అమాత్యుని లయ.. అంతా మాయ!

29 Apr, 2019 04:33 IST|Sakshi

మంత్రి ఉమ ఇలాకాలో రూ.100 కోట్ల భూ కబ్జా..  వీఆర్‌టీఏ సొసైటీకి చెందిన భూమి అన్యాక్రాంతం 

అర్హులైన సభ్యులకు చెందాల్సిన ప్లాట్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం 

మంత్రి జోక్యంతో సీఆర్‌డీఏ,కో ఆపరేటివ్, రిజిస్ట్రేషన్‌ శాఖల నిర్లక్ష్యం 

విలువైన భూమిని ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నా పట్టించుకోని వైనం 

ఒక్కో ప్లాటును ఇద్దరు ముగ్గురికి అమ్మడంతో తరచూ గొడవలు 

చీమలు పెట్టిన పుట్టల్ని పాములు ఆక్రమించుకున్నట్టు చిరుదోగ్యులు తమ ఇళ్ల కోసం కొనుక్కున్న భూమిని ప్రభుత్వ పెద్దలు బినామీ పేర్లతో కబ్జా చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన రిజిస్ట్రేషన్‌ శాఖ  అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన సీఆర్‌డీఏ కబ్జాదారుల క్రయవిక్రయాలకు అనుమతిచ్చేసింది. ప్రజలకు సహకరించాల్సిన సహకార శాఖ అక్రమార్కులకు అండగా నిలుస్తోంది. ఫలితంగా విజయవాడ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (వీఆర్‌టీఏ)కు చెందిన దాదాపు రూ.100 కోట్ల విలువైన తొమ్మిదెకరాల భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఇది రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇలాకా అయిన మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఈ భూ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. నిజమైన సభ్యులకు చెందాల్సిన ప్లాట్లతో కబ్జాకోరులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. ఈ దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్న ప్రభుత్వ శాఖల తీరును గమనిస్తే దీని వెనుక మంత్రి ఉమా అండ దండలున్నాయనేది స్పష్టమవుతోందని బాధిత సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.                
  – సాక్షి, అమరావతి

తప్పుదోవ పట్టించే నివేదికలు
విజయవాడ కేంద్రంగా ప్రైవేటు లారీ ఆఫీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులతో 1970లో విజయవాడ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(వీఆర్‌టీఏ) ఏర్పడింది. విజయవాడ వన్‌టౌన్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకుని దాదాపు 400 మంది చిరుద్యోగులు ఈ అసోసియేషన్‌లో చేరారు. సొంతింటి స్థలం పొందాలనే ఆశయంతో 1980లో ఇబ్రహీంపట్నంలో 9 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందుకు లారీ యజమానులు, సంఘ సభ్యులు విరాళాలు అందించారు. అప్పట్లో దాని విలువ రూ.3.50 లక్షలు. ప్రస్తుతం మార్కెట్‌లో దాదాపు రూ.వంద కోట్లు ఉంటుంది. వీఆర్‌టీఏలో సభ్యులకు స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించుకునేలా 1980 డిసెంబర్‌లో కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. సొసైటీ పేరుతో ఆ భూమిని ఇబ్రహీంపట్నం సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించారు. ఎంఐజీ, ఎల్‌ఐజీ పేరుతో 250, 150 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి సభ్యులకు కేటాయించాలని నిర్ణయించారు.

1981లో కొత్త కార్యవర్గం ఏర్పడటంతో సమస్యలు మొదలయ్యాయి. విజయవాడ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(వీఆర్‌టీఏ) పేరును 1997లో విజయవాడ గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌(వీజీటీఏ)గా మార్పు చేశారు. మళ్లీ 2000లో దాన్ని ‘ది విజయవాడ గూడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌’గా పేరు మార్చారు. విలువైన భూమిపై కన్నేసిన కొందరు ఆ తర్వాత వీఆర్‌టీఏ హౌసింగ్‌ సొసైటీని కూడా మూసేస్తూ దాని పేరిట ఎలాంటి భూమి లేదని ప్రకటించారు. గతంలో సొసైటీ బాధ్యుడిగా ఉన్న వ్యక్తి దగ్గర పని చేసిన ఉద్యోగి ఇదే భూమిలో రెండంతస్తుల భవనం కట్టి, అక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలను పర్యవేక్షిస్తున్నాడు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ అధికారులు.. మంత్రి జోక్యంతో తప్పుదోవ పట్టించే నివేదికలతో నిజమైన సభ్యులకు అన్యాయం చేస్తున్నారు. ఈ అక్రమాలకు ప్రభుత్వానికి చెందిన సీఆర్‌డీఏ, కో ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్, రిజిస్ట్రేషన్‌ తదితర శాఖలు తమవంతు సహకారం అందిస్తున్నాయి.  

జోరుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం  
వాస్తవంగా వీఆర్‌టీఏ కో ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన సభ్యులకు దక్కాల్సిన ప్లాట్లు కబ్జా కోరల్లో చిక్కుకుపోయాయి. దీంతో కబ్జాకోరులు ప్రభుత్వ శాఖల సహకారంతో ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ఈ ప్లాట్లతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెర తీశారు. సర్వే నంబర్లు 214/2ఏ, 3ఏలలో 2.13 ఎకరాలు, 207/2లో 4సెంట్లు, 214/2ఏ, 2బీలలో 2.12 ఎకరాలు, 214/2బీ,3బీలలో 4.48 ఎకరాలు చొప్పున సుమారు 9 ఎకరాలు ఉండాలి. కానీ అందులో 214/2ఏ, 2బీలలో 2.12 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని గతంలోనే ప్రకటించగా, మిగిలిన మూడు సర్వే నంబర్లలో 139 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతిపాదిత 318 ప్లాట్ల లేఔట్‌లో 179 ప్లాట్లు అన్యాక్రాంతమయ్యాయి. వాస్తవంగా సభ్యులైన 20 మందికి మాత్రమే ప్లాట్లు కేటాయించగా మిగిలినవి బినామీ పేర్లతో బయటి వ్యక్తులకు కట్టబెట్టారు. కబ్జాదారులు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను తొలుత సేల్‌డీడ్‌గా జరిపించి ఆ దస్తావేజులను ఎవరికీ చూపొద్దని చెబుతున్నట్టు సమాచారం. స్థానిక సబ్‌ రిజిస్టార్‌ ఆఫీసును ప్రలోభపెట్టి కొన్నేళ్లుగా ప్లాట్ల వివరాలు బయటకు పొక్కకుండా చూశారు. హౌసింగ్‌ సొసైటీలో సభ్యులు కాని ఆనేక మందికి ఇష్టారాజ్యంగా ప్లాట్లను అమ్ముకున్నారు. దీంతో ఆ ప్లాట్లలో 27 పక్కా భవనాలు కూడా వెలిశాయి. మిగతావన్నీ ఖాళీ ప్లాట్లుగా ఉన్నప్పటికీ, ఒక్కో ప్లాటును ఇద్దరు, ముగ్గురుకి విక్రయించారని సమాచారం. కొన్న వారు తమదంటే తమదని స్థలం వద్ద తరచూ ఘర్షణలకు దిగుతున్నారు. ఈ 9 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులను కూడా విజయవాడలోని ఒక బ్యాంకులో మార్ట్‌గేజ్‌లో పెట్టినట్టు తెలిసింది.

న్యాయం జరిగే వరకు పోరాడతాం 
భూ కుంభకోణంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం. రికార్డులు తారుమారు చేసి ప్లాట్లను అన్యాక్రాంతం చేస్తున్న కబ్జాదారులకు కొన్ని ప్రభుత్వ శాఖలు సహకరిస్తున్నాయి. దీనిపై హైదరాబాద్‌లో లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాం. న్యాయం చేయాలని లోకాయుక్త ఆదేశించినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల అధికారులకు, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదులు చేశాం. ఆ భూమిని కబ్జా కోరల నుంచి కాపాడి నిజమైన సొసైటీ సభ్యులకు అందే వరకు పోరాటం సాగిస్తాం. 
– బొజ్జా రాఘవరావు,వీఆర్‌టీఏ మాజీ కార్యదర్శి  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు