ఇందిరమ్మ’కు వాస్తుదోషం!

15 Apr, 2016 03:34 IST|Sakshi
ఇందిరమ్మ’కు వాస్తుదోషం!

చియ్యేడులో మూఢ నమ్మకం
ఇళ్లు నిర్మించి ఐదేళ్లు పూర్తి అయినా ఒక్కరూ గృహప్రవేశం చేయని వైనం
►  రూ.10 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనానికీ తాళం

 
సాంకేతిక పరిజ్ఞానం శరవేగంతో పరుగులు తీస్తున్న రోజులివి. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్న కాలమిది.. అయినా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు నేటికీ సమసిపోవడం లేదు. అందుకునిదర్శనమే అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు గ్రామం. ఈ గ్రామంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వాస్తు సరిగా లేదన్న కారణంగా ఎవరూ గృహప్రవేశాలు చేయకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారుు. వీటి సమీపంలోనే రూ.10 లక్షలతో  నిర్మించిన పంచాయతీ భవనానిదీ అదే పరిస్థితి.
 

చియ్యేడు (అనంతపురం అర్బన్/రూరల్):  అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడుకు 2010-11 ఆర్థిక సంవత్సరంలో 250 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఊరిలోనే 150 మంది లబ్ధిదారులు సొంత స్థలంలోనే ఇళ్లు నిర్మించుకున్నారు. సొంత స్థలం లేని 100 మందికి ఇళ్లు కట్టించేందుకు ఊరికి ఎగువ ప్రాంతంలో 2.50 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని రూ.5 లక్షలు వెచ్చించి ప్రభుత్వం  కొనుగోలు చేసింది. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.70 వేలు మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించారు. తొలుత 50 మంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకున్నారు. ఇక తలుపులు కిటికీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.  మిగిలిన 50 మంది కూడా పునాది పనులు పూర్తి చేసుకున్నారు.


 మరేమయ్యింది...
 50 ఇళ్లు గృహ ప్రవేశాలకు ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో ఊరికి ఎగువ భాగంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వాస్తుదోషం ఉంది... అందులో ఎవరూ చేరినా బాగుపడరనే ఒక వదంది ఊరంతా పాకింది. దీంతో ‘ఇందిరమ్మ’ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన మొదలయ్యింది. చేరాలా వద్దా అనే సంశయంలో పడిపోయారు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. చివరికి అందులో చేరకూడదని అంతా నిర్ణయించుకున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం పునాది పనులు చేసిన వారు కూడా అంతటితో నిలిపివేశారు.

 పంచాయతీ భవనానికి ఇదే గతి...
 ఇందిరమ్మ ఇళ్ల సమీపంలో రూ.10 లక్షలు వెచ్చించి 2010-11 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. అరుుతే వాస్తుదోషం వదంతితో ఈ కార్యాలయం కూడా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం విశేషం. అప్పుడు వేసిన తలుపులు ఇప్పటికీ తెరుచుకోలేదు.
 
 
 వాస్తుదోషముందని చెప్పారు

 ఊరికి ఎగువన నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వాస్తు దోషం ఉందని చెప్పారు. దీంతో అందులోకి చేరేందుకు ఎవ్వరమూ ఇష్టపడడం లేదు. ఇళ్లను కట్టేందుకు స్థలం సేకరిస్తున్నప్పుడే ఆ స్థలం వద్దని కూడా చెప్పాం. అయినా వినిపించుకోకుండా అధికారులు స్థలాన్ని కొనుగోలు చేసి ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించారు. - పూజారి పెద్ద వెంకటరాముడు, గ్రామస్తుడు
 
  ఎవరూ చేరలేదని మేమూ పోలేదు
అక్కడ కట్టిన ఇళ్లలో ఎవరూ చేరడం లేదు. వాస్తు దోషం అంటున్నారు. అదేమిటో మాకు తెలియదు. ఎవరైనా చేరితే మేమూ చేరుదామనుకున్నాం. ఎవరూ పోలేదు కాబట్టి మేము పోవడం లేదు. - చంద్రకళ,  గ్రామస్తురాలు

మరిన్ని వార్తలు