బోర్డు తిప్పేశారు

20 Apr, 2016 04:49 IST|Sakshi
బోర్డు తిప్పేశారు

ఓ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రూ.2  కోట్లకు కుచ్చుటోపీ
రెండు నెలలుగా సంస్థ కార్యాలయానికి తాళం
లబోదిబోమంటున్న బాధితులు

 
 
 సాక్షి, కర్నూలు:  ‘‘షోరూమ్, రెస్టారెంట్, షాపు, సెలూన్.. ఏదైనా పర్వాలేదు.. అందులో మా కంపెనీకి చెందిన ఎల్‌ఈడీ టీవీని ఏర్పాటు చేసుకోండి.. నెలకు రూ. 5వేలు అద్దెగా పొందండి’’ ... ఈ ప్రకటన చదివిన వారెవరైనా అబ్బా ఇదేదో మంచి అవకాశం.. షాపులో ఉంటూ ఏం చక్కా ప్రతినెలా రూ. 5వేలు సంపాదించొచ్చు అని ఎగిరి గంతేస్తారు. మన జిల్లాలో  వారూ ఇలాగే చేశారు. కంపెనీ షరతులను అంగీకరించి.. వారికి డిపాజిట్ చెల్లించారు. తక్షణమే ఆ కంపెనీ టీవీలు తెచ్చి వారి షాపుల్లో అమర్చింది. రెండు నెలలు అద్దె డబ్బులు వచ్చాయి. మూడో నెల నుంచి అదిగో.. ఇదిగో అంటూ చివరకు చేతులెత్తేశారు. ఇలా డిపాజిట్ రూపంలో సేకరించిన కోట్లాది రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఓ అడ్వటైజింగ్ ఏజెన్సీ నిర్వాకం ఇది.


 ఇదీ కథ..
అడిటస్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్.. హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్ కేంద్రంగా పనిచేస్తోంది. డిజిటల్ యాడ్స్‌కు బ్రాండింగ్ చేయడమే ఈ సంస్థ పని. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మన జిల్లాకు సంబంధించి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని యూ కాన్ కాంప్లెక్స్‌లో ఆరునెలల క్రితం కార్యాలయాన్ని ప్రారంభించింది. ‘సంస్థకు చెందిన ఎల్‌ఈడీ టీవీని ఏర్పాటు చేసుకుని.. ప్రతి రోజూ ఉద యం నుంచి సాయంత్రం వరకు(టీవీ ఆయా వ్యాపార సంస్థల యాడ్స్ వస్తుంటాయి) 9 గంటలపాటు ఆన్‌చేసి ఉంచితే చాలు ప్రతినెలా రూ. 5 వేల అద్దె చెల్లిస్తాం’ అంటూ ప్రకటనలు గుప్పించారు. దీంతో కర్నూలు నగరంతోపాటు ఆదోని, నంద్యాల పట్టణాల్లోని వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న యువకులు   ఆకర్షితులయ్యారు. 

ముఖ్యంగా మొబైల్ షాపులు, టిఫిన్ సెంటర్లు, మీ సేవ కేంద్రాలు, ఆటో మొబైల్ షాపులు, హాస్పిటల్స్, జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు వీరి వలలో పడ్డారు. టీవీ ఏర్పాటు చేయాలంటే అడ్వాన్స్‌గా రూ. 40 వేలు చెల్లించాలని సంస్థ పెట్టిన షరతు మేరకు డీడీలు చెల్లించి టీవీ ఏర్పాటు చేయించుకున్నారు. వీరికి రూ. 5 వేలు చెల్లించే విధంగా కంపెనీ.. మూడు పోస్టు డేటెడ్ చెక్‌లను(పీడీసీ) ఇచ్చింది. మొదటి రెండు నెలలు అందరికీ అద్దె డబ్బులు అందాయి. తర్వాత ఫిబ్రవరి నుంచి చెల్లింపులు ఆగిపోయాయి.  బాధితులు  బ్రాంచ్ మేనేజర్‌ను ప్రశ్నించగా అదిగో ఇదిగో అంటూ చివరకు నెల రోజులుగా కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఇలా సుమారు 500 మంది నుంచి వసూలు చేసిన రూ. 2కోట్లకు కంపెనీ కుచ్చుటోపీ పెట్టింది.
 
 కంపెనీ డెరైక్టర్లనుఅడగండి..

అడిటస్ సంస్థ మోసాలను తెలుసుకున్న ‘సాక్షి’.. సంస్థ మేనేజర్ శ్రీనివాస్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అతని తండ్రి ఫోన్‌లో మాట్లాడాడు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదన్నారు. కంపెనీకి డెరైక్టర్లున్నారని, వారి నుంచి వివ రణ తీసుకోవాలన్నారు.
 
 నోటీసులు పంపారు..
 మాకు నెలసరి అద్దె చెల్లించకపోగా ప్రస్తుతం కంపెనీ డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేదంటూ మాకు నోటీసులు పంపారు. ఇది ఎంతవరకు న్యాయం. ఇలాంటి వారి నుంచి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటే మంచిది

మరిన్ని వార్తలు