పేదల ఇళ్లకు రూ.13,411 కోట్లు  

20 Feb, 2020 05:02 IST|Sakshi

నాబార్డు 2020–21 రుణ అంచనాలు

ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

గ్రామీణ ప్రాంతాల్లో రుణాల మంజూరు సరళీకృతం చేయాలని సూచన

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు బలహీన వర్గాల గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాబార్డు రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో పేర్కొంది. ఉగాది సందర్భంగా మార్చి 25వ తేదీన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని, ఐదేళ్లలో వారందరికీ గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందని 2020–21 రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.8,615 కోట్లు కేటాయించిందని, 2020–21లో గృహ నిర్మాణాల రుణ అంచనా రూ.13,411.22 కోట్లు అని పేర్కొంది.

ఇది 2019–20 కంటే 6.44 శాతం ఎక్కువ. ఇళ్లకు జియో ట్యాగింగ్‌ వల్ల నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నిర్మాణాల్లో జాప్యాన్ని నివారించవచ్చని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో వేతనాలు పొందుతున్న వారికే గృహ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని, అయితే గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు కూడా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది. గృహ నిర్మాణాలకు రుణాల మంజూరు విధానాన్ని మరింత సరళతరం చేయాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో తొలిసారిగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం వేల ఎకరాలను స్థలాల రూపంలో ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం. 

మరిన్ని వార్తలు