటునుఒడ్డుకు తీసేస్తానని చెప్పిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శివ చెప్పిన మాటలకు మీడియా విస్తృత ప్రచారం కల్పించడం విచారకరమన్నారు. అతని వద్ద ఓ తాడు లేదు... సిబ్బంది లేరని ధర్మాడి సత్యం పేర్కొన్నారు. లాంచీలోనే పడుకుని ఉదయం ఆరు గంటలకు లేచి, సాయంత్రం వరకూ బోటు వెలికితీతకు శ్రమించినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు