ఏసీబీ వలలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

8 Apr, 2016 05:14 IST|Sakshi
ఏసీబీ వలలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం
పోలీస్ శాఖలో కలకలం


 నెల్లూరు(క్రైమ్):  ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. చెప్పుల వ్యాపారి వద్ద నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం కార్యాలయానికి తరలించారు. వివరాలు.. నగరంలోని సీఆర్పీ డొంకకు చెందిన మహ్మద్ యూసఫ్ అహ్మద్ 20 ఏళ్లుగా ఆత్మకూరు అండర్ బ్రిడ్జి సమీపంలోని ఫుట్‌పాత్‌పై చెప్పుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామారావు జనవరి 20వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజుల నుంచే యూసఫ్ అహ్మద్‌ను నెలకు రూ.ఐదు వేలు ఇవ్వమని,  పక్కన ఉన్న దుకాణాల వద్ద నుంచి సైతం  మామూళ్లు వసూలు చేసి ఇవ్వమని చెప్పారు.

తాను ఇవ్వలేనని చెప్పడంతో ఫుట్‌పాత్‌పై నుంచి ఖాళీ చేయమని ఒత్తిడి తెచ్చాడు. వేధింపులు తాళలేని బాధితుడు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఇన్‌స్పెక్టర్‌కు సిఫార్సు చేయించుకున్నా లాభం లేకుండా పోయింది. ఇటీవల రామారావు బాధితుడికి ఫోన్ చేసి నగదు ఇవ్వాలని, లేనిపక్షంలో ఇబ్బంది పెడతానని చెప్పాడు. నెలకు రూ.ఐదు వేలు ఇవ్వలేని పక్షంలో.. ఆర్నెల్లకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రామారావు ఫోన్‌ను యూసఫ్ రికార్డ్‌చేశాడు. రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించి సదరు రికార్‌‌డను వినిపించాడు. వారి ఆదేశాల మేరకు మామూళ్లు ఇస్తామని ఇన్‌స్పెక్టర్‌కు తెలిపారు.

దీంతో గురువారం రాత్రి ఇన్‌స్పెక్టర్ రామారావు బాధితుడికి ఫోన్ చేసి పూలమార్కెట్ వద్దకు నగదు తెచ్చి ఇవ్వమని చెప్పి అక్కడ నుంచి పప్పులవీధికి వెళ్లిపోయాడు. బాధితుడు పూలమార్కెట్ వద్దకు వెళ్లగా అక్కడ రామారావు లేకపోవడంతో ఫోన్ చేశాడు. పప్పులవీధిలోని వినాయకస్వామి గుడి వద్దకు రావాల్సిందిగా ఇన్‌స్పెక్టర్ సూచించారు. యూసఫ్ అక్కడికి వెళ్లి తన రూ.పది వేల నగదును ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. రామారావు నగదును తన పక్కనే ఉన్న డ్రైవర్ ఓబులేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్‌రావు, ఇన్‌స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రెండో నగర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


 విచారించిన డీఎస్పీ
 రెండో నగర పోలీస్‌స్టేషన్లో ఇన్‌స్పెక్టర్ రామారావును ఏసీబీడీఎస్పీ విచారించారు. విచారణ సందర్భంగా వాయిస్ రికార్డ్‌ను వినిపించగా.. ఆ స్వరం తనది కాదని రామారావు బుకాయించారు. దీనిపై ఏసీబీ డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఏ వరకు చదువుకున్నావు..  ఫుట్‌పాత్ వ్యాపారిని బెదిరించి డబ్బులు తీసుకునే స్థాయికి దిగజారావా అంటూ అసహ్యించుకున్నారు. అనంతరం ఆయన్ను వాహనంలో విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఓ బృందం లక్ష్మీపురంలోని ఇన్‌స్పెక్టర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది.


నగదు కోసం తీవ్రంగా వేధించారు: యూసఫ్ అహ్మద్, బాధితుడు
ఇన్‌స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల నుంచే నన్ను మామూళ్లు ఇవ్వమని నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. మామూళ్లు ఇవ్వకపోతే వ్యాపారం చేసేందుకు ఒప్పుకోనని బెదిరించాడు. పలువురు ప్రజాప్రతినిధులతో చెప్పించినా.. వినలేదు. ఇటీవల మరింత వేధింపులకు గురిచేయడం ప్రారంభిచాడు. అప్పటికి తాను అంత ఇవ్వలేనని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.

మరిన్ని వార్తలు